18 ఏళ్లకే ట్రంప్‌ చిన్నకుమారుడి రాజకీయ రంగప్రవేశం

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న కుమారుడు బ్యారన్‌ ట్రంప్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు.

Published : 10 May 2024 05:20 IST

‘రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌’కు ఫ్లోరిడా ప్రతినిధిగా బ్యారన్‌

మియామీ: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చిన్న కుమారుడు బ్యారన్‌ ట్రంప్‌ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ‘రిపబ్లికన్‌ నేషనల్‌ కన్వెన్షన్‌’కు ఫ్లోరిడా నుంచి ప్రతినిధిగా పంపనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవన్‌ పవర్‌ బుధవారం తెలిపారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. ఆయన ఎంపికను అధికారికంగా ధ్రువీకరించేందుకు జులైలో పార్టీ కన్వెన్షన్‌ జరగనుంది. దీనికి ఫ్లోరిడా నుంచి 41 మంది ప్రతినిధులు వెళ్లనున్నారు. వారిలో బ్యారన్‌ ట్రంప్‌ ఒకరని పవర్‌ తెలిపారు. బ్యారన్‌ ట్రంప్‌ ఇప్పటి వరకు బయటి ప్రపంచానికి దూరంగా ఉంటూ వచ్చాడు. మార్చిలో అతనికి 18 ఏళ్లు వచ్చాయి. వచ్చే వారమే హైస్కూల్‌ నుంచి గ్రాడ్యుయేట్‌ కానున్నాడు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు డొనాల్డ్‌ ట్రంప్‌నకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ‘హష్‌మనీ కేసు’లో ఆయన విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మరోవైపు ట్రంప్‌ ఇతర వారసులైన డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌, ఎరిక్‌ ట్రంప్‌, చిన్న కుమార్తె టిఫనీ సైతం పార్టీ తరఫున ఫ్లోరిడా ప్రతినిధులుగా వ్యవహరించనున్నారు. విస్కాన్సిన్‌లోని మిల్వాకీ నగరంలో జులై 15-18 మధ్య పార్టీ కన్వెన్షన్‌ జరగనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని