WHO: మహమ్మారి మధ్యలోనే ఉన్నాం.. ముప్పు తొలగిపోలేదు!

ఒమిక్రాన్‌ కొత్త వేరియంట్ల తీవ్రతపై పర్యవేక్షిస్తోన్న డబ్ల్యూహెచ్ఓ.. ఇప్పటివరకు ఉన్న ఒమిక్రాన్‌ ఉపరకాల కంటే ఇవి భిన్నంగా ఏమీ లేవని తెలిపింది.

Published : 15 Apr 2022 01:26 IST

కొత్త వేరియంట్ల తీవ్రత ప్రస్తుతానికి తక్కువేనన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

వాషింగ్టన్‌: ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోన్న వేళ కొత్త వేరియంట్లు కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల వెలుగు చూసిన ఒమిక్రాన్‌లో రెండు సబ్‌ వేరియంట్ల (BA.4, BA.5)పై ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) దృష్టి సారించింది. కొత్త వేరియంట్ల తీవ్రతపై పర్యవేక్షిస్తోన్న డబ్ల్యూహెచ్ఓ.. ఇప్పటివరకు ఉన్న ఒమిక్రాన్‌ ఉపరకాల కంటే ఇవి భిన్నంగా ఏమీ లేవని తెలిపింది. అయినప్పటికీ.. ఈ వేరియంట్‌లు కచ్చితంగా మార్పు చెందుతాయని స్పష్టం చేసింది. ఇక కరోనా ముప్పు పూర్తిగా తొలగిపోలేదన్న డబ్ల్యూహెచ్‌ఓ.. మహమ్మారి మధ్యలోనే ఉన్నామంటూ అప్రమత్తం చేసింది.

‘ఒమిక్రాన్‌కు సంబంధించి రెండు ఉపరకాలను ఇప్పటికే గుర్తించాం. మునుపటి రకాలతో పోలిస్తే తీవ్రతలో ఎటువంటి మార్పులను గుర్తించలేదు. కానీ, ఇది మార్పు చెందే అవకాశం ఉంది. అందుకే ఈ వేరియంట్‌ వాస్తవ పరిస్థితులపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నిపుణులతో కలిసి పనిచేస్తున్నాం’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మారియా వాన్‌ కెర్ఖోవ్‌ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ విజృంభణ తక్కువగానే ఉన్నప్పటికీ ఇది ప్రజారోగ్య ముప్పుగానే కొనసాగిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ ఎమర్జెన్సీ కమిటీ పేర్కొన్న తరుణంలో కొత్త వేరియంట్లపైనా మరోసారి అప్రమత్తం చేసింది.

ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నప్పటికీ ఒమిక్రాన్‌ బీఏ.2 ఉపరకం కారణంగా పలు ప్రాంతాల్లో వైరస్‌ ఉద్ధృతి మళ్లీ పెరుగుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ వారాంతపు నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో మనం మహమ్మారి ముగింపు దశకు చేరుకోలేదని.. ఇంకా మధ్యలోనే ఉన్నామని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్‌ స్వల్పంగా ఉన్న దేశాలకు మరింత ముప్పు పొంచివుందని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో ఒమిక్రాన్‌ నుంచి బీఏ.4, బీఏ.5 అనే రెండు ఉపరకాలు గుర్తించినట్లు దక్షిణాఫ్రికా వెల్లడించింది. ఈ రకం కేసులు ఇప్పటికే బోట్స్‌వానా, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్‌తోపాటు బ్రిటన్‌లో వెలుగు చూసినట్లు డబ్ల్యూహెచ్‌ఓ కూడా ప్రకటించింది. గడిచిన 30 రోజుల్లో పరీక్షించిన నమూనాలను చూస్తే 99.2శాతం ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రాబల్యం ఉండగా.. కేవలం 0.1శాతం కంటే తక్కువ మాత్రమే డెల్టా ప్రభావం ఉన్నట్లు వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని