Deforestation: ‘పుడమి శ్వాసకోశాల’కు ఊపిరి.. తగ్గిన అటవీ నిర్మూలన!

బ్రెజిల్‌లోని అమెజాన్‌ వర్షారణ్యాలకు లూలా ప్రభుత్వం ఊపిరి పోస్తోంది! గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అటవీ నిర్మూలనలో 33.6 శాతం తగ్గుదల కనిపించింది.

Published : 07 Jul 2023 14:56 IST

బ్రజిలియా: దక్షిణ అమెరికా (South America) ఖండంలోని పలు దేశాల్లో విస్తరించి ఉన్న అమెజాన్‌ వర్షారణ్యాలు (Amazon Rainforest) వేగంగా కుదించుకుపోవడం.. పర్యావరణానికి పెను విఘాతంగా పరిణమిస్తోన్న విషయం తెలిసిందే. ‘భూమికి శ్వాసకోశాలు’గా పేరొందిన ఈ అడవుల్లో సుమారు మూడింట రెండు వంతులు బ్రెజిల్‌ (Brazil)లోనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ అడవులను కాపాడుకునేందుకు బ్రెజిల్‌ ప్రభుత్వం కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి! గతేడాది మొదటి ఆరు నెలలతో పోలిస్తే ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో అడవుల నిర్మూలన (Deforestation)లో 33.6 శాతం తగ్గుదల కనిపించిందని ప్రభుత్వం వెల్లడించింది. ఒక్క జూన్‌లోనే రికార్డు స్థాయిలో 41 శాతం తగ్గుదల నమోదైందని తెలిపింది. అడవుల నిర్మూలనలో స్థిరమైన తగ్గుదల కనిపిస్తోందని పర్యావరణ మంత్రి మెరీనా సిల్వా తెలిపారు.

బ్రెజిల్‌లో 2022 జనవరి- జూన్‌ మధ్యకాలంలో 3988 చ.కి.మీల మేర అటవీ విస్తీర్ణం తగ్గిపోగా.. ఈ ఏడాది జూన్‌ నాటికి అది 2649 చ.కి.మీలకు పరిమితమైందని ప్రభుత్వం తెలిపింది. దీనికి సంబంధించిన ఉపగ్రహాల సమాచారాన్ని బ్రెజిల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ రీసెర్చ్‌ అందజేసింది. ఈ ఏడాది జనవరిలో దేశ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన లూలా.. 2030 నాటికి అటవీ నిర్మూలనకు ముగింపు పలుకుతామని ప్రతినబూనారు. అమెజాన్‌ అటవీ ప్రాంతంలో మైనింగ్‌ను ప్రోత్సహించిన మాజీ అధ్యక్షుడు బోల్సోనారో విధానాలను తిప్పికొడతానని తెలిపారు. ఈ క్రమంలోనే 6.20 లక్షల హెక్టార్ల మేర అటవీ ప్రాంతంలో కొత్తగా ఆరు రిజర్వ్‌ ప్రాంతాలను గుర్తించి.. అక్కడ మైనింగ్‌ నిషేధించారు. వాణిజ్య వ్యవసాయాన్ని కట్టడి చేశారు. ఇదిలా ఉండగా.. ‘అమెజాన్‌’లో అటవీ నిర్మూలన తగ్గినట్లు చెప్పినప్పటికీ.. కార్చిచ్చుల సంఖ్య పెరగడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు