Pakistan: భారత్‌తో రహస్య చర్చలు జరపడం లేదు : పాకిస్థాన్‌

భారత్‌తో బ్యాక్‌ఛానల్‌ చర్చలు జరపడం లేదని పాకిస్థాన్‌ (Pakistan) వెల్లడించింది. ఎస్‌సీఓ (SCO) సదస్సు కోసం పాకిస్థాన్‌కు భారత్‌ ఆహ్వానం పంపిన నేపథ్యంలో అక్కడి చట్టసభ సభ్యులకు ఈ విధంగా వివరణ ఇచ్చింది.

Published : 26 Jan 2023 22:05 IST

ఇస్లామాబాద్‌: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌ (Pakistan).. భారత్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధమేననే సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన భారత్‌.. ఒక పొరుగు దేశంతో ఉండే సంబంధాలనే పాకిస్థాన్‌తోనూ కోరుకుంటున్నామని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌తో రహస్య చర్చలు (Backchannel Talks) జరపడం లేదని, అక్కడి సెనేట్‌లో విదేశాంగ సహాయ మంత్రి హినా రబ్బానీ ఖర్‌ వెల్లడించారు. బ్యాక్‌ ఛానల్‌ దౌత్యం అనేది ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే అవసరమని.. ప్రస్తుతం భారత్‌తో అటువంటి చర్చలేమీ జరగడం లేదన్నారు.

గోవా వేదికగా త్వరలో జరగబోయే షాంఘై సహకార సంస్థ- ఎస్‌సీఓ (SCO) సదస్సులో పాల్గొనేందుకు భారత్‌ నుంచి తమకు ఆహ్వానం అందినట్లు పాకిస్థాన్‌ వెల్లడించింది. ప్రస్తుతం దానిని సమీక్షిస్తున్నామని.. ఆ సదస్సులో పాల్గొనే విషయంపై సంప్రదింపుల తర్వాత నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీపై బీబీసీ విడుదల చేసిన డాక్యుమెంటరీపైనా స్పందించిన పాకిస్థాన్‌ విదేశాంగ అధికార ప్రతినిధి ముంతాజ్‌ జారా బలోచ్‌.. పాకిస్థాన్‌ గతంలో చెప్పిన విషయాన్నే ఇప్పుడు బీబీసీ ప్రపంచానికి చూపించిందన్నారు. చరిత్ర నుంచి పాకిస్థాన్‌ పాఠాలు నేర్చుకుందని.. కానీ, ఈ ప్రాంతంలోని కొన్ని దేశాలు మాత్రం ఇంకా నేర్చుకోలేదంటూ భారత్‌పై పరోక్షంగా తన అక్కసు వెళ్లగక్కారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని