Monkeypox: మంకీపాక్స్‌ మరో కొవిడ్‌ కానుందా!.. నిపుణులు ఏమంటున్నారంటే..?

మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. పలు దేశాల్లో ఈ కేసులు బయటపడుతుండటంతో......

Published : 25 May 2022 01:56 IST

వాషింగ్టన్‌: రెండున్నరేళ్ల నుంచి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది కరోనా వైరస్‌. ఉత్తర కొరియాతోపాటు పలు దేశాల్లో ఇంకా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మంకీపాక్స్‌ వైరస్‌ ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తోంది. పలు దేశాల్లో ఈ కేసులు బయటపడుతుండటంతో.. మంకీపాక్స్‌ మరో కరోనా వైరస్‌లా వ్యాపించనుందా? భారీ స్థాయిలో మరణాలు నమోదు కానున్నాయా? అనే భయాందోళనలు రేకెత్తుతున్నాయి. ఈనేపథ్యంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా.ఫహీమ్‌ వివరణ ఇచ్చారు. కరోనా తరహాలో మంకీపాక్స్‌ వ్యాపించే అవకాశమే లేదని స్పష్టం చేశారు.

మంకీపాక్స్‌ కేసులు ఆందోళన కలిగిస్తున్న విషయం వాస్తవమేనని, కానీ ఇది కరోనా వైరస్‌లా మారే అవకాశం సున్నా శాతం అని వెల్లడించారు. ‘మంకీపాక్స్‌ అనేది కొవిడ్‌ తరహాలో కొత్తగా పుట్టుకొచ్చిన వైరస్‌ కాదు. దాని గురించి ప్రపంచానికి దశాబ్దాల కాలంగా తెలుసు. అంత ప్రమాదకారి కాదు. మశూచి మాదిరి మంకీపాక్స్‌ కూడా ఆ కుటుంబానికి చెందినదే’ అని పేర్కొన్నారు. కరోనాకు ఎన్నో రోజులపాటు టీకా లేదు అని, కానీ దీనికి ఎప్పటి నుంచో వ్యాక్సిన్‌ ఉందని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలోనే ఓ ట్వీట్‌ చేస్తూ.. ‘మంకీపాక్స్‌ గాలి ద్వారా వ్యాపించదు. కొవిడ్‌ తరహాలో ప్రమాదకారి కాదు. కరోనాతో పోలిస్తే వ్యాప్తి తక్కువ. మశూచి టీకాతో మంకీపాక్స్‌ను నయం చేయవచ్చు. ఆందోళన వద్దు’ అని పేర్కొన్నారు.

జపాన్‌లో జరుగుతున్న క్వాడ్‌ సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌  మాట్లాడుతూ.. కరోనా తరహాలో మంకీపాక్స్‌ వ్యాపించబోదని స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 100 కేసులు నమోదయ్యాయని, పశ్చిమ ఆఫ్రికాలో మొదలై తాజాగా అమెరికా, బ్రిటన్‌లోనూ కేసులు వెలుగుచూసినట్లు తెలిపారు. కాగా మశూచి టీకాతో మంకీపాక్స్‌ను అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. తమ దేశంలో ఈ వైరస్‌ను అరికట్టేందుకు సరిపడా వ్యాక్సిన్‌ నిల్వలు కూడా ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని