Elon Musk: ఇక నా ఓటు రిపబ్లికన్లకే : ఎలాన్‌ మస్క్‌

క్రితం ఎన్నికల్లో తాను డెమొక్రాట్‌లకు ఓటు వేసినప్పటికీ ఈసారి మాత్రం రిపబ్లికన్లకే ఓటు వేస్తానని ఎలాన్‌ మస్క్‌ స్పష్టం చేశారు.

Published : 20 May 2022 01:32 IST

జో బైడెన్‌ పార్టీకి మద్దతు తెలపనన్న టెస్లా అధినేత

వాషింగ్టన్: ప్రపంచ పరిణామాలపై నిత్యం స్పందించే ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ (Elon Musk).. ఇటీవల అమెరికా రాజకీయాలపై తన స్వరం పెంచుతున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఎన్నికలను ప్రస్తావించిన ఆయన.. క్రితం ఎన్నికల్లో తాను డెమొక్రాట్‌లకు ఓటు వేసినప్పటికీ ఈసారి మాత్రం రిపబ్లికన్లకే ఓటు వేస్తానని స్పష్టం చేశారు. డెమొక్రాట్‌లు అంటే సౌమ్యంగా ఉండేవారని.. అందుకే గతంలో వారికి ఓటు వేశానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న జోబైడెన్‌ ప్రభుత్వాన్ని (Democrat Party) ఉద్దేశించి ఎలాన్ మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

‘గతంలో డెమొక్రాట్లకే ఓటు వేశాను. ఎందుకంటే ఇంతకుముందు వారు సౌమ్యమైన పార్టీ వ్యక్తులుగా ఉండేవారు. కానీ ప్రస్తుతం విభజన, ద్వేషం పెంచే పార్టీగా తయారవుతోంది. అందుకే ఇక నుంచి వారికి మద్దతు ఇవ్వను. రిపబ్లికన్‌ (Donald Trump) పార్టీకే ఓటు వేస్తాను. ఇక ఇప్పుడు నాకు వ్యతిరేకంగా చెడు ప్రచారం ఎలా చేస్తారో చూడండి’ అంటూ జో బైడెన్‌ పార్టీని ఉద్దేశిస్తూ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌ చేశారు. రాజకీయ పరంగా తనపై పెరుగుతోన్న విమర్శలను ఉదహరించిన ఆయన రానున్న మరికొన్ని నెలల్లో తనపై రాజకీయ దాడులు మరింత పెరగుతాయని ఇటీవల మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలాఉంటే, అమెరికా దిగ్గజ వ్యాపారస్థుల్లో ఒకరైన ఎలాన్‌ మస్క్‌ (Elon Musk), జో బైడెన్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్‌ కార్ల పన్నుల విధానం విషయంలో బైడెన్‌ ప్రభుతాన్ని ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఇదే సమయంలో రిపబ్లికన్‌ పార్టీకి చెందిన డొనాల్డ్‌ ట్రంప్‌పై ట్విటర్‌ నిషేధాన్ని వెనక్కి తీసుకుంటానని ఎలాన్‌ మస్క్‌ పేర్కొనడం విశేషం. సోషల్‌ మీడియా దిగ్గజ సంస్థ ట్విటర్‌ను కొనుగోలు చేసేందుకు ఎలాన్‌ మస్క్‌ ప్రయత్నాలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని