చలికి వణుకుతున్న అమెరికా

శీతాకాలపు మంచు తుపానుతో అమెరికా గజగజ వణికిపోతోంది. భారీగా కురుస్తున్న మంచు, చలిగాలులకు స్థానిక ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి.

Published : 24 Dec 2022 06:04 IST

రహదారుల దిగ్బంధం, 3,400 విమానాల రద్దు

వాషింగ్టన్‌: శీతాకాలపు మంచు తుపానుతో అమెరికా గజగజ వణికిపోతోంది. భారీగా కురుస్తున్న మంచు, చలిగాలులకు స్థానిక ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. క్రిస్మస్‌ సెలవుల్లో ప్రజల ప్రయాణాలకు ఈ వాతావరణం అవరోధంగా మారింది. శీతలగాలులు, విద్యుత్‌ కోతలతో ఇక్కడి జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. శుక్రవారం ఒక్కరోజే 3,400 విమానాలు రద్దయినట్లు ఫ్లైట్‌అవేర్‌ సంస్థ తెలిపింది. 4.5 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది.
మంచు పేరుకుపోవడంతోపాటు దట్టమైన పొగమంచు కారణంగా ప్రధాన రహదారులనూ మూసివేశారు. తలదాచుకోవడానికి ఇళ్లు లేని వారి కోసం పలుచోట్ల హీటర్లతో కూడిన తాత్కాలిక శిబిరాలు ఏర్పాటు చేశారు. డెట్రాయిట్‌లోని గడ్డకట్టిన ఒక సరస్సులో ఇరుక్కుపోయిన బాతును సిబ్బంది రక్షించారు. మొత్తం అమెరికాలోని 60 శాతం జనాభా మంచు తుపాను హెచ్చరికల పరిధిలో ఉందని జాతీయ వాతావరణ విభాగం తెలిపింది. ‘ఇది మీరు చిన్నప్పుడు చూసిన మంచు రోజుల్లా కాదు. చాలా తీవ్రమైన పరిస్థితి’ అని దేశాధ్యక్షుడు జో బైడెన్‌ హెచ్చరించారు.


గడ్డకట్టే చలిలో పడిగాపులు

ఈ వాతావరణ పరిస్థితుల్లో మెక్సికో - అమెరికా సరిహద్దుల్లో వేచిఉన్న వలసదారుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొవిడ్‌ సమయంలో వలసదారుల రాకపై విధించిన నిబంధనలను ఎత్తివేయాలన్న కేసు ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టులో ఉంది. ఆ తీర్పు కోసం వీరంతా ఎదురు చూస్తూ సరిహద్దుల్లోనే ఉంటున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని