Joe Biden: భారత్‌లో అంటువ్యాధుల నివారణకు అమెరికా సహాయం

భారత్‌లో అంటువ్యాధుల (Epidemics) నివారణకు చేపట్టే పరిశోధనల కోసం అమెరికా ఆర్థిక సహాయం ప్రకటించింది.

Updated : 16 Jun 2022 23:47 IST

వాషింగ్టన్‌: భారత్‌లో అంటువ్యాధుల (Epidemics) నివారణకు చేపట్టే పరిశోధనల కోసం అమెరికా ఆర్థిక సహాయం ప్రకటించింది. ఇందులో భాగంగా మూడు భారతీయ వైద్య పరిశోధనా సంస్థలకు కలిపి మొత్తం 122 మిలియన్‌ డాలర్ల సహాయాన్ని అందించనున్నట్లు వెల్లడించింది. అంటువ్యాధుల కారకాలను ముందస్తుగా గుర్తించడం, వ్యాధుల ముప్పును ముందుగానే అంచనా వేయడంతోపాటు విస్తృత వేగంతో వాటిని ఎదుర్కోనే చర్యలు చేపట్టేందుకుగాను ఈ సహాయం తోడ్పడనుందని తెలపింది.

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రిసెర్చ్‌ (ICMR), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (NIV)తోపాటు నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడమాలజీ (NIE) సంస్థలకు వచ్చే ఐదేళ్లలో ఈ మొత్తం సహాయం అందనుందని అమెరికా అంటువ్యాధుల నియంత్రణ, నివారణ కేందం (CDC) వెల్లడించింది. భవిష్యత్తులో ఉద్భవించే అంటువ్యాధుల ముప్పు నుంచి సురక్షితంగా ఉండేందుకు ఈ నిధులు దోహదపడుతాయని తెలిపింది. వీటిలో ప్రధానంగా ‘వన్‌ హెల్త్‌’ పద్ధతిలో జంతువుల నుంచి మానవులకు సంక్రమించే వ్యాధులను ముందుగానే గుర్తించి నియంత్రించడం, వ్యాక్సిన్‌ భద్రత వ్యవస్థలను పర్యవేక్షించడం, అంటువ్యాధుల విజృంభణ సమయంలో అవసరమైన ప్రజారోగ్య సిబ్బందిని క్షేత్రస్థాయిలో దించడం వంటి చర్యలు అతి ముఖ్యమైనవి పేర్కొంది.

భారత్‌లో బయోమెడికల్‌ రీసెర్చ్‌ విస్తృతంగా చేపడుతోన్న భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనుందని అమెరికా సీడీసీ పేర్కొంది. ఎందుకంటే ఇప్పటికే జీవపరిశోధనలో ఎంతోముందున్న ఐసీఎంఆర్‌.. అంటువ్యాధులపై ఇటీవల విస్తృత పరిశోధనలు కొనసాగిస్తోందని అభిప్రాయపడింది. ఏమైనా వ్యాధికారకాలు గుర్తించినప్పుడు వాటిని నిర్ధారించుకునేందుకు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు పంచుకోవడంతోపాటు.. పరిశోధనా సంస్థలున్న ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతోనూ కలిసి పనిచేయాడాన్ని భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు