అమెరికాలో కుప్పకూలిన వంతెన

అమెరికాలోని బాల్టిమోర్‌లో భారీ ప్రమాదం జరిగింది. సరకు రవాణా నౌక పిల్లర్‌ను ఢీకొనడంతో నదిపై ఉన్న కీలక వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న వాహనాలన్నీ నీటిలో పడిపోయాయి.

Updated : 27 Mar 2024 08:13 IST

బాల్టిమోర్‌లో పిల్లర్‌ను నౌక ఢీకొనడంతో ప్రమాదం
నౌకా సిబ్బంది భారతీయులే
అందరూ క్షేమం

బాల్టిమోర్‌: అమెరికాలోని బాల్టిమోర్‌లో భారీ ప్రమాదం జరిగింది. సరకు రవాణా నౌక పిల్లర్‌ను ఢీకొనడంతో నదిపై ఉన్న కీలక వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో ఆ సమయంలో వంతెనపై వెళ్తున్న వాహనాలన్నీ నీటిలో పడిపోయాయి. పలువురు గల్లంతయ్యారు. నదిలో పడిపోయిన వారిలో ఇద్దరిని సహాయక సిబ్బంది కాపాడారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మరోవైపు ఢీకొన్న నౌకలోనూ మంటలు చెలరేగాయి. నౌకలోని సిబ్బంది అంతా భారతీయులే. వారంతా క్షేమంగానే ఉన్నారు. తొలుత నౌకలో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. వెంటనే ప్రమాద సంబంధ సమాచారాన్ని నౌకా సిబ్బంది అధికారులకు అందించారు. మరుక్షణం వంతెనపై వాహనాలను ఆపేయడంతో భారీ ముప్పు తప్పింది. అమెరికా కాలమానం ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యాయి.

పటాప్‌స్కో నదిపై ఉన్న ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెనను నౌక ఢీకొనడంతో వంతెన మొత్తం కుప్పకూలింది. నౌక ఢీకొనగానే వంతెన పిల్లర్‌ బొమ్మలా విరిగిపోయింది. ఆ వెంటనే సెకన్లలోనే వంతెన కూలింది. ప్రమాదం తర్వాత అందులో పడిన వాహనాలు 50 అడుగుల లోతులో కనిపించాయి. ఇలాంటిది ఎన్నడూ చూడలేదని, ఇదంతా సినిమాలో సన్నివేశంలా అనిపించిందని బాల్టిమోర్‌ మేయర్‌ బ్రాండన్‌ స్కాట్‌ వ్యాఖ్యానించారు. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో వంతెన పిల్లర్‌ను నౌక ఢీకొందని తమకు సమాచారం వచ్చిందని బాల్టిమోర్‌ అగ్నిమాపకశాఖ కమ్యూనికేషన్స్‌ డైరెక్టర్‌ కెవిన్‌ కార్ట్‌రైట్‌ తెలిపారు. ‘ఇది అతి తీవ్రమైన అత్యవసర పరిస్థితి. ప్రమాదం జరిగిన సమయంలో వంతెనపై చాలా వాహనాలున్నాయి. ప్రస్తుత మా లక్ష్యం నదిలో పడిపోయిన వారి కోసం గాలించడం. ఏడుగురు నదిలో పడిపోయారని భావిస్తున్నాం. అయితే ఎంత మంది పడిపోయారనేది అప్పుడే పూర్తి స్థాయిలో నిర్ధారణకు రాలేం’ అని కార్ట్‌రైట్‌ వివరించారు. ప్రమాదం నేపథ్యంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. నౌకలోని సిబ్బందికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. నౌక వంతెనను ఢీకొనడానికి దారితీసిన కారణాలు తెలియరాలేదు. ప్రమాదం నేపథ్యంలో అన్ని నౌకల ప్రయాణాన్ని రద్దు చేశారు. వంతెనకు మరమ్మతు జరిగే వరకూ అనుమతించబోమని వెల్లడించారు.

మధ్యాహ్నం జరిగి ఉంటే..

ప్రమాదం అర్ధరాత్రి జరగడంవల్ల వంతెనపై ఎక్కువగా వాహన సంచారం లేదని, అదే మధ్యాహ్నం సమయంలో జరిగి ఉంటే వందల కార్లు వంతెనపై ఉండేవని, ఊహించని ఉత్పాతం జరిగి ఉండేదని కార్ట్‌రైట్‌ పేర్కొన్నారు. నౌకా సిబ్బంది హెచ్చరిక కూడా ప్రమాదంలో ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా కాపాడిందని తెలిపారు.

అత్యవసర పరిస్థితి ప్రకటన

ప్రమాదం నేపథ్యంలో మేరీలాండ్‌ గవర్నర్‌ వెస్‌ మూర్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఫెడరల్‌ ప్రభుత్వ సహకారం తీసుకుంటున్నామని చెప్పారు. ఎఫ్‌బీఐ ఘటనా స్థలికి చేరుకుంది. అయితే ఉగ్రవాద కోణంలో ఆధారాలేమీ లభించలేదని వారు తెలిపారు.

1977లో నిర్మాణం

అమెరికా తూర్పు తీరంలో ఉన్న మేరీలాండ్‌లోని బాల్టిమోర్‌ సరకు రవాణాకు కీలక కేంద్రం. ఆ నగరంలోని పటాప్‌స్కో నదిపై 1977లో ఫ్రాన్సిస్‌ స్కాట్‌ కీ వంతెనను నిర్మించారు. ఒక రచయిత పేరును ఈ వంతెనకు పెట్టారు.

సిబ్బంది భారతీయులే

సింగపూర్‌ జెండాతో ‘డాలీ’ అనే నౌక బాల్టిమోర్‌ నుంచి శ్రీలంక రాజధాని కొలంబోకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌక 985 అడుగుల పొడవు, 157 అడుగుల వెడల్పు ఉంది. ఈ నౌకను మెర్స్క్‌ షిప్పింగ్‌ కంపెనీ అద్దెకు తీసుకుంది. ఈ ప్రమాదం జరిగిన వార్తలు రాగానే నాస్‌డాక్‌ కోపెన్‌హాగెన్‌లో షేరు ధర 2 శాతం పడిపోయింది. నౌకలోని మొత్తం 22 మంది సిబ్బంది భారతీయులేనని కంపెనీ వెల్లడించింది. వారెవరికీ గాయాలు కాలేదని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని