Corona: కరోనా.. ఇన్‌ఫ్లుయెంజా కంటే 3 రెట్లు ప్రాణాంతకం..!

ఇన్‌ఫ్లుయెంజాతో బాధపడుతున్న వారితో పోలిస్తే కరోనా వైరస్‌ వల్ల ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకున్న వారిలోనే దుష్ర్పభావాలు, మరణం ముప్పు అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది

Published : 23 Apr 2022 01:38 IST

స్పెయిన్‌ పరిశోధకుల అధ్యయనం

లండన్‌: ఇన్‌ఫ్లుయెంజాతో బాధపడుతున్న వారితో పోలిస్తే కరోనా వైరస్‌ వల్ల ఆస్పత్రుల్లో చేరి చికిత్స తీసుకున్న వారిలోనే దుష్ర్పభావాలు, మరణాల ముప్పు అధికంగా ఉన్నట్లు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. అయితే, చిన్న వయసులో ఉన్నవారికి మాత్రం ఇటువంటి ప్రమాదం తక్కువేనని పేర్కొంది. స్పెయిన్‌ పరిశోధకులు జరిపిన ఈ అధ్యయన వివరాలు.. ఏప్రిల్‌ 23-26 తేదీల్లో పోర్చుగల్‌లో జరిగే సదస్సులో వెల్లడించనున్నారు. 

కరోనా వైరస్‌ వెలుగుచూసిన తర్వాత దీర్ఘకాలంలో వాటి ప్రభావాలపై అంతర్జాతీయంగా పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా 2017-2019 మధ్యకాలంలో సీజనల్‌ ఇన్‌ఫ్లుయెంజాతో ఆస్పత్రిలో చేరిన 187 మంది బాధితులను (సరాసరి వయసు 76) పరిగణనలోకి తీసుకొని అధ్యయనం చేపట్టారు. మరోవైపు 2020 మార్చి, మే నెలలో కొవిడ్‌ బారినపడిన 187 మంది బాధితుల రికార్డులను తీసుకొని ఇన్‌ఫ్లుయెంజా బాధితుల సమాచారంతో పోల్చి చూశారు. వాటిలో కొవిడ్‌ బాధితులందరికీ ఆక్సిజన్‌ చికిత్స అవసరం అయినట్లు గుర్తించారు. ఇన్‌ఫ్లుయెంజా బాధితులు ఎక్కువగా మునుపటి అనారోగ్య కారణాలతోనే బాధపడుతుండగా.. కొవిడ్‌ బాధితుల్లో మాత్రం ఆస్పత్రి చేరికలు అధికంగా ఉన్నాయని కనుగొన్నారు.

ఇలా రెండు వైరస్‌ల బాధితుల ఆరోగ్య సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొని విశ్లేషించిన పరిశోధకులు.. ఇన్‌ఫ్లుయెంజా కంటే కొవిడ్‌ ప్రాణాంతకమైనదనే విషయాన్ని గుర్తించారు. అంతేకాకుండా కొవిడ్‌ బాధితుల చికిత్సకు అయ్యే ఖర్చు కూడా అధికంగా ఉందని పరిశోధనకు నేతృత్వం వహించిన నిపుణులు పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకొని ప్రాణాలతో బయటపడినప్పటికీ కొందరిలో కొవిడ్‌ దుష్ర్పభావాలు కొంతకాలంపాటు వెంటాడుతున్నాయని చెప్పారు. అయితే, పూర్తి మోతాదుతోపాటు బూస్టర్‌ వ్యాక్సిన్‌ తీసుకోవడం వల్ల ఈ రెండు వైరస్‌లను ఎదుర్కోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని