క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్‌ వాడతారా..? ఐఎంఎఫ్‌ ఒప్పందం నేపథ్యంలో ఇమ్రాన్‌ ఫైర్

పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో బెయిలవుట్‌ ప్యాకేజీలో భాగంగా ఐఎంఎఫ్‌(IMF) నుంచి తొలి విడత రుణసాయాన్ని విడుదల చేయించుకునే వ్యూహంతో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ తప్పుపట్టారు.

Updated : 17 Feb 2023 14:49 IST

ఇస్లామాబాద్‌: విదేశీ మారక నిల్వలు క్షీణించి, దివాలా అంచున ఉంది పాకిస్థాన్‌(Pakistan). ప్రస్తుత సంక్షోభం నుంచి బయటపడేందుకు రుణం కోసం తీవ్ర ఇక్కట్లు పడుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ప్రకటించిన ఉద్దీపన ప్యాకేజీని అందుకోవడానికి చెప్పిన షరతులన్నింటికీ తలూపుతోంది. కాగా, ఈ ఐఎంఎఫ్‌ డీల్‌ను మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan) తప్పుపట్టారు. ఇది క్యాన్సర్ చికిత్సకు డిస్ప్రిన్‌(ఆస్ప్రిన్‌ ) వాడినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ప్రస్తుత ఒప్పందం వల్ల తాత్కాలిక ఉపశమనం ఉంటుందని, కానీ దీర్ఘకాలంలో రుణాల భారం పెరుగుతూనే ఉండటంతో దేశం పెను సంక్షోభంలోకి కూరుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. టీవీ ప్రసంగంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

అలాగే ప్రస్తుత ప్రభుత్వం అనుసరిస్తోన్న ఆర్థిక విధానాలను తప్పుపట్టారు. రాజకీయ రంగానికి ఇమ్రాన్‌ ఖాన్‌ అనే వ్యక్తిని దూరం చేసేందుకు దేశాన్ని నాశనం చేయొద్దన్నారు. అలాగే తన దేశ ఆర్థిక పరిస్థితిపై గ్లోబల్‌ రేటింగ్స్‌ సంస్థ ఫిచ్‌ ఇచ్చిన నివేదికను ప్రస్తావిస్తూ.. పాక్‌ పరిస్థితి మరింత దిగజారుతుందన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్‌ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడానికి సిద్ధంగా ఉందని ఫిచ్‌ పేర్కొంది. ఈ మేరకు పాక్‌(Pakistan) కరెన్సీకి ఇష్యూర్‌ డీఫాల్ట్‌ రేటింగ్‌ (ఐడీఆర్‌) CCC- ఇచ్చింది. గతంలో పాక్‌కు CCC+ రేటింగ్‌ ఉండేది.

బడ్జెట్‌ లోటును తగ్గించుకొని నికర పన్ను వసూళ్లను పెంచుకోవడమే లక్ష్యంగా పాకిస్థాన్‌ ప్రభుత్వం బుధవారం మినీ బడ్జెట్‌ను ఆవిష్కరించింది. దాంతో పెట్రోల్‌ ధరలు గణనీయంగా పెరిగాయి. దీంతో అక్కడి పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠానికి చేరాయి. బెయిలవుట్‌ ప్యాకేజీలో భాగంగా ఐఎంఎఫ్‌ నుంచి తొలి విడత రుణసాయాన్ని విడుదల చేయించుకునే వ్యూహంతోనే ధరల్ని అమాంతం పెంచింది. తమ రుణ సాయం పొందాలంటే పెట్రోలియం ఉత్పత్తుల ధరల్ని పెంచాలని ఐఎంఎఫ్‌ షరతు విధించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని