భూమి ఇవ్వకపోతే.. చంపేయండి

తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్‌’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

Published : 10 May 2024 05:19 IST

నియోమ్‌ మహానగర నిర్మాణం కోసం సౌదీ ఆదేశాలు..
వెల్లడించిన మాజీ కర్నల్‌ రభిహ్‌ ఎలెన్జీ

ఇంటర్నెట్‌ డెస్క్‌: తమ కలల ప్రాజెక్టు ‘నియోమ్‌’కు ఎవరు అడ్డుపడ్డా ప్రాణాలతో విడిచిపెట్టొద్దని సౌదీ అరేబియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీని నిర్మాణానికి అవసరమైన భూసేకరణకు సహకరించకపోతే అస్సలు కనికరించవద్దని చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆ దేశ దళాల్లో పనిచేసిన కర్నల్‌ రభిహ్‌ ఎలెన్జీ బీబీసీ సంస్థకు తెలిపారు. గతేడాది ఆయన బ్రిటన్‌కు శరణార్థిగా వచ్చారు. తాజాగా నియోమ్‌ స్మార్ట్‌ సిటీ నిర్మాణం విషయంలో సౌదీ పాలకులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో వెల్లడించారు.

అసలేమిటీ నియోమ్‌..

సౌదీ అరేబియాలో చమురు నిల్వలు గణనీయంగా తగ్గిపోతున్నాయి. ప్రపంచం కూడా చమురు నుంచి హరిత ఇంధనం వైపు వేగంగా మళ్లుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో సౌదీ ఆదాయానికి గండిపడే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని అక్కడి పాలకులు దేశాన్ని పర్యాటక ప్రదేశం, గ్లోబల్‌ హబ్‌గా తీర్చి దిద్దేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్మించేదే ‘నియోమ్‌’ స్మార్ట్‌ సిటీ. సౌదీ యువరాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ మానసపుత్రికగా ఈ ప్రాజెక్టును భావిస్తున్నారు. దీనికి 500 బిలియన్‌ డాలర్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఎర్ర సముద్ర తీరంలో మొత్తం 26,500 చదరపు కిలోమీటర్ల పరిధిలో 10 రకాల రీజియన్లను నిర్మించనున్నారు. వీటిల్లో ఫ్లోటింగ్‌ పోర్ట్‌, స్కై రిసార్ట్‌లు, సర్వాట్‌ పర్వతాలపై నిర్మాణాలు, మిర్రర్డ్‌ సిటీ వంటివి ఉన్నాయి. ఈ మొత్తంలో ‘ది లైన్‌’ పేరిట చేపట్టేది అత్యంత కీలకమైన నిర్మాణం. 2026 నాటికి నియోమ్‌లో 4.5 లక్షల మంది జనాభా ఉంటారని అంచనా వేస్తున్నారు.  మరోవైపు, ఈ ప్రాజెక్టుకు చాలా భూసేకరణ అవసరం. దీంతో మూడు గ్రామాలను ఖాళీ చేయించేందుకు 2020లో సౌదీ బలగాలు తీవ్రంగా యత్నించి విజయం సాధించాయి. ఇక్కడి ప్రజలు హువైటీ తెగకు చెందినవారు. అప్పట్లో అబ్దుల్‌ రహీం అల్‌ హువైటీ అనే వ్యక్తి తన భూమిలోకి అధికారులను రానీయలేదు. దీంతో అతడిని మర్నాడే దళాలు కాల్చేశాయి. ఆ తర్వాత జరిగిన ఆందోళనలకు సంబంధించి మొత్తం 47 మంది గ్రామస్థులను ఉగ్ర నేరాలపై అరెస్టు చేశారు. వీరిలో ఐదుగురికి మరణశిక్ష విధించారు. హువైటీ అంతిమ సంస్కారాల్లో పాల్గొన్నందుకే డజన్ల మందిని అరెస్టు చేశారు. తాజాగా ఈ విషయాలు బహిర్గతం చేసిన కర్నల్‌ ఎలెన్జీ కూడా భయపడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని