Israel: హమాస్‌కు భారీ ఎదురుదెబ్బ.. ఇజ్రాయెల్‌ దాడిలో టాప్‌ కమాండర్‌ హతం

హమాస్‌ లక్ష్యంగా భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్ కీలక పురోగతి సాధించింది. హమాస్‌ నంబర్‌ 3 కమాండర్‌ మార్వాన్‌ ఇస్సా హతమైనట్లు అమెరికా ప్రకటించింది. 

Updated : 19 Mar 2024 09:41 IST

వాషింగ్టన్‌: హమాస్‌ (Hamas) అంతమే లక్ష్యంగా తీవ్ర దాడులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌ సైన్యం (Israel Military) కీలక పురోగతి సాధించింది. గతవారం జరిపిన దాడుల్లో హమాస్‌ నంబర్‌ 3 కమాండర్‌ మార్వాన్‌ ఇస్సా హతమయ్యాడు. ఈ విషయాన్ని అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ (America National Security Adviser) జేక్‌ సలివన్‌ (Jake Sullivan) ప్రకటించారు. హమాస్‌ మిలిటరీ డిప్యూటీ కమాండర్‌ అయిన ఇస్సా సెంట్రల్‌ గాజాలో జరిపిన ఇజ్రాయెల్‌ జరిపిన ఎయిర్‌స్ట్రైక్‌లో మరణించినట్లు అమెరికా పేర్కొంది. 

‘‘హమాస్‌పై పోరులో ఇజ్రాయెల్‌ కీలక పురోగతి సాధించింది. మిలిటెంట్ల కీలక బెటాలియన్లను విచ్ఛిన్నం చేయడమే కాకుండా టాప్‌ కమాండర్లతో సహా వేలమంది ఫైటర్లను ఇజ్రాయెల్‌ హతమార్చింది. గతవారం ఐడీఎఫ్‌ దాడుల్లో హమాస్‌ గ్రూప్‌ మూడో ర్యాంక్‌ కమాండర్‌ మార్వాన్‌ ఇస్సా హతమయ్యాడు. మిగతా టాప్‌ కమాండర్లు టన్నెల్స్‌లో దాక్కున్నారు’’ అని జేక్‌ పేర్కొన్నారు. 

గత 5 నెలలుగా కొనసాగుతున్న దాడుల్లో హమాస్‌ టాప్‌ కమాండర్‌ మృతి చెందడం ఇజ్రాయెల్‌ అతిపెద్ద విజయంగా భావిస్తున్నారు. హమాస్‌ మిలిటరీ అధిపతి మహమ్మద్‌ దీఫ్‌ డిప్యూటీగా ఇస్సాను పేర్కొంటారు. మిలిటరీ  కార్యకలాపాల్లో ఇస్సా చాలా చురుకుగా ఉండేవాడని, అక్టోబర్‌ 7 నాటి మారణకాండలో కీలకపాత్ర పోషించాడని ఇజ్రాయెల్‌ భావిస్తోంది. 

సెంట్రల్‌ గాజాలోని ఒక భూగర్భ సొరంగంలో దాక్కున్న ఇస్సా లక్ష్యంగా మార్చి 11న ఎయిర్‌ స్ట్రైక్‌ చేసినట్లు ఇజ్రాయెల్‌ దళాలు పేర్కొన్నాయి. అయితే ఈ దాడుల్లో మృతిచెందింది ఇస్సానా? కాదా? అనే వివరాలు తెలియాల్సి ఉందని ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి రేర్‌ అడ్మిరల్‌ డానియేల్‌ హగరీ పేర్కొన్నారు. ఈదాడికి సంబంధించి ఇంకా పరిశోధిస్తున్నట్లు, పూర్తి వివరాలు త్వరలోనే తెలుస్తాయన్నారు. కాగా, అతడు మృతి చెందినట్లు అమెరికా ప్రకటించడం గమనార్హం.  

గాజాలో కాల్పుల విరమణ, మానవతా సాయం విషయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు (Benjamin netanyahu) వైఖరి కారణంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ (Joe Biden) ఎడముఖం పెడముఖంగా ఉన్న విషయం తెలిసిందే. దాదాపు నెల తర్వాత సోమవారం ఇరువురు నేతలు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. రఫాలో శరణార్థుల విషయమై మాట్లాడినట్లు తెలుస్తోంది. రోజురోజుకు గాజాలో ఉద్రిక్తలు పెరుగుతున్న నేపథ్యంలో రఫాలో యుద్ధ ప్రణాళికల కోసం సీనియర్‌ అధికారుల బృందాన్ని అమెరికాకు పంపించడానికి నెతన్యాహు అంగీకరించినట్లు జేక్‌ సలివన్‌ తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని