RAF: బ్రిటన్‌ నిఘా విమానం సమీపంలోకి దూసుకొచ్చిన రష్యన్‌ క్షిపణి!

ఉక్రెయిన్‌ యుద్ధ సంక్షోభం నడుమ రష్యా మరో వివాదానికి కారణమైంది. తమ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నిఘా విమానానికి సమీపంలో.. రష్యా యుద్ధ విమానం ఓ క్షిపణిని ప్రయోగించినట్లు బ్రిటన్‌ తాజాగా ఆరోపించింది.

Published : 21 Oct 2022 01:20 IST

లండన్‌: ఉక్రెయిన్‌ యుద్ధ సంక్షోభం నడుమ రష్యా(Russia) మరో వివాదానికి కారణమైంది. తమ రాయల్‌ ఎయిర్‌ఫోర్స్‌(RAF)కు చెందిన నిఘా విమానానికి సమీపంలో.. రష్యా యుద్ధ విమానం ఓ క్షిపణిని ప్రయోగించినట్లు బ్రిటన్‌(Britain) తాజాగా ఆరోపించింది. సెప్టెంబరు 29న నల్ల సముద్రం(Black Sea) మీదుగా అంతర్జాతీయ గగనతలంలో గస్తీ విధుల్లో ఉండగా.. ఈ ఘటన జరిగినట్లు బ్రిటన్‌ రక్షణ శాఖ మంత్రి బెన్‌ వాలెస్‌ పార్లమెంట్‌ వేదికగా వెల్లడించారు. అయితే.. సాంకేతిక లోపం కారణంగానే ఈ సమస్య తలెత్తినట్లు రష్యా పేర్కొనడం గమనార్హం.

తమ నిరాయుధ విమానం(ఆర్‌ఏఫ్‌ ఆర్‌సీ- 135 రివెట్‌ జాయింట్‌) విషయంలో జరిగిన ఈ ఘటనను ఉద్దేశపూర్వక చర్యగా పరిగణించడం లేదని వాలెస్‌ తెలిపారు. అయితే.. రష్యా తన యుద్ధ విమానాలను వినియోగించే తీరు ఎంతటి విపత్కర పరిణామాలకు దారితీయగలదో ఇది వెల్లడిస్తుందన్నారు. ఈ విషయమై.. రష్యా రక్షణ శాఖ మంత్రి సెర్గీ షోయిగుతో తమ ఆందోళనను వ్యక్తం చేసినట్లు చెప్పారు.

‘ఈ ఘటనపై తాము విచారణ జరిపినట్లు అక్టోబర్ 10న రష్యా రక్షణ శాఖ మంత్రి బదులిచ్చారు. సుఖోయ్‌- 27ఎస్‌ యుద్ధ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఇలా జరిగినట్లు వివరణ ఇచ్చారు’ అని వాలెస్ తెలిపారు. ఈ ఘటన అంతర్జాతీయ గగనతలంలో జరిగిందని రష్యా సైతం అంగీకరించినట్లు వెల్లడించారు. మరోవైపు.. ఈ ఘటన అనంతరం బ్రిటన్‌ నల్ల సముద్రం మీదుగా తన పెట్రోలింగ్‌ కార్యకలాపాలు నిలిపేసినప్పటికీ.. ప్రస్తుతం ఒక యుద్ధ విమానం ఎస్కార్ట్‌తో మళ్లీ పునరుద్ధరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు