నాటోలో విభేదాలు!

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం త్వరలో రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

Published : 22 Jan 2023 06:07 IST

ఉక్రెయిన్‌కు ఆయుధాలపై కుదరని ఏకాభిప్రాయం
యుద్ధ ట్యాంకులకు జర్మనీ నో

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం త్వరలో రెండో ఏడాదిలోకి అడుగుపెడుతున్న వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధ సాయంపై నాటో దేశాల్లో దాగి ఉన్న విభేదాలు బయటపడుతున్నాయి. జెలెన్‌స్కీ సేనకు చేయూతపై నిర్ణయం తీసుకోవటానికి శుక్రవారం జర్మనీలో జరిగిన కీలక సమావేశంలో ఏకాభిప్రాయం కుదరలేదు. 50 దేశాల రక్షణ మంత్రులు ఇందులో పాల్గొని చర్చించినప్పటికీ ఉక్రెయిన్‌కు ఊరట లభించలేదు.

ఎదురుదాడికి సాయం చేయండి...

గత ఫిబ్రవరిలో యుద్ధం మొదలైన నాటి నుంచి ఇప్పటిదాకా అమెరికా సారథ్యంలోని నాటో దేశాలు.. రష్యాను ఎదుర్కోవటానికి ఉక్రెయిన్‌కు ఆర్థిక, ఆయుధ సాయం చేస్తూనే ఉన్నాయి. ఫలితంగానే ఉక్రెయిన్‌ ఇప్పటిదాకా నిలబడగలిగింది. అయితే ఈ సాయం చాలావరకూ ఆత్మరక్షణకే పరిమితమైంది. పుతిన్‌ సేన దాడులను కాచుకోవడానికే ఇవి ఉపయోగపడేవి. ఇకపై ఈ సాయానికి తోడు రష్యాపై ఎదురుదాడికి ఆయుధాలు ఇవ్వాలంటూ ఉక్రెయిన్‌ పట్టుబడుతోంది. వీటి కోసమే ఈ మధ్య ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అమెరికాలో పర్యటించి వచ్చారు. అమెరికా ద్వారా నాటో దేశాలపై ఒత్తిడి తెస్తున్నారు. తాజాగా దావోస్‌ ఆర్థిక వేదికపై నుంచి కూడా ఆయన ఇదే డిమాండ్‌ చేశారు. ముఖ్యంగా జర్మనీ తయారీ లెపర్డ్‌-2 యుద్ధట్యాంకుల కోసం పట్టుబడుతున్నారు.

జర్మనీ ఆందోళన..

ఉక్రెయిన్‌కు ఆర్థికసాయం అందించటంలో నాటో దేశాలకు అభ్యంతరాల్లేవు. కానీ అత్యాధునిక ఆయుధాల విషయానికొచ్చేసరికి అది రాజకీయ ప్రాధాన్యాంశంగా మారింది. ఈ విషయంపై ఐరోపా దేశాల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధట్యాంకులు ఇస్తే పోరును నాటోకు విస్తరించినట్లవుతుందన్నది కొన్ని దేశాల వాదన. రష్యా ఆక్రమించిన ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలంటే ఉక్రెయిన్‌కు సాయం చేయాల్సిందేనని మరికొన్ని దేశాలు స్పష్టంచేస్తున్నాయి.

జెలెన్‌స్కీ సేనకు యుద్ధ ట్యాంకులను ఇవ్వటానికి జర్మనీ ససేమిరా అంటోంది. ఉక్రెయిన్‌కు సాయంపై కూడా అక్కడి ప్రభుత్వంలో ఏకాభిప్రాయం లేదు. నాటోలో కీలక సభ్యదేశమైనప్పటికీ.. రష్యాతో పూర్తిగా తెగతెంపులు చేసుకోవడానికి జర్మనీ సిద్ధంగా లేదు. రష్యా గ్యాస్‌పై ఆ దేశం ఆధారపడి ఉంది. రెండో ప్రపంచయుద్ధం, ప్రచ్ఛన్నయుద్ధ నీడలింకా జర్మనీని వెంటాడుతూనే ఉన్నాయి. రష్యాపై సానుకూలత ఇంకా ఆ దేశంలో ఉంది. లెపర్డ్‌-2 యుద్ధట్యాంకులను ఇస్తే వాటి ద్వారా రష్యాపై ఉక్రెయిన్‌ దాడులు చేస్తుంది. ఆ పోరు నాటో దేశాలకూ విస్తరిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అది ప్రపంచయుద్ధంగా పరిణమించే ప్రమాదం ఉంది. రష్యా- నాటో యుద్ధాన్ని తాను కోరుకోవటం లేదని జర్మనీ ఛాన్సలర్‌ ఒలాఫ్‌ షోల్జ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు.

రష్యా హెచ్చరిక...

ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తే తీవ్ర పరిణామాలు తప్పవని రష్యా ఇప్పటికే స్పష్టం చేసింది. ఇది అణుయుద్ధానికి దారితీసే ప్రమాదం లేకపోలేదని కూడా హెచ్చరించింది.

ఏమిటీ లెపర్డ్‌-2?

లెపర్డ్‌-2 ట్యాంకును జర్మనీ 1979లో అభివృద్ధి చేసింది. తర్వాత అనేక మార్పులు చేర్పులతో ఇది రూపుదిద్దుకుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యాధునిక యుద్ధట్యాంకుల్లో దీన్ని కీలకమైనదిగా పరిగణిస్తుంటారు.

* 13 ఐరోపా దేశాల సైన్యాలు వీటిని వినియోగిస్తున్నాయి. అఫ్గానిస్థాన్‌, కొసావో, సిరియాల్లోనూ వీటిని వాడారు.
* మిగిలిన యుద్ధట్యాంకులతో పోలిస్తే బరువు తక్కువ. రాత్రివేళల్లోనూ స్పష్టంగా శత్రువుపై దాడి చేయగలదు. కదిలే లక్ష్యాన్ని ఛేదించగల లేజర్‌ రేంజ్‌ పరికరాలుండటం దీని ప్రత్యేకత. ఎగుడుదిగుడు భూతలాల్లోనూ సమర్థంగా దూసుకుపోతుంది.

ఉక్రెయిన్‌కేంటి లాభం?

* ఉక్రెయిన్‌ వద్ధ ఉన్న యుద్ధట్యాంకులన్నీ సోవియట్‌ కాలం నాటివి. రష్యా ఆయుధ సంపత్తికి ఇవి సాటిరావు. లెపర్డ్‌-2 వస్తే ఉక్రెయిన్‌కు ఆ కొరత తీరుతుంది. రష్యాపై ఎదురుదాడి చేసే బలం వస్తుంది.
* బ్రిటన్‌ తన ఛాలెంజర్‌-2 ట్యాంకులను ఇవ్వటానికి అంగీకరించింది. కేవలం 14 ట్యాంకులను మాత్రమే ఇస్తానంటోంది. అవి ఏమాత్రం సరిపోవు. వంద లెపర్డ్‌-2 వస్తే యుద్ధం రూపురేఖలే మారిపోతాయన్నది ఉక్రెయిన్‌ వాదన.

అంతా అమెరికా చేతిలో..

లెపర్డ్‌-2 ట్యాంకులను అనేక నాటో దేశాలకు జర్మనీ ఇప్పటికే విక్రయించింది. పోలండ్‌లాంటి దేశాలు ఉక్రెయిన్‌కు వాటిని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ జర్మనీ అనుమతి ఇస్తేనే ఇది సాధ్యమవుతుంది. అమెరికా సమ్మతిస్తేనే జర్మనీ తన యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్‌కు ఇస్తుంది. అందువల్ల ఇక్కడ అగ్రరాజ్య నిర్ణయం కీలకం కాబోతోంది. తన వద్ద ఉన్న అత్యాధునిక ఎం-1 అబ్రామ్స్‌ ట్యాంకులను ఉక్రెయిన్‌కు ఇవ్వటానికి నిరాకరిస్తున్న అమెరికా.. జర్మనీకి పచ్చజెండా ఊపుతుందా అనేది అనుమానమే!

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని