విత్తన భాండాగార సృష్టికర్తలకు ప్రపంచ ఆహార పురస్కారం

వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్‌, జెఫ్రీ హాటిన్‌లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు.

Updated : 10 May 2024 05:51 IST

వాషింగ్టన్‌: వ్యవసాయ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ప్రపంచ విత్తన భాండాగార ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన క్యారీ ఫౌలర్‌, జెఫ్రీ హాటిన్‌లు ఈ ఏడాదికి సంబంధించిన ప్రపంచ ఆహార పురస్కారానికి ఎంపికయ్యారు. క్యారీ.. ప్రపంచ ఆహార భద్రత కార్యక్రమానికి అమెరికా ప్రత్యేక దూతగా ఉన్నారు. బ్రిటన్‌కు చెందిన జెఫ్రీ.. వ్యవసాయ శాస్త్రవేత్త. అంతర్జాతీయ పంటల వైవిధ్య ట్రస్టులో కార్యనిర్వాహక బోర్డు సభ్యుడు. బహుమతి మొత్తమైన 5లక్షల డాలర్లను ఇద్దరికీ పంచుతారు. అమెరికా విదేశాంగ శాఖ గురువారం ఈ అవార్డును ప్రకటించింది. ప్రపంచ పంటల వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు, 6వేల రకాల పంటలు, సాంస్కృతికంగా ముఖ్యమైన మొక్కలను భద్రంగా ఉంచేందుకు వీరు సాగించిన కృషిని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్‌ అభినందించారు. విత్తనాలు రాజకీయ సంక్షోభాలు, పర్యావరణ మార్పుల బారి నుంచి సురక్షితంగా ఉంచడం ఈ భాండాగార ఏర్పాటు ఉద్దేశం. ఆర్కిటిక్‌ సర్కిల్‌లో నార్వేకు చెందిన ఒక దీవిలో ఒక పర్వతం పక్కన దీన్ని ఏర్పాటు చేశారు. అక్కడి ఉష్ణోగ్రతల కారణంగా విత్తనాలు సురక్షితంగా ఉంటాయి. స్వాల్‌బార్డ్‌ గ్లోబల్‌ సీడ్‌ వాల్ట్‌ అనే ఈ కేంద్రాన్ని 2008లో ప్రారంభించారు. అక్కడ.. దాదాపుగా ప్రపంచంలోని ప్రతి దేశం నుంచి 12.5 లక్షల విత్తన నమూనాలను భద్రపరిచారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని