Super Tuesday primaries: ‘సూపర్‌ ట్యూస్‌డే’ ప్రైమరీల్లో బైడెన్‌, ట్రంప్‌ హవా

Super Tuesday primaries: అమెరికాలో అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం మంగళవారం 15 రాష్ట్రాల్లో రెండు ప్రధాన పార్టీల ప్రైమరీలు జరిగాయి. రిపబ్లికన్‌ పార్టీలో ట్రంప్‌, డెమోక్రాటిక్‌ పార్టీలో బైడెన్‌ తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకున్నారు.

Published : 06 Mar 2024 11:54 IST

వాషింగ్టన్‌: అమెరికాలో రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్‌ ట్రంప్‌, జో బైడెన్‌ మధ్య పోరు దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా జరిగిన ఆయా పార్టీల ప్రైమరీల్లో ఇరువురు భారీ గెలుపును నమోదు చేశారు. ‘సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల’ (Super Tuesday primaries) పేరిట మంగళవారం 15 రాష్ట్రాలు, ఒక టెరిటరీలో ప్రైమరీ లేదా కాకస్‌ ఎన్నికలు జరిగాయి.

రిపబ్లికన్‌ పార్టీలో డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) ఒక్క వెర్మొంట్‌ మినహా అన్ని రాష్ట్రాల్లో గెలుపొందారు. వెర్మొంట్‌లో ఆయన ప్రత్యర్థి నిక్కీ హేలీ విజయం సాధించారు. తాజా ఫలితాల నేపథ్యంలో ఆమె పోటీ నుంచి వైదొలగాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు డెమోక్రాటిక్‌ పార్టీలో అధ్యక్షుడు జో బైడెన్ మంగళవారం జరిగిన దాదాపు అన్ని ప్రైమరీల్లో గెలుపొందినట్లు సీఎన్‌ఎన్‌ వెల్లడించింది. ఒక్క సమోవా టెరిటరీలో మాత్రం జేసన్‌ పామర్‌ చేతిలో ఆయన ఓడిపోయారు. అయితే, లాంఛనంగా పార్టీ తరఫున నామినేషన్‌ పొందడానికి ట్రంప్‌ ఈ నెల 12 వరకు, బైడెన్‌ 19 వరకు నిరీక్షించాల్సి ఉంది.

రిపబ్లికన్‌ పార్టీలో అధ్యక్ష అభ్యర్థిత్వానికి ఎంపిక కావడానికి 1,215 మంది ప్రతినిధుల మద్దతు కావాల్సి ఉంటుంది. సూపర్‌ ట్యూస్‌డేకు ముందు హేలీ ఖాతాలో 43 మంది, ట్రంప్‌ ఖాతాలో 244 మంది ఉన్నారు. తాజా ఫలితాల తర్వాత తన మద్దతుదారులను ఉద్దేశించి ట్రంప్‌ మాట్లాడారు. తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. పరోక్షంగా అక్రమ వలసలపై విరుచుకుపడ్డారు. తాను మళ్లీ గెలిస్తే ఇంధన రంగంలో దేశాన్ని స్వయంసమృద్ధిగా మారుస్తానని హామీ ఇచ్చారు.

మరోవైపు బైడెన్‌ (Joe Biden) తన హయాంలో జరిగిన అభివృద్ధిని మద్దతుదారులకు వివరించారు. ఉద్యోగాల కల్పన, ద్రవ్యోల్బణం, మాదక ద్రవ్యాల నియంత్రణ, తుపాకీ విష సంస్కృతిని అరికట్టడం వంటి అంశాల్లో గణనీయ పురోగతి సాధించామని చెప్పారు. ట్రంప్‌ అధికారంలోకి వస్తే దేశం తిరిగి చీకటి రోజుల్లోకి జారుకుంటుందని పేర్కొన్నారు. ఆయన వల్ల అమెరికా ఉనికికి ముప్పు వాటిల్లినందునే నాలుగేళ్ల క్రితం తాను పోటీకి దిగాల్సి వచ్చిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని