14 లక్షల వీసా దరఖాస్తుల పరిష్కారం

భారత్‌లోని కాన్సులేట్లద్వారా 2023లో 14 లక్షల మంది భారతీయుల వీసా దరఖాస్తులను పరిష్కరించామని, సందర్శక వీసాల (బీ-1/బీ-2) దరఖాస్తుదారులు వేచి ఉండే సమయాన్ని 75శాతం తగ్గించగలిగామని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

Updated : 30 Jan 2024 05:59 IST

 2023లో రికార్డు సృష్టించిన అమెరికా
1,40,000 మంది విద్యార్థులకు వీసా
ప్రతి నాలుగో విదేశీ విద్యార్థీ భారతీయుడే

దిల్లీ: భారత్‌లోని కాన్సులేట్లద్వారా 2023లో 14 లక్షల మంది భారతీయుల వీసా దరఖాస్తులను పరిష్కరించామని, సందర్శక వీసాల (బీ-1/బీ-2) దరఖాస్తుదారులు వేచి ఉండే సమయాన్ని 75శాతం తగ్గించగలిగామని దిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. వీసా దరఖాస్తుల పరిష్కార ప్రక్రియలో మెరుగైన పద్ధతులను అవలంభించడం, సిబ్బందిని పెంచడంవల్ల ఇది సాధ్యమైందని తెలిపింది. సందర్శక వీసా దరఖాస్తులకు ప్రస్తుతం వేచి ఉండే సమయాన్ని 1000 రోజుల నుంచి 250 రోజులకు తగ్గించగలిగామని వివరించింది. మిగిలిన వీసా దరఖాస్తుల సమయాన్ని అత్యంత కనిష్ఠ స్థాయికి తీసుకెళ్లగలిగామని పేర్కొంది. 2022తో పోలిస్తే 2023లో దరఖాస్తుదారులు 60శాతం పెరిగారని తెలిపింది.‘ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా వీసాలకు దరఖాస్తు చేసే ప్రతి 10 మందిలో ఒకరు భారతీయులే. అమెరికా చరిత్రలోనే రెండో అత్యధిక బీ-1/బీ-2 వీసా దరఖాస్తులు 2023లో భారత్‌ నుంచి వచ్చాయి. ఆ ఏడాదిలో 7,00,000కుపైగా దరఖాస్తులను పరిష్కరించాం. తొలి 3 నెలల్లోనే ముంబయిలో సిబ్బందిని పెంచడంద్వారా,  ఆధునిక సాంకేతిక పద్ధతులద్వారా ఇది సాధ్యమైంది’ అని అమెరికా రాయబార కార్యాలయం వివరించింది.

విద్యార్థి వీసాల్లో రికార్డు

‘2023లో భారత్‌లోని అమెరికా కాన్సులేట్లు 1,40,000 మంది విద్యార్థులకు వీసాలను ఇచ్చాయి. ఇది ఏ దేశంతో పోల్చుకున్నా ఎక్కువే. ఇలా అత్యధిక వీసాలను భారతీయ విద్యార్థులకు జారీ చేయడం వరుసగా ఇది మూడో ఏడాది. ముంబయి, దిల్లీ, హైదరాబాద్‌, చెన్నై ప్రపంచంలోనే అత్యధిక విద్యార్థి వీసాలను జారీ చేసే కేంద్రాల్లో తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఫలితంగా అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యలో భారత్‌ మొదటి స్థానానికి చేరుకుంది. ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న 10లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో నాలుగో వంతు భారతీయులే’ అని అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు