Sri Lanka Crisis: పెట్రోల్‌ కొనేందుకు డబ్బు లేదు.. బంక్‌ల వద్దకు రాకండి..!

ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసరాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. పెట్రోల్‌ నిల్వలు నిండుకున్నాయని, ఇంధనాన్ని దిగుమతి చేసుకుందామంటే విదేశీ కరెన్సీ కూడా లేదని శ్రీలంక

Published : 19 May 2022 02:22 IST

దేశ ప్రజలకు శ్రీలంక అభ్యర్థన

కొలంబో: ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసరాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. పెట్రోల్‌ నిల్వలు నిండుకున్నాయని, ఇంధనాన్ని దిగుమతి చేసుకుందామంటే విదేశీ కరెన్సీ కూడా లేదని శ్రీలంక ప్రభుత్వం బుధవారం తెలిపింది. అందువల్ల ప్రజలెవరూ పెట్రోల్‌ బంకుల వద్ద బారులు తీరొద్దని అభ్యర్థించింది. అయితే ప్రస్తుతానికి డీజిల్‌ నిల్వలు మాత్రం సరిపడా ఉన్నాయని పేర్కొంది.

దాదాపు గత రెండు నెలలుగా శ్రీలంక తీరంలో పెట్రోల్‌ నౌకలు నిలిచి ఉన్నాయని, అయితే వాటికి చెల్లింపులు చేసి ఇంధనాన్ని దించుకునేందుకు అమెరికా డాలర్లు లేవని ప్రభుత్వం చెబుతోంది. అంతకుముందు పంపించిన దిగుమతుల బకాయిలు కూడా చెల్లించాల్సి ఉందని పేర్కొంది. అవన్నీ కట్టేంతవరకు పెట్రోల్‌ను దిగుమతి చేయబోమని షిప్పింగ్‌ కంపెనీ స్పష్టంగా చెప్పిందట. అందువల్ల ప్రజలెవరూ పెట్రోల్‌ కోసం క్యూలైన్లలో నిల్చోవద్దని శ్రీలంక విద్యుత్‌, ఎనర్జీ మంత్రిత్వ శాఖ కోరింది.

ప్రపంచ బ్యాంక్‌ 160మిలియన్‌ డాలర్ల సాయం..

మరోవైపు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకను ఆదుకునేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చింది. దేశానికి 160 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సహకారం అందించినట్లు శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే బుధవారం వెల్లడించారు. ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ నుంచి కూడా నిధులు రానున్నట్లు తెలిపారు. అయితే ఈ నిధులను ఇంధన కొనుగోళ్లకు వినియోగించే అవకాశం లేదని ఆయన చెప్పారు. మరోవైపు శ్రీలంకకు అండగా ఉండేందుకు భారత్‌ క్రెడిట్ లైన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. దీని కింద మరో రెండు పెట్రోల్‌ షిప్‌మెంట్లు మే 29 నాటికి వచ్చే అవకాశముందని ప్రధాని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని