శ్రీలంక, పాక్‌లకు చైనా అండ.. ఐఎంఎఫ్‌ రుణాల విషయంలో సహకారం

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి రుణం సేకరించడానికి పాకిస్థాన్‌, శ్రీలంకలకు చైనా తోడ్పడుతోంది. ఐఎంఎఫ్‌ నుంచి రుణం కోరే సంస్థలు మొదట తమ ఆర్థిక పరిస్థితిని ఒక దారికి తెచ్చుకోవాలి.

Updated : 08 Mar 2023 06:36 IST

కొలంబో/ఇస్లామాబాద్‌: అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) నుంచి రుణం సేకరించడానికి పాకిస్థాన్‌, శ్రీలంకలకు చైనా తోడ్పడుతోంది. ఐఎంఎఫ్‌ నుంచి రుణం కోరే సంస్థలు మొదట తమ ఆర్థిక పరిస్థితిని ఒక దారికి తెచ్చుకోవాలి. ఇతర దేశాలకు, సంస్థలకు తాము చెల్లించాల్సిన అప్పులను వాయిదా వేసి, స్వదేశంలో ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచుకోవాలి. దీన్ని ఆర్థిక పునర్వ్యవస్థీకరణ అంటారు. ఐఎంఎఫ్‌ నుంచి 290 కోట్ల డాలర్ల రుణం కోసం శ్రీలంక, 110 కోట్ల తక్షణ రుణం కోసం పాకిస్థాన్‌ ప్రయత్నిస్తున్నాయి. శ్రీలంక చెల్లించాల్సిన రుణాన్ని రెండేళ్లపాటు వాయిదా వేయడానికి చైనా ఇటీవల సుముఖత వ్యక్తం చేసినా, ఐఎంఎఫ్‌ తృప్తిపడలేదు. దీంతో చైనా తాజాగా మరింత గడువు ఇచ్చి ఐఎంఎఫ్‌ రుణం పొందడానికి శ్రీలంకకు వీలు కల్పించింది. ఇతర దేశాలు, ఆర్థిక సంస్థలకు తాను చెల్లించాల్సిన రుణాల గడువు పెంచుకుంటే శ్రీలంకకు నాలుగేళ్ల కాలానికి 290 కోట్ల డాలర్ల రుణమిస్తానని ఐఎంఎఫ్‌ ప్రతిపాదించింది.

చైనా రుణానికి వాయిదా కోరిన పాక్‌

మరోవైపు చైనాకు ఈ నెలాఖరుకల్లా తాము చెల్లించాల్సిన 200 కోట్ల డాలర్ల రుణాన్ని ఇంకో ఏడాదిపాటు వాయిదా వేయాల్సిందిగా కోరినట్లు పాకిస్థాన్‌ ప్రభుత్వం ఐఎంఎఫ్‌కు తెలిపింది. చైనా నుంచి సేఫ్‌ డిపాజిట్‌ పథకం కింద పాక్‌ సేకరించిన 400 కోట్ల రుణాల్లో మిగిలిన భాగాన్ని రానున్న నెలల్లో తీర్చాల్సి ఉంది. ఐఎంఎఫ్‌ నుంచి 110 కోట్ల డాలర్ల రుణాన్ని సేకరించడానికి పాకిస్థాన్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అడుగంటిపోయిన విదేశీమారక ద్రవ్య నిల్వలను భర్తీ చేసుకోవడానికి పాకిస్థాన్‌ మిత్రదేశాల నుంచి, బహుళ పక్ష సంస్థలు, వాణిజ్య బ్యాంకుల నుంచి జూన్‌ నెలాఖరుకల్లా 1,000 కోట్ల డాలర్ల నిధులను సేకరించాలని లక్షిస్తోంది. అందులో 700 కోట్ల డాలర్ల రుణాన్ని ఐఎంఎఫ్‌ నుంచి పొందడానికి ప్రయత్నిస్తున్న పాక్‌, తక్షణం 110 కోట్ల డాలర్లను విడుదల చేయాలని కోరుతోంది. అందుకు ఐఎంఎఫ్‌ పెట్టిన షరతుల మేరకు తన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలని ప్రయత్నిస్తోంది. దీనికోసం గత నెలలో చైనా నుంచి 70 కోట్ల డాలర్లను స్వీకరించింది. త్వరలో 130 కోట్ల డాలర్ల రుణాన్ని పొందబోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని