Ukraine Crisis: పుతిన్‌ ప్రకటన కంటే 30 నిమిషాల ముందే ఆక్రమణ మొదలు..!

సరిగ్గా నెల రోజుల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. ఆ దేశంపై సైనిక చర్యకు ఆదేశించినట్లు ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రకటించారు

Updated : 24 Mar 2022 11:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: సరిగ్గా నెల రోజుల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని ప్రారంభించింది. ఆ దేశంపై సైనిక చర్యకు ఆదేశించినట్లు ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ప్రకటించారు. అయితే, పుతిన్‌ ప్రకటన కంటే ముందే రష్యా సేనలు ఉక్రెయిన్‌పై దురాక్రమణకు దిగినట్లు తాజాగా అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. పుతిన్‌ సైనిక చర్యను ప్రకటించడం కంటే 30 నిమిషాల ముందే ఓ రష్యన్‌ సైనికుడు తుపాకీతో క్రిమియా సరిహద్దును దాటినట్లు సీసీటీవీ కెమెరాల్లో కన్పించింది. అంటే.. సైనిక చర్య మొదలైన తర్వాత దీనిపై పుతిన్‌ బహిరంగ ప్రకటన చేసినట్లు ఆ కథనాలు పేర్కొంటున్నాయి. 

35 లక్షల మంది వలస..

ఫిబ్రవరి 24న మొదలైన రష్యా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. తొలుత ఉక్రెయిన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నామని ప్రకటించిన క్రెమ్లిన్‌.. ఆ తర్వాత పౌర నివాసాలపైనా విరుచుకుపడుతోంది. పెద్ద పెద్ద నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. తొలి నాళ్లలో రాజధాని కీవ్‌పై పట్టు సాధించాలని రష్యా సేనలు భీకరంగా ప్రయత్నించాయి. అది కుదరకపోవడంతో ఇప్పుడు మేరియుపోల్‌పై దృష్టిపెట్టాయి. ఆ నగరంలో దాదాపు 90శాతం భవనాలను ధ్వంసం చేశాయి. దీంతో ప్రజలు ప్రాణ భయంతో దేశం విడిచి పారిపోతున్నారు. ఇప్పటి వరకు 35లక్షలకు పైగా ఉక్రెయిన్‌ వాసులు పొరుగు దేశాలకు శరణార్థులుగా వలస వెళ్లినట్లు ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. వీరిలో అత్యధికంగా పోలండ్‌కు వెళ్లినవారే. ఉక్రెయిన్‌ నుంచి 20లక్షల మందికి పైగా పోలండ్ ఆశ్రయం పొందారు.

15వేల మంది రష్యా సైనికులు హతం..

మరోవైపు రష్యా దాడులను ఉక్రెయిన్‌ కూడా గట్టిగా ప్రతిఘటిస్తోంది. ఈ క్రమంలోనే వేలాది మంది రష్య సైనికులను చంపేసినట్లు అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ఈ యుద్ధంలో 7 వేల నుంచి 15 వేల మంది రష్యన్‌ సైనికులు మరణించి ఉండొచ్చని నాటో అంచనా వేస్తోంది. అయితే, క్రెమ్లిన్‌ మాత్రం ఈ మరణాలపై ప్రకటన చేయకపోవడం గమనార్హం. 

వీధుల్లోకి రండి..

తమ దేశంపై రష్యా దురాక్రమణ ఆపేలా ఒత్తిడి తీసుకురావాలంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంతర్జాతీయ సమాజాన్ని కోరుతున్నారు. తాజాగా మరోసారి ప్రసంగించిన ఆయన.. రష్యాకు వ్యతిరేకంగా యావత్ ప్రజలు తమ దేశాల్లో వీధుల్లోకి వచ్చి నిరసనలు చేపట్టాలని అభ్యర్థించారు. ‘‘నెల రోజులు గడిచిపోయింది. ఈ యుద్ధం నాతో పాటు ప్రతి ఒక్కరి హృదయాల్ని కలచివేస్తోంది. అందుకే, ఈ యుద్ధానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలవాలని యావత్‌ ప్రపంచాన్ని కోరుతున్నా. రష్యాను అడ్డుకోవాలని అభ్యర్థిస్తున్నా’’ అని జెలెన్‌స్కీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని