Ukraine Crisis: ‘బ్యాటిల్‌ ఆఫ్‌ బ్రోవరీ’.. పల్లె గెలిపించిన యుద్ధం..!

జీవన్మరణ పోరాటంలో.. మీ దగ్గర తుపాకీ ఉందా.. కత్తి ఉందా.. కర్ర ఉందా.. అనవసరం. చేతికందిన ఆయుధంతో పోరాటం చేసి ప్రాణాలు నిలుపుకోవాలి. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వాసులు అదే చేశారు. రష్యన్లతో పోలిస్తే అత్యంత బలహీనమైన

Updated : 09 May 2022 12:11 IST

 గ్రామస్థులే వేగులుగా.. టెలిగ్రామే వాహకంగా..!

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

జీవన్మరణ పోరాటంలో.. మీ దగ్గర తుపాకీ ఉందా.. కత్తి ఉందా.. కర్ర ఉందా.. అనవసరం. చేతికందిన ఆయుధంతో పోరాటం చేసి ప్రాణాలు నిలుపుకోవాలి. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ వాసులు అదే చేశారు. రష్యన్లతో పోలిస్తే అత్యంత బలహీనమైన సేనలకు వీలైనంత సాయం చేశారు. యుద్ధంలో అత్యంత కీలకమైన సమాచారాన్ని వారికి ఎప్పటికప్పుడు చేరవేశారు. వేర్వేరు ప్రయోజనాల కోసం ఏర్పాటు చేసుకొన్న యాప్స్‌ను ఇందుకోసం వాడుకొన్నారు. కీవ్‌ దళాల గురితప్పి ఉన్న ఆయుధాలు వృథా కాకుండా రష్యా దళాల కచ్చితమైన కదలికల సమాచారాన్ని అందించారు. ఫలితంగా కీవ్‌ను ఆక్రమించుకొనేందుకు వచ్చిన మాస్కో సేనలకు హైవే-7పై అత్యంత తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. దీంతో ఆ సేనలు వెనుదిరగాల్సి వచ్చింది.

మాస్కోకు అతిపెద్ద ఓటమి హైవే-7పైనే..

ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో కీలకమైన పోరు జరిగిన ప్రదేశాల్లో హైవే-7 ఒకటి. ఇది రష్యా నుంచి ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌కు వెళుతుంది. ఈ మార్గంలోని గ్రామాల ప్రజలు సాధారణ యాప్‌లు, గూగుల్‌ మ్యాప్‌లను వాడి రష్యా దళాల కదిలకలను ఎప్పటికప్పుడు కీవ్‌ సేనలకు అందజేశారు. దీంతో ఉక్రెయిన్‌ దళాలు కచ్చితంగా గురిచూసి రష్యా దళాలను ఓడించాయి. ఒక దశలో రష్యా దళాలు మొబైల్‌ అంత్యక్రియల కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చిందని గ్రామస్థులు చెప్పారు.

బైకీవ్‌ అనే గ్రామంలో రష్యా దళాలు ఓ ఆస్పత్రిలో మందుగుండు, సాయుధ వాహనాలను ఉంచాయి. ఈ సమాచారం తెలుసుకొన్న ఉక్రెయిన్‌ దళాలు ఆ ఆసుపత్రిపై దాడి చేసి సమూలంగా ధ్వంసం చేశాయి. అసుపత్రి పోయిందన్న భాధ గ్రామస్థుల్లో ఉన్నా.. రష్యన్ల ఆక్రమణ అడ్డుకొన్నామని గ్రామస్థులు భావిస్తున్నారు.

రష్యా దళాలు కీవ్‌ను స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన సమయంలో భారీ కాన్వాయ్‌లను తరలించాయి. వీటికి సంబంధించిన రేషన్‌,ఇంధనం వంటి వాటి సరఫరాకు హైవే-7ను ఎంచుకొంది. ఇది 230 మైళ్ల పొడవు ఉంది.  ఈ మార్గంలో ఉక్రెయిన్‌ దళాలు జరిపిన దాడులు రష్యాను కుంగదీశాయి. రష్యా దళాల నిర్లక్ష్యంతో లాజిస్టిక్స్‌పై దృష్టిపెట్టలేదని సైనిక నిపుణులు చెబుతున్నారు. తక్కువ బడ్జెట్‌ కూడా దీనికి కారణం కావచ్చని పేర్కొన్నారు.

90వ గార్డ్స్‌ ట్యాంక్‌ డివిజన్‌కు మృత్యువల..

హైవే-7పై కీవ్‌ శివార్లలోని బ్రోవరి అనే ప్రదేశంలో రష్యాకు చెందిన 90గార్డ్స్‌ ట్యాంక్‌ డివిజన్‌ను పూర్తిగా ధ్వంసం చేశారు. ఇక్కడ ఉక్రెయిన్‌ దళాలు యాంటీ ట్యాంక్‌ ఆయుధాలతో ముందు, వైనుక వైపు నుంచి విరుచుకుపడి ట్యాంకుల శ్రేణి మొత్తాన్ని ధ్వంసం చేశాయి. ఈ వీడియోలు ఇప్పటికీ సోషల్‌ మీడియాలో వైరల్‌గా ఉన్నాయి. ఈ యుద్ధంలో టెట్యాన చొర్నోవోల్‌ అనే ఉక్రెయిన్‌ ప్రజాప్రతినిధి కూడా పాల్గొన్నాడు. ఈ దాడికి అవసరమైన ఇంటెలిజెన్స్‌ సమాచారం మొత్తం గ్రామస్థుల నుంచి వచ్చిందే.

సాధారణ యాప్స్‌నుంచే కీలక సమాచారం..

ఈ జాతీయ రహదారి వెంట ఉన్న చాలా గ్రామాలు రష్యాసేనల చేతిలోకి వెళ్లాయి. దీంతో ఉక్రెయిన్‌ బలగాలకు రష్యా దళాల కదలికలకు సంబంధించి కచ్చితమైన ఇంటెలిజెన్స్‌ అందడం కష్టమైంది.  మరోపక్క సుమీ నగరం నుంచి బ్రోవరీకి వెళుతున్న దళాలు చెట్లల్లో నక్కుతున్నాయి. దీంతో ఉక్రెయిన్‌ మినిస్ట్రీ ఆఫ్‌ డిజిటల్‌ టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్‌ ఓ టెలిగ్రామ్‌ ఛానల్‌ను ఏర్పాటు చేసి.. అందులో రష్యా దళాల కదలికలు చెప్పాలని కోరింది. దీంతోపాటు కీవ్‌లో పార్కింగ్‌ టికెట్లు జారీ, నీటి సరఫరా నిలిపివేత తెలియజేసేందుకు వాడే ఓ యాప్‌లో మార్పులు చేసి రష్యా దళాల కదలికలను గ్రామస్థులు వెల్లడించేలా ఏర్పాటు చేశారు. ఇలా సేకరించిన సమాచారాన్ని ఉక్రెయిన్‌ జనరల్‌ స్టాఫ్‌కు అందజేశారు. అక్కడ వివిధ మార్గాల్లో వారు సేకరించిన డేటాతోపోల్చి చూసి ధ్రువీకరించుకొన్నాక దాడులు చేశారు. అంతేకాదు.. ప్రజలకు గూగుల్‌ మ్యాప్స్‌లో లొకేషన్‌  పిన్‌ చేయడం నేర్పడం కూడా మాస్కో దళాల అనుపానులు చెప్పేందుకు ఉపయోగపడింది. అక్కడి ప్రజలు సమాచారం అందించాక.. సదరు డేటాను డిలీట్‌ చేసేవారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని