Biden- Modi: మోదీని ఆటోగ్రాఫ్‌ అడిగిన బైడెన్‌..!

Biden- Modi: జీ7 సదస్సు సందర్భంగా బైడెన్‌, మోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీకి ఉన్న పాపులారిటీ గురించి చెబుతూ.. ‘‘బహుశా నేను మీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలి’’ అని బైడెన్‌ సరదాగా వ్యాఖ్యానించారట!

Updated : 21 May 2023 16:00 IST

హిరోషిమా: మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi)కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి అందరికీ తెలిసిందే. ఈ విషయం అనేక సర్వేల్లో తేటతెల్లమైంది. ఆయన ఏ దేశానికి వెళ్లినా అభిమానులు తండోపతండాలుగా తరలివచ్చి దారి పొడవునా స్వాగతం పలికిన సందర్భాలను చూశాం. తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకొంది. స్వయంగా అగ్రరాజ్యాధిపతి జో బైడెన్‌ (Biden).. మన ప్రధానిని ఆటోగ్రాఫ్‌ అడిగారట!

ప్రస్తుతం జీ7 శిఖరాగ్ర (G7 Summit) సమావేశాల్లో పాల్గొనేందుకు మోదీ హిరోషిమా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా అక్కడికొచ్చిన వివిధ దేశాధినేతలతో ఆయన కాసేపు వ్యక్తిగతంగా మాట్లాడారు. ఈ సందర్భంగా జో బైడెన్‌ (Biden) తాను ఎదుర్కొంటున్న ఓ సవాల్‌ను మోదీ ముందుంచారట! వచ్చే నెల బైడెన్‌ ఆహ్వానం మేరకు మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. అయితే, మోదీతో సమావేశంతో పాటు ఆయన పాల్గొనే కార్యక్రమాల్లో భాగస్వాములయ్యేందుకు అనేక మంది ఆసక్తి చూపుతున్నారని బైడెన్‌ మన ప్రధాని దృష్టికి తీసుకొచ్చారని వారి సంభాషణను విన్న విశ్వసనీయ వర్గాలు మీడియాతో పంచుకున్నాయి. తనకు అనేక వర్గాల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని మోదీ (Modi)కి బైడెన్ తెలియజేశారట. తానెప్పుడూ కలవని.. పరిచయం లేని వారు సైతం ఫోన్లు చేసి మోదీతో కలిసే అవకాశాన్ని కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారని సమాచారం.

ఇంతలోనే అక్కడికొచ్చిన ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ ఆల్బనీస్‌ (Anthony Albanese).. తాను కూడా ఇలాంటి సమస్యే ఎదుర్కొంటున్నానని చెప్పారని తెలిసింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రధాని మోదీ ఓ కార్యక్రమంలో ప్రసంగించనున్నారు. అయితే, ఈ సమావేశంలో పాల్గొనేందుకు తమకు అవకాశం కల్పించాలని అనేక మంది తనకు వ్యక్తిగతంగా సందేశాలు పంపుతున్నారని మోదీతో ఆల్బనీస్‌ అన్నారట. అయితే, మోదీ (Modi) పాల్గొనబోయే వేదిక 20,000 మందికి మాత్రమే ఆతిథ్యం ఇవ్వగలదని.. ఇప్పటికే టికెట్లన్నీ అమ్ముడయ్యాయని చెప్పినట్లు సమాచారం. అయినా, ఇంకా టికెట్ల కోసం విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయని తెలిపారని వారి సంభాషణను విన్నవారు తెలిపారు.

ఇంతలోనే మళ్లీ బైడెన్‌ (Biden) కలగజేసుకుంటూ.. ‘‘మీరు (మోదీ) నిజంగా నాకు చాలా పెద్ద సమస్యను సృష్టించారు’’ అని సరదాగా వ్యాఖ్యానించారట! ‘‘నేను ఆటపట్టించడానికి అనడం లేదు. కావాలంటే మా అధికార బృందాన్ని అడగండి’’ అని కూడా బైడెన్ అన్నట్లు ఈ సంభాషణను విన్న వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ‘నేను మీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలి’ అని నవ్వులు చిందిస్తూ మోదీతో బైడెన్ అన్నారట!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని