Pakistan: పాక్‌ను ఐఎమ్‌ఎఫ్‌ వలస దేశంగా చూస్తోంది: పీఎంఎల్‌

ఐఎమ్‌ఎఫ్‌ (IMF)తో గత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ (Imran Khan) చేసుకున్న ఒప్పందాల కారణంగా ఒక బిలియన్‌ డాలర్‌ అప్పు కోసం పాక్‌ (Pakistan) ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తిందని  పీఎంఎల్‌ (ఎన్‌) సీనియర్‌ నాయకురాలు మరియమ్‌  నవాజ్‌ (Marayam Nawaz) ఆరోపించారు.

Published : 14 Mar 2023 17:24 IST

లాహోర్‌: అంతర్జాతీ ద్రవ్య నిధి సంస్థ (IMF) చేతిలో పాకిస్థాన్‌ (Pakistan) బందీ అయిందని మాజీ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ కుమార్తె, పీఎంఎల్‌ (ఎన్‌) సీనియర్‌ నాయకురాలు మరియమ్‌  నవాజ్‌ (Marayam Nawaz) ఆరోపించారు. ఈ పరిస్థితికి మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ (Imran Khan) గతంలో చేసుకున్న ఒప్పందాలే కారణమని ఆమె విమర్శించారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు అత్యవసర సాయం కింద 1.1 బిలియన్‌ డాలర్లు అందించేందుకు ఐఎమ్‌ఎఫ్‌ అంగీకరించిన సంగతి తెలిసిందే. ‘‘ఐఎమ్‌ఎఫ్‌కు పాక్‌పై నమ్మకం లేదు. ప్రస్తుతం పాక్‌ ఐఎమ్‌ఎఫ్ చేతిలో బందీగా ఉంది. అది మా దేశాన్ని వలస దేశంగా చూస్తోంది. పాక్ ఈ పరిస్థితి నుంచి బయటపడలేని స్థితిలో ఉంది. ఐఎమ్‌ఎఫ్‌తో గత ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ చేసుకున్న ఒప్పందాల కారణంగా ఒక బిలియన్‌ డాలర్ల అప్పు కోసం పాక్‌ ఎదురుచూడాల్సిన పరిస్థితి తలెత్తింది’’ అని ఆమె వ్యాఖ్యానించారు. 

పాకిస్థాన్‌ను ఈ స్థితికి దిగజార్చిన ఇమ్రాన్‌ఖాన్‌ను అరెస్టు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. ప్రధానిగా ఉన్నప్పుడు బహూకరించిన బహుమతులను ఇమ్రాన్‌ అమ్ముకోవడాన్ని కూడా ఆమె తప్పుబట్టారు. ‘‘అరెస్టుకు భయపడి ఆయన పార్టీ కార్యకర్తల వెనక దాక్కుంటున్నారు. మరోసారి ప్రధాని కావాలని ఇమ్రాన్‌ కలలు కంటున్నారు. ప్రజలకు ఏం చేశారని మరోసారి ఆయన్ను గెలిపిస్తారు. ఇమ్రాన్‌కు కొందరు ఆర్మీ జనరల్స్‌, న్యాయమూర్తులు అండగా ఉన్నారు. వారి సాయంతో ఆయన మరోసారి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు’’ అని మరియమ్‌ ఆరోపించారు. 

2019లో ఇమ్రాన్‌ఖాన్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఐఎమ్‌ఎఫ్‌ నుంచి ఆరు మిలియన్‌ డాలర్ల సాయం పొందేందుకు ఒప్పదం చేసుకుంది. గతేడాది ఈ మొత్తాన్ని ఏడు బిలియన్‌ డాలర్లకు పెంచారు. మరోవైపు ఐఎమ్‌ఎఫ్‌ ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని అందుకోవడానికి ఆ సంస్థ చెప్పిన షరతులన్నింటికీ పాక్‌ అంగీకరిస్తోంది. ఐఎంఎఫ్‌ను సంతృప్తి పరిచేందుకు ప్రజలపై పన్నుల భారం మోపేందుకూ సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని