Vivek Ramaswamy: నా పాపులారిటీని తట్టుకోలేకపోతున్నారు.. అనుభవం లేదంటున్నారు..!

Vivek Ramaswamy: అమెరికా(USA) అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. తన అభిప్రాయాలను పక్కాగా స్పష్టం చేస్తున్నారు.

Published : 18 Sep 2023 10:33 IST

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వం కోసం పోటీ పడుతున్న రిపబ్లికన్‌ పార్టీ నేత, భారతీయ అమెరికన్‌ వివేక్‌ రామస్వామి(Vivek Ramaswamy).. ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు. తనకు పెరుగుతున్న పాపులారిటీని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అమెరికా(USA) అధ్యక్షుడు అయ్యేంత అనుభవం తనకు లేదని వారు భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.

‘ఇటీవల చర్చా కార్యక్రమంలో నేను మెరుగైన ప్రదర్శన చూపినప్పటి నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. ఇదంతా ఎన్నికల ప్రక్రియలో భాగం. వాస్తవమేంటంటే.. ప్రత్యర్థులు నా ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారు. 38 ఏళ్ల చిన్న వయసు వ్యక్తికి అధ్యక్ష పదవిని నిర్వహించే అనుభవం ఉండదని వారు భావిస్తున్నారు. స్వాతంత్య్రం గురించి యూఎస్‌ డిక్లరేషన్‌ను రాసినప్పుడు థామస్ జెఫర్సన్ వయసు 33 ఏళ్లే. అలాంటి స్ఫూర్తిని తిరిగి తీసుకురావాల్సి ఉంది’ అని వివేక్ అన్నారు. అలాగే మున్ముందు అమెరికాకు మంచి రోజులు ఉన్నాయని విశ్వసిస్తున్నట్లు చెప్పారు.

నేనొస్తే.. హెచ్‌-1బీ లాటరీ విధానాన్ని తొలగిస్తా: వివేక్‌ రామస్వామి

‘ప్రస్తుత పాలనపై విమర్శలు చేయడానికి చాలా అంశాలు ఉన్నాయి. కానీ నా విజన్‌ ఏంటనేది ప్రజలకు తెలియజేయడమే ఇక్కడ ముఖ్యం. ఈ దేశాన్ని ఏకం చేసే అంశాలపై దృష్టిపెట్టే ఏకైక వ్యక్తిని కాబట్టే.. నేను ఈ ఎన్నికల రేసులో ఉన్నాను. నేను ఇక్కడ ఎవరికి వ్యతిరేకంగా ముందుకు వెళ్లడం లేదు. ఈ దేశం కోసం మాత్రమే నేను పోటీలో ఉన్నాను’ అని అన్నారు. అలాగే బహిరంగ చర్చకు తాను సిద్ధమేనంటూ ప్రత్యర్థులకు సవాలు విసిరారు.

ఇదిలాఉంటే, ఇటీవల జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలతో వివేక్‌ రామస్వామి అనేక మంది మద్దతును చూరగొన్నారు. తర్వాత నిర్వహించిన పోల్‌లో 504 మంది స్పందన తెలియజేయగా.. అందులో 28శాతం మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు. ఫ్లోరిడా గవర్నర్‌ డీసాంటిస్‌ (27శాతం), మాజీ ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌(13శాతం), భారత సంతతి వ్యక్తి నిక్కీ హేలీ (7శాతం) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని