Australia PM: రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆస్ట్రేలియా ప్రధాని

Australia PM Anthony Albanese: ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్‌ రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు.

Published : 15 Feb 2024 10:23 IST

సిడ్నీ: ఆస్ట్రేలియా (Australia) ప్రధాని ఆంథోని అల్బనీస్‌ (Anthony Albanese) మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. జోడీ హైడన్‌తో తన ఎంగేజ్‌మెంట్‌ (Engagement) జరిగినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రధాని గురువారం వెల్లడించారు. ఇద్దరూ కలిసి దిగిన సెల్ఫీని పోస్ట్‌ చేస్తూ.. ‘ఆమె అంగీకారం తెలిపింది’ అని రాసుకొచ్చారు. ఆయనకు అధికార, ప్రతిపక్ష నేతలు శుభాకాంక్షలు తెలిపారు. పదవిలో ఉండగా ఓ ప్రధాని వివాహం చేసుకోవడం ఆస్ట్రేలియాలో ఇదే తొలిసారి. 

60 ఏళ్ల అల్బనీస్‌.. 2020లో మెల్‌బోర్న్‌లో జరిగిన బిజినెస్‌ డిన్నర్‌లో తొలిసారి హైడన్‌ను కలిశారు. ఆ పరిచయం ప్రేమగా మారి గత నాలుగేళ్లుగా వీరిద్దరూ సహజీవనంలో ఉన్నారు. 2022లో జరిగిన ఫెడరల్‌ ఎన్నికల సమయంలోనూ ఆయన హైడన్‌తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో ప్రధానిగా ఎన్నికైన తర్వాత.. అధికారిక పర్యటనలకూ ఆమెను వెంట తీసుకెళ్లారు. హైడెన్‌ ప్రస్తుతం న్యూ సౌత్‌ వేల్స్‌ పబ్లిక్‌ సర్వీస్‌ అసోసియేషన్‌లో అధికారిణి.

ఇక ప్రధాని అల్బనీస్‌కు ఇది రెండో వివాహం. న్యూ సౌత్‌ వేల్స్‌ డిప్యూటీ ప్రీమియర్‌ కార్మెల్‌ టెబట్‌ను 2000 సంవత్సరంలో ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి 23 ఏళ్ల కుమారుడు ఉన్నారు. 19 ఏళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ 2019లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని