Boris Johnson: ఇంటి నుంచి పనిచేస్తుంటే.. కాఫీ కారణంగా దృష్టి మరలుతుంది..!

కరోనా వైరస్ రాకతో.. వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం సర్వసాధారణమైంది. సంస్థలు హైబ్రిడ్‌ పని సంస్కృతిని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో ఉద్యోగుల్ని కార్యాలయాలకు రప్పించాలని యాజమాన్యాలు యోచిస్తున్నాయి.

Published : 17 May 2022 01:54 IST

లండన్‌: కరోనా వైరస్ రాకతో.. వర్క్‌ ఫ్రమ్‌ హోం విధానం సర్వసాధారణమైంది. సంస్థలు హైబ్రీడ్‌ పని సంస్కృతిని అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం వైరస్ వ్యాప్తి అదుపులో ఉండటంతో ఉద్యోగుల్ని కార్యాలయాలకు రప్పించాలని యాజమాన్యాలు యోచిస్తున్నాయి. అందుకు తగ్గట్టగా ఆదేశాలు ఇస్తున్నాయి. కానీ ఉద్యోగుల ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులపై బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘ఇంటి నుంచి పనిచేయడం వల్ల ఉద్యోగుల దృష్టి మరలుతుంది. ఈ విధానంతో నాకెదురైన అనుభవం చెప్తున్నా. పనిచేసేప్పుడు మధ్యలో ఇంకో కాఫీ తెచ్చుకునేందుకు మనం ఎక్కువ సమయం వెచ్చిస్తాం. తర్వాత మళ్లీ తినుబండారాలు తెచ్చుకోవడానికి నడచుకుంటూ ఫ్రిడ్జ్‌ దగ్గరకు వెళ్తాం. తిరిగి నిదానంగా నడుచుకుంటూ ల్యాప్‌టాప్‌ వద్దకు వస్తాం. కూర్చున్నాక.. మనం చేస్తోన్న పనేంటో కూడా గుర్తుండదు. అందుకే మళ్లీ కార్యాలయాలకు రావాల్సిన అవసరం ఉంది. చాలామందికి నా మాటలు నచ్చకపోవచ్చు. చుట్టూ ఇతరులుంటే మన నుంచి ఉత్పాదకత ఎక్కువ వస్తుంది. మరింత ఉత్సాహం, కొత్త కొత్త ఐడియాలతో పనిచేస్తామని నా నమ్మకం’ అంటూ జాన్సన్ అభిప్రాయపడ్డారు. 

ఇదిలా ఉంటే..ట్విటర్ మాత్రం ఎప్పటికీ ఇంటి నుంచే పనిచేసేలా ఉద్యోగులకు అవకాశం ఇచ్చింది. అయితే, ఇప్పుడు ఆ సంస్థ యాజమాన్యం మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడు ఆ విధానం అలాగే ఉంటుందా లేదా అన్నది చూడాలి. ఇదిలా ఉంటే.. తిరిగి కార్యాలయాలకు వచ్చి పనిచేయడంపై ఉద్యోగులు సుముఖంగా లేరని కథనాలు వస్తున్నాయి. యాపిల్‌ సంస్థలో 76 శాతం వారంలో మూడు రోజులు రావడానికి కూడా ఇష్టపడటం లేదని ఓ సర్వే వెల్లడించింది. తాజాగా ఇదే విషయమై కోడింగ్‌ నైపుణ్యాలు నేర్పించే వైట్ హ్యాట్ సంస్థలో 800 మంది రాజీనామా చేశారని ఓ నివేదిక పేర్కొంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని