Galwan: గల్వాన్‌ ఘర్షణ.. జిన్‌పింగ్ ఘనతగా ప్రదర్శన..!

చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) 20వ జాతీయ మహాసభ వేదికపైకి పార్టీ జనరల్‌ సెక్రటరీ జిన్‌పింగ్‌ రావడానికి కొద్దిసేపటి ముందు.. పదేళ్లలో ఆయన సాధించిన విజయాలను ప్రదర్శించారు.

Updated : 22 Nov 2022 15:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్‌-చైనాలను యుద్ధం అంచువరకూ తీసుకెళ్లి.. లక్షల మంది సైనికులు సరిహద్దుల్లో మోహరించేందుకు కారణమైన గల్వాన్‌ ఘర్షణను షీ జిన్‌పింగ్‌ ఘనతగా సీసీపీ ప్రచారం చేస్తోంది.  చైనా కమ్యూనిస్టు పార్టీ(సీసీపీ) 20వ జాతీయ మహాసభ వేదికపైకి పార్టీ జనరల్‌ సెక్రటరీ జిన్‌పింగ్‌ రావడానికి కొద్దిసేపటి ముందు.. పదేళ్లలో ఆయన సాధించిన విజయాలను ప్రదర్శించారు. ఈ క్రమంలో దేశీయ ప్యాసింజర్ జెట్‌ విమానం, అంతరిక్ష పరిశోధనలతోపాటు.. గల్వాన్‌లో భారత్‌-చైనా దళాల ఘర్షణను కూడా చూపించారు. ఈ చిత్రాల్లో పీఎల్‌ఏ కమాండర్‌ క్వీ ఫాబోవా రెండు చేతులు అడ్డంగా పెట్టి భారత దళాలను ఆపుతున్న దృశ్యాన్ని ప్రదర్శించారు.

గల్వాన్‌ ఘర్షణ తర్వాత నుంచి చైనా ప్రచార విభాగం ఈ చిత్రాన్ని విపరీతంగా అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లింది. సదరు పీఎల్‌ఏ కమాండర్‌ క్వీ ఫాబోవా కూడా ది గ్రేట్‌ హాల్‌ ఆప్‌ పీపుల్స్‌లో జరుగుతున్న సీసీపీ జాతీయ మహాసభకు హాజరయ్యాడు. గల్వాన్‌ చిత్రాన్ని ప్రదర్శించినప్పుడు అతడు గ్రేట్‌ హాల్లోనే ఉన్నాడు. దేశవ్యాప్తంగా సీసీపీ ఎన్నిక చేసిన 2,296 మంది ప్రతినిధుల్లో అతడు కూడా ఒకరు.

బీజింగ్‌ వింటర్ ఒలింపిక్స్‌లో టార్చ్‌బేరర్‌గా క్వీ ఫాబోవాను ఎంపిక చేసింది. అప్పట్లో చైనా తీసుకున్న నిర్ణయంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది.  ఈ క్రమంలో బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ప్రారంభ, ముగింపు వేడుకల్లో చైనాలోని భారత రాయబారి పాల్గొనలేదు. ఈ విశ్వక్రీడల ప్రారంభ, ముగింపు వేడుకలను ‘దూరదర్శన్’ ప్రసారం చేయలేదు. అప్పట్లో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైన ఈ ఎంపికను అమెరికా సైతం తప్పుపట్టింది. ఈ చర్య సిగ్గు చేటు అంటూ విమర్శించింది.

2020 ఏప్రిల్‌లో గల్వాన్‌ వద్ద భారత్‌-చైనా సైన్యాలు ఘర్షణ పడ్డాయి. ఈ ఘటనలో కర్నల్‌ సంతోష్‌బాబు సహా 20 మంది భారత జవాన్లు మరణించారు. చైనా వైపు కేవలం నలుగురు మాత్రమే మరణించినట్లు పీఎల్‌ఏ అధికారికంగా ప్రకటించింది. కానీ, దాదాపు 40 మంది వరకు చైనా సైనికులు మరణించినట్లు రష్యా సహా పలు దేశాల వార్తాసంస్థలు, నిఘా సంస్థలు నివేదికలు ఇచ్చాయి. 1967 తర్వాత భారత్‌-చైనా మధ్య జరిగిన అతిపెద్ద ఘర్షణ ఇదే. ఆ తర్వాత నుంచి పలు విడతల చర్చలు జరిగి ఐదు వివాదాస్పద ప్రదేశాల్లో దళాల ఉపసంహరణకు అంగీకరించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని