చైనీయులే లక్ష్యంగా పాక్‌లో ఉగ్రదాడి!

పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు చోట్ల  దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో అయిదుగురు చైనీయులు, ఓ పాకిస్థానీ సహా నలుగురు ఉగ్రవాదులు మరణించారు.

Published : 27 Mar 2024 03:37 IST

అయిదుగురు చైనా జాతీయుల మృతి
మరో పాకిస్థానీ కూడా..

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రెండు వేర్వేరు చోట్ల  దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనల్లో అయిదుగురు చైనీయులు, ఓ పాకిస్థానీ సహా నలుగురు ఉగ్రవాదులు మరణించారు. వాయవ్య పాకిస్థాన్‌లోని ఖైబర్‌ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో మంగళవారం ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో పాకిస్థానీ డ్రైవర్‌తో పాటు ఐదుగురు చైనీయులు మృతిచెందారు. చైనీయులు ప్రయాణిస్తున్న బస్సు మీదకు పేలుడు పదార్థాలతో నిండిన వాహనం దూసుకుపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. మృతులంతా చైనా-పాకిస్థాన్‌ ఆర్థిక నడవాలో భాగంగా చేపట్టిన ‘దాసు జలవిద్యుత్‌ ప్రాజెక్టు’ కోసం పనిచేస్తున్నట్లు అధికారులు వివరించారు. కాగా, ఈ దాడికి ఇప్పటివరకూ ఏ ఉగ్ర సంస్థ బాధ్యత వహించలేదు.

నలుగురు ఉగ్రవాదుల హతం: పాకిస్థాన్‌లోని రెండో అతిపెద్ద నౌకాదళ వైమానిక స్థావరం పీఎన్‌ఎస్‌ సిద్ధిఖ్‌పై సోమవారం రాత్రి దాడి జరిగింది. బలూచిస్థాన్‌ రాష్ట్రం టర్బులెంట్‌ జిల్లా టర్బట్‌లో గల ఈ స్థావరంపై పలువురు తిరుగుబాటుదారులు తుపాకులు, బాంబులతో విరుచుకుపడ్డారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. నలుగురు తిరుగుబాటుదారులను హతమార్చారు. ఎయిర్‌స్టేషన్‌కు ఎలాంటి నష్టం జరగలేదని వెల్లడించారు. ఈ స్థావరంలో చైనాకు చెందిన డ్రోన్లను పెద్ద ఎత్తున మోహరించినట్లు సమాచారం. ఈ దాడికి బాధ్యత వహిస్తూ ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ’ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ కాల్పుల్లో పాకిస్థానీ బలగాలకు చెందిన డజను మంది మృతిచెందినట్లు తెలిపింది. వారం రోజుల్లో ఈ ముఠా ఇలాంటి దాడికి యత్నించడం ఇది రెండోసారి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని