మాస్కో ఉగ్రదాడి ముష్కరుల నేరాంగీకారం

ఓ సంగీత కచేరీపై విరుచుకుపడి పెద్దఎత్తున ప్రజల ప్రాణాలు బలిగొన్న ముష్కరులు రష్యా న్యాయస్థానంలో తమ నేరాన్ని అంగీకరించారు.

Published : 26 Mar 2024 05:37 IST

తీవ్రగాయాలతో కోర్టుకు హాజరు

మాస్కో: ఓ సంగీత కచేరీపై విరుచుకుపడి పెద్దఎత్తున ప్రజల ప్రాణాలు బలిగొన్న ముష్కరులు రష్యా న్యాయస్థానంలో తమ నేరాన్ని అంగీకరించారు. కాల్పులు, బాంబు పేలుళ్ల తర్వాత పరారయ్యే ప్రయత్నంలో శుక్రవారం పట్టుబడిన నలుగురిని సోమవారం మాస్కోలోని బాస్మనీ జిల్లా న్యాయస్థానంలో హాజరుపరిచారు. వీరందరినీ అద్దాల గదిలో ఉంచి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వారిలో ఒకరి చెవి పూర్తిగా కోసేసి ఉంది. మే 22 వరకు నలుగురినీ కస్టడీలో ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. పోలీసులు మొత్తం ఏడుగురు అనుమానితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వారిలోనే ఈ నలుగురు (దలెర్ద్‌జొన్‌ మిర్జొయెవ్‌, సైదక్రామి రచబలిజొద, షంసిదున్‌ ఫరీదుని, ముఖమ్మద్‌సొబిర్‌ ఫైజొవ్‌) ఉన్నారు. వీరు అఫ్గానిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌-ఖొరాసాన్‌ ఉగ్రముఠాకు చెందినవారిగా అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాలతో కనిపించిన ముగ్గురూ నేరాన్ని అంగీకరించగా- నాలుగో వ్యక్తి అసలు మాట్లాడలేని స్థితిలో.. విచారణ జరుగుతున్నంతసేపూ చక్రాల కుర్చీలో కళ్లు మూసుకొని ఉన్నాడు. వారికి కరెంట్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా విచారణాధికారులు తీవ్రంగా హింసించి ఉంటారని కథనాలు వెలువడ్డాయి. 

డబ్బు కోసమే చేశామని వెల్లడి

నిందితులను రష్యా-బెలారస్‌ సరిహద్దులోని ఓ గ్రామంలో బంధించి విచారించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. డబ్బు కోసమే ప్రజలపై కాల్పులు జరిపానని నిందితుల్లో ఒకరు వెల్లడించినట్లు తెలిపింది. మాస్కోలో దాడులకు ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులే కారణమని నమ్మడానికి ఆధారాలుంటే ఇవ్వాలని అమెరికాను రష్యా కోరింది.

అతివాద ఇస్లామిస్టుల పనే: పుతిన్‌

ఉగ్రదాడికి పాల్పడినవారు అతివాద ఇస్లామిస్టులని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తాజాగా ఆరోపించారు. ఇస్లామిక్‌ అతివాదులు ఏ భావజాలంతో పనిచేస్తున్నారో దానికి అనుగుణంగానే వీరూ ఘాతుకానికి తెగబడ్డారని సోమవారం ఓ సమావేశంలో వ్యాఖ్యానించారు. కాల్పుల తర్వాత వారు ఉక్రెయిన్‌ వైపు పారిపోయేందుకు ఎందుకు ప్రయత్నించారో, వారి కోసం అక్కడ ఎవరు నిరీక్షిస్తున్నారో తెలుసుకోవాల్సి ఉందన్నారు. 


రెండు రష్యా నౌకల్ని ధ్వంసం చేసిన ఉక్రెయిన్‌

కీవ్‌: రష్యాకు చెందిన రెండు భారీ నౌకలను నల్ల సముద్రంలో ఉక్రెయిన్‌ ఒకేరోజు ధ్వంసం చేసింది. దీంతో ఈ యుద్ధంలో 20 నౌకలను రష్యా నష్టపోయినట్లైంది. ఉక్రెయిన్‌ చర్య చరిత్రలో నిలిచిపోతుందని యూకే రక్షణ మంత్రి గ్రాంట్‌ షాంప్స్‌ పేర్కొన్నారు. ‘నల్ల సముద్రం నుంచి పుతిన్‌ సురక్షితంగా పోరాడే అవకాశం లేదు. 1783 నుంచి నల్ల సముద్ర దళాన్ని రష్యా నిర్వహిస్తున్నా ప్రయోజనం లేదు. ఈ యుద్ధంలో ఉక్రెయిన్‌ ఓటమిని ప్రపంచం తట్టుకోలేదు. రష్యా దాడులను తట్టుకొనేలా కీవ్‌కు మేం అండగా ఉంటాం’ అని చెప్పారు. తాజాదాడితో రష్యాకు ఇక కేవలం మూడు ల్యాండింగ్‌ షిప్‌లు మాత్రమే నల్ల సముద్రంలో మిగిలినట్లయింది. యుద్ధం మొదలైనప్పుడు మాస్కో వద్ద ఇలాంటి 13 నౌకలు ఉండేవి. ఉక్రెయిన్‌ దాడులను తట్టుకోలేక గతేడాది రష్యా చాలావరకు బ్లాక్‌ సీ నౌకాదళాన్ని ఇతర ప్రాంతాలకు తరలించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని