UN: ‘ఆకలితో అలమటిస్తున్నారు.. సంతానాన్ని అమ్ముకుంటున్నారు.. ఆదుకోండి’

అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశ ప్రజల పరిస్థితులు దయనీయంగా మారిపోయాయి. తినేందుకు తిండి దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు.......

Updated : 30 Jan 2022 12:18 IST

అఫ్గాన్‌లోని దుర్భర పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ఆందోళన

జెనీవా: అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్న తర్వాత ఆ దేశ ప్రజల పరిస్థితులు దయనీయంగా మారిపోయాయి. తినేందుకు తిండి దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు. ఈ దుర్భర పరిస్థితులపై ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఆకలి చావుల నుంచి తప్పించుకునేందుకు తమ శరీర భాగాలతోపాటు పిల్లలను విక్రయిస్తున్నట్లు వాపోయింది. దేశంలోని సగానికి పైగా జనం ఆకలితో అల్లాడుతున్నారని.. మానవతా దృక్పథంతో అఫ్గాన్‌ ప్రజలకు సాయమందించాలని డబ్ల్యూఎఫ్‌పీ చీఫ్‌ డేవిడ్‌ బేస్లీ ప్రపంచ దేశాలకు మరోసారి విజ్ఞప్తి చేశారు.

జర్మనీకి చెందిన జాతీయ మీడియాతో డేవిడ్‌ బేస్లీ మాట్లాడుతూ ‘అఫ్గానిస్థాన్‌ గత 20 ఏళ్లుగా తాలిబన్లతో పోరాడుతూ.. ప్రపంచంలోనే అత్యంత పేద దేశాల జాబితాలో చేరిపోయింది. ప్రస్తుతం భారీ విపత్తును ఎదుర్కొంటోంది. దేశంలోని 40 మిలియన్ల (4 కోట్లు) మందిలో 23 మిలియన్ల (2.3 కోట్లు) మంది ఆకలితో అలమటిస్తున్నారు’ అని పేర్కొన్నారు. తన కుమార్తెను పోషిస్తారనే ఆశతో.. నిస్సహాయ స్థితిలో ఆమెను వేరే కుటుంబానికి విక్రయించినట్లు ఓ అఫ్గాన్‌ మహిళ తనతో చెప్పారని బేస్లీ వెల్లడించారు.

కరోనా మహమ్మారి, కరువు కారణంగా ఆఫ్గానిస్థాన్ ఆర్థికంగా క్షీణించిపోయింది. దాదాపు 24 మిలియన్ల మంది ప్రజలు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది ముగిసేసరికి దేశ జనాభాలోని 97 శాతం మంది దారిద్య్ర రేఖకు దిగువన పడిపోవచ్చని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. పలు దేశాలు ఆర్థిక సాయంతోపాటు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నప్పటికీ.. వారి సాయం ఏమాత్రం సరిపోవడం లేదు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ప్రజలు..  చిన్నారులను కాపాడుకొనేందుకు తమ జీవితాలను పణంగా పెడుతున్నారు. శరీర భాగాలను విక్రయిస్తున్నారు. హెరాత్‌ ప్రావిన్స్‌లో కొన్ని నెలలుగా కిడ్నీల విక్రయాలు పెరిగిపోయాయి. చాలామంది కిడ్నీలు అమ్మేందుకు ముందుకొస్తున్నారని అక్కడి వైద్యులు పేర్కొంటున్నారు.‘నేను బయటకు వెళ్లి డబ్బులు అడుక్కోలేను. అందుకే ఆసుపత్రికి వెళ్లి నా కిడ్నీని లక్షా 69 వేలకు అమ్మేశా. ఆ డబ్బుతో కనీసం నా పిల్లలకు కొంతకాలమైనా తిండి పెడతాను’ అని గులాం హజ్రత్‌ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం స్థానిక మీడియాతో మాట్లాడాడు. అఫ్గాన్‌లో చాలామంది తండ్రులు ఇదేతరహా వ్యథలో ఉన్నట్లు వాపోయాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని