Ukraine crisis: పుతిన్‌ ప్లాన్‌ మారిందిలా..!

డబ్బు ప్రపంచాన్ని నడిపిస్తుంది.. యుద్ధాలను ఆపేశక్తి దానికుంది. తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభంలో ఆశలు చిగురించడంలో ఇదే కీలక పాత్ర పోషించింది. రష్యాకు కీలక వ్యాపార భాగస్వామి జర్మనీ రంగంలో

Published : 17 Feb 2022 05:03 IST

 ఫలితం చూపించిన జర్మనీ దౌత్యం

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం

డబ్బు ప్రపంచాన్ని నడిపిస్తుంది.. యుద్ధాలను ఆపేశక్తి కూడా దానికుంది. తాజాగా రష్యా-ఉక్రెయిన్‌ సంక్షోభ పరిష్కారానికి ఆశలు చిగురించడంలో ఇదే కీలక పాత్ర పోషించింది. రష్యాకు కీలక వ్యాపార భాగస్వామి జర్మనీ రంగంలోకి దిగడంతో ఉద్రిక్తతలు కొంచెం తెరిపినిచ్చినట్లు కనిపిస్తున్నాయి. బలగాల విరమణ భారీగా లేకపోయినా.. సానుకూల ప్రకటనలు.. చర్చలకు సంసిద్ధతలు వ్యక్తమవుతున్నాయి.

‘ఉక్రెయిన్‌పై దాడి ఆదేశాలను పుతిన్‌ తన జనరల్స్‌కు పంపారు’ అని గత వారం అమెరికాలోని ఒక టీవీ కార్యక్రమం పేర్కొంది. గుర్తు తెలియని అమెరికా అధికారులను దీనికి సోర్స్‌గా పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకొని అమెరికా ఎన్‌ఎస్‌ఏ జాక్‌ సులివన్‌ సహా పలు సీనియర్‌ అధికారులు ఆశ్చర్యపోయారు. ‘పుతిన్‌ ఆ ఆదేశాలు ఇచ్చారంటే తాము నమ్మలేకపోతున్నామని’ ఆన్‌ ది రికార్డ్‌ పేర్కొన్నారు. కానీ, ఏ రోజైనా ఉక్రెయిన్‌పై దాడి ఉంటుందని ప్రకటించారు. దీనికి సంబంధించి రష్యా దళాల సమీకరణ చేసిందని పేర్కొన్నారు.

వాస్తవానికి ఉక్రెయిన్ విషయంలో పుతిన్‌ ఎప్పుడూ ఎవరి అంచనాలకు అందేలా ప్రవర్తించలేదు. గతంలో క్రిమియాను ఆక్రమించుకొన్న సమయంలో కూడా అమెరికా వద్ద దానిని అడ్డుకొనేందుకు ప్లాన్‌ కూడా లేదు. చివరికి ఎటువంటి ఆంక్షలు విధించాలన్నదానిపై సంసిద్ధత కూడా లేదు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌పై అందరి అంచనాలకు తగ్గట్లు పుతిన్‌ ప్లాన్‌ ఉండకపోవచ్చన్న నమ్మకమే అమెరికా ఎన్‌ఎస్‌ఏ జాక్‌ సులివన్‌ వంటి వారి ఆశ్చర్యానికి కారణమైంది.

105 బెటాలియన్లతో భారీ ఎత్తున సేనలు..

రష్యా తాజా మోహరింపుల కోసం సైబీరియా వంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా బలగాలను తరలించింది. ఒక్కో బెటాలియన్‌లో 700-800 మధ్య సైనికులు ఉండేలా 105 బెటాలియన్లను ఇక్కడికి తరలించింది. దీనికి తోడు 500 యుద్ధవిమానాలు, 40 యుద్ధనౌకలను నల్లసముద్రం, అజోవ్‌ సముద్రం వద్ద సిద్ధం చేసింది. ఇక బెలారస్‌తో యద్ధవిన్యాసాల కోసం ఏకంగా ఎస్‌-400 బ్యాటరీలను, సికందర్‌ క్షిపణులను రంగంలోకి దింపింది. యుద్ధ సమయంలో భూమి, ఆకాశం, సముద్రంపై  పూర్తి ఆధిపత్యం కనబర్చేలా ఈ మోహరింపులు ఉన్నాయి. 

రెచ్చగొట్టకపోతే..

ఈ మోహరింపులను గమనించి పలువురు దేశాధినేతలు రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పుతిన్‌ తమ దేశాన్ని ‘రెచ్చగొట్టే చర్యలు’ లేకపోతే ఉద్రిక్తతలు పెరగటం, ఆక్రమణలు జరగడం వంటివి ఉండవని వెల్లడించారు. పరోక్షంగా ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం ఇవ్వొద్దనే అంశాన్ని ఇది పశ్చమదేశాలకు గుర్తు చేసింది.

పుతిన్‌ ప్రకటనను విశ్లేషించిన పశ్చిమ దేశాలు.. ఉక్రెయిన్‌లో రెబల్స్‌ దాడుల రూపంలో రష్యా ఉద్రిక్తతలు సృష్టిస్తుందని హెచ్చరించాయి. ముఖ్యంగా డాన్‌బాస్‌ ప్రాంతంలో ఇవి ఉంటాయని పేర్కొన్నాయి.  

జర్మనీ ప్రభావం చూపింది ఇలా..

ఐరోపా ఖండంలో జర్మనీ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. అంతేకాదు రష్యా ఆర్థిక వ్యవస్థలో కీలకమైన నార్డ్‌స్ట్రీమ్‌, నార్డ్‌స్ట్రీమ్‌-2 గ్యాస్ పైప్‌ లైన్లు జర్మనీకే చేరతాయి. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే నార్డ్‌స్ట్రీమ్‌-2 ప్రాజెక్టుపై ఆంక్షలు విధిస్తానని అమెరికా తెగేసి చెప్పింది. రష్యా అవసరాలు జర్మనీకి బాగా తెలుసు. అందుకే ఆ దేశం మిగిలిన నాటో దేశాల వలే ఉక్రెయిన్‌కు ఆయుధాలను అందించలేదు. కేవలం వైద్యసాయం మాత్రమే చేస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలో జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌ ఉక్రెయిన్‌ చేరుకొని చర్చలు ప్రారంభించగానే రష్యాలో పరిణామాలు మారాయి. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలావ్రోవ్‌ నేతృత్వంలోని నేతలు అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ అయ్యారు. దౌత్య పరిష్కార మార్గాలకు అవకాశం ఉందని నచ్చజెప్పారు. ఈ వ్యవహారం మొత్తం లైవ్‌లో ప్రసారం చేశారు. పుతిన్‌ మెత్తబడి చర్చలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

మరోపక్క తీవ్ర ఒత్తిడిలో ఉన్న ఉక్రెయిన్‌ అధినాయకత్వం కూడా రాజీకి సిద్ధమనే సంకేతాలు పంపింది. బ్రిటన్‌లోని ఉక్రెయిన్ రాయబారి వాడిమ్‌ ప్రైస్టోకో ఓ ఆంగ్ల వార్త సంస్థతో మాట్లాడుతూ యుద్ధం ఆగేందుకు నాటో సభ్యత్వంపై ఆశలు వదులుకొనే అంశం పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. ఆ తర్వాత ఉక్రెయిన్‌ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ అటువంటిదేమీ లేదని చెప్పే యత్నం చేశారు. కానీ, ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్స్కీ జర్మనీ ఛాన్సలర్‌ ఓలాఫ్‌ షోల్జ్‌  కలిసి నిర్వహించిన ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో వాడిమ్‌ ప్రైస్టోకో వ్యాఖ్యలను ఖండించలేదు. పైగా  ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కలలాంటిది అంటూ నిర్వేదంగా మాట్లాడారు. ఈ పరిణామాలు, ఒత్తిళ్లతో రష్యా కొంత దిగివచ్చింది. అంతేకాదు.. దాడి 16వ తేదీ అంటూ అమెరికన్లు మొదటి నుంచి భారీగా ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రచారాన్ని తప్పని నిరూపించడం కోసమైనా రష్యా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి నెలకొంది.

దాడికి విముఖత ఎందుకు..?

రష్యా నేరుగా దాడి చేయడానికి విముఖత చూపడానికి పలు వ్యూహాత్మక కారణాలు ఉన్నాయి.

* ప్రస్తుతం రష్యా ఆర్థిక వ్యవస్థ కొంత మెరుగ్గా ఉంది. ఉక్రెయిన్‌ను ఆక్రమిస్తే అమెరికా, ఇతర  పశ్చిమ దేశాల ఆంక్షల కారణంగా ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి.

* రష్యా కొన్ని వారాల్లో ఉక్రెయిన్‌ను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకోగలదు. ఎందుకంటే అమెరికా, నాటో ఇక్కడకు దళాలను పంపబోమని తేల్చి చెప్పాయి. కానీ, ఉక్రెయిన్‌లోకి ఏటీజీఎం వంటి ఆయుధాలను భారీగా తరలించాయి. ఈ నేపథ్యంలో రష్యా అక్కడ ఏదైనా కీలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ప్రజల తిరుగుబాటు తీవ్రంగా ఉంటుందని గ్రహించింది.

* 1979లో శక్తిమంతమైన సోవియట్‌ యూనియన్‌.. అఫ్గానిస్థాన్‌ను ఆక్రమించిన తర్వాత పశ్చిమ దేశాల తెరవెనక వ్యూహాలతో తీవ్రంగా దెబ్బతిని.. అవమాన భారంతో తిరుగుముఖం పట్టింది. ఈ సారి పుతిన్‌ అటువంటి రిస్క్‌ తీసుకోదలచుకోలేదు.

* నేరుగా యుద్ధం చేస్తే రష్యా సైనికులు కూడా చనిపోయే ప్రమాదం ఉంది. వారి భౌతికకాయాలు తిరిగి రష్యాకు చేరుకొన్న సమయంలో స్థానిక ప్రజల్లో తీవ్ర అసంతృప్తి చెలరేగుతుంది. పుతిన్‌ కీర్తికి ఇది మచ్చగా మారుతుంది.  అందుకే నేరుగా దాడి చేయడానికి ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. 

* ఇప్పటికే డాన్‌బాస్ ప్రాంతంలో మూడోవంతు రెబల్స్‌ ఆధీనంలో ఉంది. ఈ నేపథ్యంలో అక్కడి రెబల్స్‌కు డబ్బు, ఆయుధాలను సరఫరా చేస్తే వారే ఉక్రెయిన్‌లో అస్థిరతకు ఆజ్యం పోస్తారు. రష్యా సేనల చేతికి మట్టి అంటదు. మరోవైపు పశ్చిమ దేశాలతో చర్చలు జరిపి వీలైనన్ని డిమాండ్లను సాధించుకోవచ్చు. శాంతిని కోరుకొనే వ్యక్తిగా మంచి ఇమేజ్‌ కూడా లభిస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని