War: యుద్ధ నియమాలు పాటిస్తున్నారా?

జీవితంలో ప్రతి అడుగులోనూ నియమ నిబంధనలుంటాయి. బడిలో, ఆఫీసులో, ఇంట్లో... ఎక్కడికెళ్లినా కొన్ని రూల్స్‌కు కట్టుబడే మనిషి నడుచుకోవాల్సి ఉంటుంది.

Updated : 14 Oct 2023 05:12 IST

వాటిని అతిక్రమిస్తే నేరమే

జీవితంలో ప్రతి అడుగులోనూ నియమ నిబంధనలుంటాయి. బడిలో, ఆఫీసులో, ఇంట్లో... ఎక్కడికెళ్లినా కొన్ని రూల్స్‌కు కట్టుబడే మనిషి నడుచుకోవాల్సి ఉంటుంది. యుద్ధంలోనూ అంతే! ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నా... చంపుకొంటున్నా... బాంబులు, క్షిపణులు, తూటాలతో విరుచుకుపడుతున్నా... అవీ రూల్స్‌ ప్రకారం చేయాల్సిందే! రూల్‌ దాటి యుద్ధం చేస్తానంటే కుదరదు. అందుకే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహుకు ఫోన్‌ చేసినప్పుడు ప్రత్యేకంగా నొక్కిచెప్పిన మాట... ‘‘యుద్ధ నియమాలు పాటించండి’’ అని! ఇంతకూ ఏంటా నియమాలు?

డునంట్‌తో ప్రారంభం

కురుక్షేత్ర యుద్ధంలో కూడా ‘సూర్యాస్తమయం కాగానే కౌరవ, పాండవ పక్షాలు యుద్ధం ఆపేసి ఎవరి శిబిరాలకు వారు వెళ్లేవారు’ అని ఉంది. యుద్ధరీతులు మారినట్లే... కాలక్రమంలో నియమనిబంధనలూ మారుతూ వచ్చాయి. ఆధునిక యుద్ధ నియమాలను ‘జెనీవా ఒప్పందం’గా పిలుస్తారు. వీటికి మూలాలు పురాతన నాగరికతలు, మతాల్లో ఉన్నా... వీటిన్నింటినీ ఓ చట్ట రూపంలో ఒకచోటికి చేర్చే పనిని తొలిసారిగా హెన్రీ డునంట్‌ చేపట్టారు. ఆయనే రెడ్‌క్రాస్‌ సంస్థ వ్యవస్థాపకులు కూడా! 1859లో ఇటలీలోని సోల్‌ఫెరినోలో ఫ్రెంచ్‌, ఆస్ట్రియా సైన్యాల మధ్య జరిగిన భీకరమైన పోరును చూశాక చలించిపోయిన డునంట్‌... యుద్ధం కూడా కొన్ని నియమాలకు లోబడే జరగాలని, వాటిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సిందేనని భావించారు. ఇందుకోసం ఆయన తొలి జెనీవా సదస్సు ఏర్పాటు చేశారు. యుద్ధ సమయంలో గాయపడ్డవారికి సాయం చేయటం; క్షతగాత్రులను బందీ చేయకుండా రక్షణ కల్పించటం, సాయం చేసే సామాన్య పౌరులకు రక్షణ, రెడ్‌క్రాస్‌ గుర్తుకు గౌరవం ఇవ్వటం... మొదట్లో ఆయన ఒప్పించిన సూత్రాలు!

రెండో ప్రపంచయుద్ధం తర్వాత...

డునంట్‌తో మొదలైన నియమాలే అంతర్జాతీయ మానవత్వ చట్టం (ఇంటర్నేషనల్‌ హ్యుమానిటేరియన్‌ లా- ఐహెచ్‌ఎల్‌)గా మారాయి. మొదట 12 యూరోపియన్‌ దేశాలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. తర్వాత వీటిని అంతర్జాతీయ సమాజం మరింత ముందుకు తీసుకెళ్లింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఘోరాలను చూశాక... వివిధ దేశాల దౌత్యవేత్తలంతా మళ్లీ 1949లో జెనీవాలో కూర్చొని పాత ఒప్పందాలను ఆధునికీకరించారు. సామాన్య పౌరుల రక్షణకు పెద్దపీట వేస్తూ... కొత్తగా నాలుగు ఒప్పందాలను రూపొందించారు. అవే ఆధునికకాలంలో నేటికీ యుద్ధ నియమాలుగా చెలామణి అవుతున్నాయి. ఈ నిబంధనలకు ప్రపంచంలోని 196 దేశాలు అంగీకరించాయి.

 నాలుగు ఒప్పందాలు

  • యుద్ధభూమిలో గాయపడ్డ సైనికుల పరిస్థితిని మెరుగుపర్చటం
  • యుద్ధంలో భాగంగా సముద్రజలాల్లో, నౌకలో క్షతగాత్రుడైన, అనారోగ్యం పాలైన నావికుడి పరిస్థితి మెరుగుపర్చటం
  • యుద్ధంలో పట్టుబడ్డ సైనికులకు చికిత్స
  • యుద్ధ సమయంలో సామాన్య పౌరుల రక్షణ

యుద్ధాల్లో అత్యంత దారుణాలను, అమానవీయ చర్యలను నివారించటం, ఆయా దేశాల ఆయుధ వినియోగం, వ్యూహాలను కట్టడి చేయటం వీటి ఉద్దేశం!

 ఈ నియమాల ప్రకారం...

  • గాయపడ్డ, అనారోగ్యం పాలైన సైనికులను రక్షించాలి (శత్రువైనా).
  • సామాన్య పౌరులపై దాడులు చేయకుండా సంయమనం పాటించాలి.
  • బందీలుగా పట్టుకున్నవారిని క్రూరంగా, అమానవీయంగా హింసించకూడదు.
  • వైద్య, సహాయక సిబ్బందిపై దాడులు చేయకూడదు.
  • రెడ్‌క్రాస్‌ గుర్తుగానీ, రెడ్‌క్రాస్‌ గుర్తున్న సిబ్బందిగానీ కనిపిస్తే ఆ ప్రాంతంపై దాడులు చేయకూడదు.
  • యుద్ధ ప్రాంతం నుంచి సామాన్య పౌరులు, చిన్నపిల్లలు సురక్షితంగా ఇతర ప్రాంతాలకు వెళ్లేలా ఇరుపక్షాలూ చర్యలు తీసుకోవాలి.
  • అలా వెళ్లే పౌరులను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోకూడదు.
  • ఈ నియమాలను ఉల్లంఘించిన వారిపై అంతర్జాతీయ, జాతీయ న్యాయస్థానాల్లో క్రిమినల్‌ విచారణ జరపొచ్చు. చట్టవ్యతిరేక యుద్ధాలు, యుద్ధాల్లో నేరాలపై వ్యక్తులను విచారించి శిక్షించే అధికారం అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టుకు ఉంది. ఉక్రెయిన్‌లో అలా యుద్ధ నియమాల ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఆరోపణలపైనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంటు జారీ చేసింది.

అమలయ్యేనా?

అంతర్జాతీయ చట్ట రూపంలో ఉన్నా... దేశాలన్నీ అంగీకరించినా... యుద్ధ సమయంలో వీటి అమలు ఎప్పుడూ ప్రశ్నార్థకమే అవుతోంది.  తాజాగా ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధంలో ఆ విషయం స్పష్టంగా కనబడుతోంది. ఇరుపక్షాలూ యుద్ధ నియమాలను ఉల్లంఘిస్తున్న సంగతి తెలిసిపోతోంది. ఇజ్రాయెల్‌ సామాన్య పౌరులను హమాస్‌ తీవ్రవాదులు కిడ్నాప్‌ చేసి బందీలుగా తీసుకెళ్లి... వారిని వేధింపులకు గురిచేశారు. అది యుద్ధ నిబంధనలకు వ్యతిరేకం. అంతేగాకుండా వారిలో చాలామందిని అత్యంత క్రూరంగా హింసించి చంపుతున్నారనే వార్తలూ వస్తున్నాయి. అదే సమయంలో... ఇజ్రాయెల్‌ ప్రభుత్వం హమాస్‌ను ఈ భూమ్మేదే లేకుండా సర్వనాశనం చేస్తానంటూ ప్రతిజ్ఞ చేసి... గాజాను పూర్తిగా నిర్బంధించటం కూడా యుద్ధ నియమాలకు వ్యతిరేకమే! గాజా ప్రాంతానికి కరెంటు, నీరు, ఆహార పదార్థాలు... అన్నీ ఆపేయటం జెనీవా ఒప్పందాలను ఉల్లంఘించినట్లే! ‘ఒక సంస్థ, గ్రూపు చేసిన అరాచకానికి... మొత్తం ప్రజలను హింసించటం ఏ విధంగానూ సమర్థనీయం కాదు’ అన్నది మానవ హక్కుల సంఘాల వాదన. దీన్ని ఇజ్రాయెల్‌ తోసిపుచ్చుతోంది. ఐక్యరాజ్య సమితి చార్టర్‌ 51వ నిబంధనను (దాడి జరిగినప్పుడు ఆత్మరక్షణకు ఉద్దేశించింది) ఎత్తిచూపుతోంది. ‘‘మేం యుద్ధ నిబంధనలకు అనుగుణంగానే నడుచుకుంటున్నాం. హమాస్‌ ఎంత దారుణంగా రెచ్చగొట్టినా సంయమనంతో ఎదురుదాడి చేస్తున్నాం. సామాన్య పౌరులు గాజాను ఖాళీ చేసి వెళ్లాలని సమయం కూడా ఇస్తున్నాం’’ అని ఇజ్రాయెల్‌ సైనిక ప్రతినిధి సమర్థించుకున్నారు. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టులో ఇజ్రాయెల్‌కు సభ్యత్వం లేదు. పాలస్తీనాకు ఉంది. దీని ప్రకారం... పాలస్తీనాపై పాలస్తీనావాసులుగానీ, పాలస్తీనేతరులుగానీ దాడి చేసి నేరం చేస్తే ఐసీసీ ఆ కేసును విచారించొచ్చు. 2014 గాజా యుద్ధంలో నేరాలపై ఐసీసీ విచారణ మొదలెట్టినా ఇజ్రాయెల్‌ దాన్ని ప్రతిఘటించింది.

ఈనాడు ప్రత్యేక విభాగం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని