farmgate scandal: దేశాధ్యక్షుడి అక్రమాలనే పట్టించిన దొంగతనం..!
దేశాధ్యక్షుడి ఫామ్‌హౌస్‌లో జరిగిన ఓ దొంగతనం అతడి అక్రమాలను వెలుగులోకి తెచ్చింది. దొంగతనం విషయం బయటకు రాకుండా చేయాలనుకున్న అతడి ప్లాన్ బెడిసికొట్టింది.
ఇంటర్నెట్‌డెస్క్ ప్రత్యేకం
‘డబ్బుపోయే శనిపట్టే’ అన్నట్లుంది దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా పరిస్థితి. అక్రమంగా ఫామ్‌హౌస్‌లో దాచుకొన్న డబ్బు పోయింది.. ‘తేలుకుట్టిన దొంగలా’ ఉందామని ఆయన యత్నించినా.. ఆ విషయం బయటకు వచ్చి పదవి కూడా ఊడే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా రాజకీయాలను ఫలాఫలా ‘ఫామ్‌గేట్’ కుంభకోణం కుదిపేస్తోంది. అవినీతిని నిర్మూలిస్తానంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన రామ ఫోసా అక్రమ సొమ్ము కూడబెట్టారనే అపవాదును మోస్తున్నారు. పోయిన డబ్బేదో పోయింది.. దొంగల నోరు మూయించడానికి ఎదురు చెల్లింపులు చేశారంటే ఆయన పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అధ్యక్షుడు సిరిల్ రామఫోసాపై ఆరోపణలు చేసింది ఎవరో సాధారణ వ్యక్తికాదు. సౌతాఫ్రికన్ స్టేట్ సెక్యూరిటీ ఏజెన్సీ మాజీ అధిపతి ఆర్థర్ ఫ్రాసెర్.
అధ్యక్షుడి సొమ్ము దొంగలపాలు..
2020 ఫిబ్రవరి9న దక్షిణాఫ్రికాలోని లింపూపూ ప్రావిన్స్‌లోని రామఫోసాకు ఫలాఫలా వైల్డ్‌లైఫ్ ఫామ్ ఉంది. అక్కడి ఫర్నీచర్‌లో లక్షల డాలర్లను దాచిపెట్టారు. అక్కడి హౌస్‌కీపర్ ఈ విషయాన్ని గుర్తించి తన సోదరుడికి చెప్పింది. అతడికి తెలిసిన ఓ క్రిమినల్ గ్యాంగ్ రంగంలోకి దిగింది. ఆరుగురు సభ్యుల ఈ గ్యాంగ్‌లో నలుగురు నమీబియా వాసులు ఉన్నారు. వీరు ఫామ్‌హౌస్‌లోకి రావడానికి హౌస్‌కీపర్ సహకరించింది. ఆ గ్యాంగ్ అక్కడి సొమ్మును దోచుకొంది. ఆ సమయంలో అధ్యక్షుడు రామఫోసా విదేశీ పర్యటనలో ఉన్నారు. దొంగతనం విషయం తెలియగానే ప్రెసిడెన్షియల్ ప్రొటెక్షన్ పోలీస్ యూనిట్‌ను నిందితులను పట్టుకోవాలని పురమాయించారు. అంతేగానీ, సంబంధిత శాఖ వద్ద ఎటువంటి కేసు పెట్టలేదు. ప్రెసిడెన్షియల్ ప్రొటెక్షన్ పోలీస్ యూనిట్ అధిపతి మేజర్ జనరల్ వాలీ రుడ్ మాత్రం రిటైర్డ్ పోలీసులు, క్రైం ఇంటెలిజెన్స్ యూనిట్‌లోని పోలీసులతో కలిపి బృందాన్ని ఏర్పాటు చేశాడు. వారు హౌస్ కీపర్, అతడికి సహకరించిన వారిని పట్టుకొని కొంత సొమ్ము రికవరీ చేశారు. నిందితులు ఈ విషయాలు ఎక్కడా చెప్పకుండా ఉండటానికి ఎదురు డబ్బు చెల్లించారు.
ఎలా బయటకు వచ్చింది..
2022 జూన్ 1న దేశాధ్యక్షుడు రామఫోసాపై కిడ్నాప్, లంచాలు, మనీలాండరింగ్, సుమారు 4 మిలియన్ డాలర్లకు సంబంధించి నేరాలను దాచడం వంటి ఆరోపణలు చేస్తూ జొహన్నెస్‌బర్గ్ పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. సౌతాఫ్రికన్ స్టేట్ సెక్యూరిటి ఏజెన్సీ మాజీ అధిపతి ఆర్థర్ ఫ్రాసెర్ ఆ ఫిర్యాదుదారు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలు కూడా సమర్పించాడు. ఆ దేశంలోని ప్రివెన్షన్ అండ్ కాంబాట్ కరెప్ట్ యాక్టివిటీస్ చట్టం కింద ఈ ఆరోపణలు నమోదయ్యాయి. ఈ చట్టం కింద వచ్చే నేరాలపై ఫిర్యాదు చేయకపోవడం కూడా నేరమే అవుతుంది. దొంగతనంలో పోయిన సొమ్ము అక్రమ సంపాదనగా ఆరోపణలు వెల్లువెత్తాయి. ‘ఫామ్‌గేట్’ కుంభకోణంగా ఇది పాపులర్ అయింది. దీంతో అధ్యక్షుడు ప్రతినిధి జూన్2వ తేదీన ఫలాఫలా ఫామ్‌లో దొంగతనం జరిగిందని అంగీకరించాడు. ప్రెసిడెన్షియల్ ప్రొటెక్షన్ యూనిట్‌కు ఫిర్యాదు చేసిన విషయాన్ని కూడా ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో రామఫోసాపై దర్యాప్తు మొదలైంది. మరోవైపు రామఫోసా ఆ డబ్బు ఎలా వచ్చిందో చాలా కాలం నోరు మెదపలేదు. దర్యాప్తు సంస్థ విచారణలో మాత్రం ‘పశువుల విక్రయాలతో సంపాదించిన సొమ్ము’ అని పేర్కొన్నాడు.
తాజాగా ఏం జరుగుతోంది..
ఆ దేశ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ శాండిల్ నగ్‌కోబో ఆధ్వర్యంలోని దర్యాప్తు ప్యానెల్ బుధవారం తన నివేదికను నేషనల్ అసెంబ్లీ స్పీకర్‌కు అందజేసింది. అందులో రామఫోసాను తప్పుబట్టింది. ఆయనను అభిశంసించడానికి అది మార్గం సుగమం చేసింది. దక్షిణాఫ్రికాలో ఎటువంటి అనుమతి లేకుండా భారీ మొత్తంలో విదేశీ మారక ద్రవ్యాన్ని వ్యక్తుల వద్ద నిల్వచేయడం నేరం. దీంతో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్నాయి. కాకపోతే ఆయన్ను పదవి నుంచి తొలగించే బలం ప్రతిపక్షాలకు లేదు.
ఆర్థర్ ఫ్రాసెర్ దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు జాకబ్ జుమాకు నమ్మినబంటుగా పేరుంది. జాకబ్ జుమాపై అవినీతి ఆరోపణలు రావడంతో రామఫోసాకు దేశాధ్యక్ష పగ్గాలు అందాయి. ఆ తర్వాత అవినీతిని నిర్మూలిస్తానంటూ రామఫోసా ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. రాజకీయ వైరం కారణంగా ఆర్థర్ ఫ్రాసెర్ ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. 2024లో జరిగే ఎన్నికల్లో ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ తరపున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకోవడానికి దాదాపు నెలరోజుల ముందు ఈ కుంభకోణం సౌతాఫ్రికాను కుదిపేస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
వయసు 14.. బూట్ల సైజు 23!.. అసాధారణ రీతిలో పెరుగుతున్న పాదాలు
-
World News
ఉనికికే ముప్పొస్తే ఎవరినైనా లేపేస్తాం: అమెరికాకు రష్యా తాజా హెచ్చరిక
-
India News
సోదరి వివాహానికి రూ.8.1 కోట్ల కానుకలు
-
Politics News
రాజకీయాల్లోకి సుష్మా స్వరాజ్ కుమార్తె
-
Ts-top-news News
ఎన్ఐటీ విద్యార్థుల హవా.. ప్రాంగణ నియామకాల్లో 1,326 మంది ఎంపిక
-
Sports News
నిఖత్‌కు మహీంద్రా థార్