Bomb: రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు కలకలం.. వందలాది నివాసితుల ఖాళీ!

పోలాండ్‌లోని వ్రోక్లా నగరంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి ఓ బాంబు బయటపడింది. దీంతో ముందు జాగ్రత్త చర్యగా వందలాది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

Published : 27 May 2023 00:29 IST

(ప్రతీకాత్మక చిత్రం)

వార్సా: పోలాండ్‌ (Poland)లో రెండో ప్రపంచ యుద్ధం (World War 2) నాటి ఓ భారీ బాంబు బయటపడటం కలకలం రేపింది. పేలకుండా ఉన్న ఈ బాంబును ఇక్కడి వ్రోక్లా (Wroclaw) నగరంలో గుర్తించారు. రైల్వే ఓవర్‌పాస్ సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్న క్రమంలో 250 కిలోల బరువున్న ఓ బాంబు (World War 2 Bomb) లభ్యమైంది. ఇది రెండో ప్రపంచ యుద్ధం నాటి జర్మన్ ఎస్‌సీ-250 ఏరియల్ బాంబు అని పోలాండ్ సాయుధ బలగాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ముందు జాగ్రత్త చర్యగా అక్కడి నివాసితులను ఖాళీ చేయించారు.

మరోవైపు, బాంబు గురించి సమాచారం అందుకున్న నిపుణులు.. దాన్ని నిర్వీర్యం చేసేందుకు రంగంలోకి దిగారు. దాదాపు 2500 మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రమాదం పూర్తిగా తొలగిపోయే వరకు రైళ్ల రాకపోకలను కూడా నిలిపివేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు వ్రోక్లా నగరం జర్మనీలో ఉండేది. అప్పటి సోవియట్ యూనియన్‌ దాడులతో ఇది అతలాకుతలమైంది. యుద్ధంలో జర్మనీ ఓడిపోవడంతో తన భూభాగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. దీంతో ఇది పోలాండ్‌లో భాగమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని