Vessel Hijack: హైజాక్‌ చేయడం...డబ్బు గుంజుకోవడం.. ఈ తరహా ఘటనలెన్నో!

 మాల్టా దేశానికి చెందిన వాణిజ్య నౌకను సోమాలియా సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి.

Updated : 16 Dec 2023 20:10 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఐరోపా ద్వీప దేశం మాల్టాకు చెందిన వాణిజ్యనౌకను సోమాలియా పైరేట్లు (Somalia Pirates) హైజాక్‌ చేయడం కలవరం రేపుతోంది. ఎర్రసముద్ర తీరం వైపు వెళ్తున్న నౌకలో కొందరు సముద్రపు దొంగలు చొరబడి దానిని హైజాక్‌ చేశారు. దానిని రక్షించేందుకు ఇండియన్‌ నేవీ (Indian Navy) ఓ ఎయిర్‌క్రాఫ్ట్, యుద్ధ నౌకను రంగంలోకి దించింది. ఈ రెండూ హైజాక్‌ గురైన నౌకను నిశితంగా పరిశీలిస్తూ దానిని అనుసరిస్తున్నాయి. సోమాలియా పైరేట్లు వాణిజ్య నౌకల్ని హైజాక్‌ చేయడం.. ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈ తరహా ఘటనలు చోటు చేసుకున్నాయి. నౌకల్ని అపహరించడం.. దాని యజమానుల నుంచి డబ్బు గుంజుకోవడం సోమాలియా పైరేట్లకు రివాజుగా మారిపోయింది.  

  • 2018 ఫిబ్రవరిలో సింగపూర్‌ దేశానికి చెందిన ఎమ్‌టీ లెపార్డ్‌ అనే వాణిజ్య నౌక సోమాలియా తీరానికి 300 నాటికల్‌ మైళ్ల దూరంలో ఉందనగా.. సముద్రపు దొంగలు రెండు మరపడవల్లో వచ్చి కాల్పులకు తెగబడ్డారు. నౌక భద్రత సిబ్బంది ఎదురుకాల్పులు జరపడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు.
  • తువాలు-జపాన్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఓఎస్‌ 35 అనే వాణిజ్య నౌక  పోర్ట్‌ కెలాంగ్‌ నుంచి ఏడెన్‌ వెళ్తుండగా 2017  ఏప్రిల్‌ 10న ముగ్గురు సముద్రపు దొంగలు దానిని హైజాక్‌ చేశారు. సమాచారం అందుకున్న భారత్‌, చైనా నేవీ బృందాలు సంయుక్త ఆపరేషన్‌ చేపట్టి.. షిప్‌ను, సిబ్బందిని రక్షించాయి.
  • కొమోరోస్‌, యూఏఈ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఆరిస్‌ 13 వాణిజ్య నౌక 2017 మార్చి 13న సోమాలియా తీరంలో హైజాక్‌కు గురైంది. జిబౌటీ నుంచి ముడి చమురును తీసుకెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అక్కడికి 3 రోజుల తర్వాత మార్చి 16న సోమాలియా భద్రతాదళ సిబ్బంది కాల్పులకు దిగారు. దీంతో చర్చలకు వచ్చిన సముద్రపు దొంగలు అందులోని సిబ్బందికి ఎలాంటి హాని తలపెట్టకుండా విడుదల చేశారు. సోమాలియా వ్యాపారవేత్తలే ఆరిస్‌ 13ని రప్పించారని తెలుసుకున్న తర్వాత ఎలాంటి డిమాండ్లు చేయలేదు.
  • వాణిజ్య నౌకకు ఇంధనం సమకూర్చేందుకు వెళ్తున్న స్పెయిన్‌ నేవీ ట్యాంకర్‌పై జనవరి 12, 2012న సోమాలియా సముద్రపు దొంగలు దాడి చేశారు. ఆ సమయంలో ట్యాంకర్‌లో 148 మంది నావికులు ఉన్నారు. వీరంతా ఎదురుదాడి చేయడంతో ఆరుగురు దొంగలు పట్టుబడ్డారు.  
  • అదే ఏడాది ఫిబ్రవరి 16న దుబాయ్‌లోని ఓ వ్యాపార సంస్థకు చెందిన రోల్‌ఆన్‌-రోల్‌ఆఫ్‌ వాణిజ్య నౌకను సోమాలియా పైరేట్లు హైజాక్‌ చేశారు. 2,50,000 అమెరికా డాలర్లు చెల్లించిన తర్వాతే ఆ నౌకను వదిలిపెట్టారు.
  • గ్రీస్‌ నుంచి ముడిచమురును తీసుకెళ్తున్న ఎమ్‌వీ స్మిర్ని అనే వాణిజ్య నౌకను 11, మే 2012న సముద్రపు దొంగలు హైజాక్‌ చేశారు. సుమారు 10 నెలల తీవ్ర చర్చల అనంతరం 9,50,000 యూఎస్‌ డాలర్లు చెల్లించిన తర్వాతే దానిని విడిచి పెట్టారు.
  • ఒమన్‌ తీరంలో ముడిచమురుతో వెళ్తున్న గ్రీస్‌ దేశానికి చెందిన ఎమ్‌వీ ఇర్నెసెల్‌ నౌక 2011, ఫిబ్రవరి 9న హైజాక్‌కు గురైంది. దాదాపు నెల రోజుల చర్చల అనంతరం 13,50,000 అమెరికా డాలర్లు చెల్లించి నౌకను వెనక్కి తెప్పించుకోవాల్సి వచ్చింది.
  • దాదాపు 20,989 టన్నుల చమురుతో మలేసియా నుంచి కెన్యా వెళ్తున్న ఎమ్‌టీ జెమినీ అనే నౌకను 2011, ఏప్రిల్‌ 30న సోమాలియా దొంగలు అపహరించారు. అందులో 24 మంది సిబ్బంది ఉన్నారు. చర్చల అనంతరం 10 లక్షల అమెరికా డాలర్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. తొలుత 4 లక్షల డాలర్లు చెల్లించగా.. 21 మంది సిబ్బందిని విడుదల చేసిన పైరేట్లు.. మిగతా 6 లక్షల డాలర్లు చెల్లించిన తర్వాతే నౌకను, ఇతర సిబ్బందిని విడుదల చేశారు.
  • సోమాలియా తీరంలో ఈ తరహా ఘటనలు తరచూ చోటు చేసుకుంటూనే ఉంటాయి. వివిధ ప్రాంతాల్లో ఏడాదికి కనీసం 10- 20 నౌకలు దాడికి గురవుతున్నట్లు రికార్డులు చెబుతున్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని