USA: అమెరికా ఖలిస్థానీలను హెచ్చరించిన ఎఫ్‌బీఐ..!

ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య అనంతరం అమెరికాలో (USA)ని ఖలిస్థానీ మద్దతుదార్లను ఎఫ్‌బీఐ అధికారులు స్వయంగా ఫోన్‌ చేసి అప్రమత్తం చేశారు. ఈ విషయాన్ని ఓ ఆంగ్లపత్రిక వెల్లడించింది.

Published : 24 Sep 2023 10:09 IST

ఇంటర్నెట్‌డెస్క్: హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యతో కెనడాలోని ఖలిస్థానీలను అమెరికా(USA)లోని ఎఫ్‌బీఐ (ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) స్వయంగా అప్రమత్తం చేసింది. ఏ క్షణమైన మృత్యువు ముంచుకొస్తుందని వారిని హెచ్చరించినట్లు ఇన్వెస్టిగేటివ్‌ పత్రిక ఇంటర్‌సెప్ట్‌ ఈ మేరకు కథనం ప్రచురించింది. ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థాన్ టైగర్‌ ఫోర్స్‌ అధినేత నిజ్జర్‌ను కెనడాలోని సర్రేలో గుర్తుతెలియని వ్యక్తులు కాల్చిచంపారు. ఈ ఘటన అనంతరం తనతో సహా కాలిఫోర్నియాలోని ఇద్దరు సిక్కు నేతలకు ఎఫ్‌బీఐ నుంచి ఫోన్లు వచ్చాయని అమెరికన్‌ సిక్కు కాకసస్‌ కమిటీ సమన్వయ కర్త ప్రీత్‌పాల్‌ ఇంటర్‌సెప్ట్‌కు వెల్లడించారు.  కొందరి వద్దకు అధికారులు నేరుగా వెళ్లి కలిసినట్లు సమాచారం.

‘‘జూన్‌ చివర్లో నా వద్దకు ఇద్దరు ఎఫ్‌బీఐ స్పెషల్‌ ఏజెంట్లు వచ్చారు. నా ప్రాణాలకు ముప్పు ఉన్నట్లు వారికి సమాచారం అందిందని వెల్లడించారు. ముప్పు ఏ రూపంలో వస్తుందనేది వారు చెప్పలేదు. నన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పారు’’ అని ప్రీత్‌పాల్‌ వెల్లడించారు. 

కెనడా అడుగు ఎటో!

మరోవైపు నిజ్జర్‌ హత్యకు ముందే తమకు ప్రాణహాని ఉందని కెనడాలోని ఇంటెలిజెన్స్‌ బృందాలు హెచ్చరించినట్లు బ్రిటిష్‌ కొలంబియా గురుద్వారా కౌన్సిల్‌ ప్రతినిధి మహిందర్‌ సింగ్‌ వెల్లడించారు. అదే సమయంలో ఆ బృందాలు నిజ్జర్‌ను కూడా హెచ్చరించినట్లు వెల్లడించారు. మరోవైపు నిజ్జర్‌ను భారత్‌ 2020లోనే ఉగ్రవాదిగా పేర్కొంటూ.. అతడిపై రూ.10 లక్షల రివార్డును కూడా ప్రకటించింది. కానీ, ఇవేవీ పట్టించుకోకుండా కెనడా ప్రభుత్వం అతడి భద్రతపై అధిక దృష్టిపెట్టడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని