Red Cross: తదుపరి మహమ్మారికి సంసిద్ధత లేమి.. రెడ్‌క్రాస్‌ హెచ్చరిక!

తదుపరి మహమ్మారిని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు ఇప్పటికీ సిద్ధంగా లేవని రెడ్‌క్రాస్‌ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా ఒక మేల్కొలుపు కావాలని పేర్కొంది.

Published : 31 Jan 2023 01:17 IST

జెనీవా: తదుపరి మహమ్మారి(Next Pandemic)ని ఎదుర్కొనే విషయంలో ప్రపంచ దేశాలు ఇప్పటికీ సిద్ధంగా లేవని రెడ్‌క్రాస్(Red Cross) సంస్థ సోమవారం హెచ్చరించింది. భవిష్యత్తులో ఏకకాలంలో ఆరోగ్య సంక్షోభాలు, వాతావరణ విపత్తులు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. కరోనా కారణంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నప్పటికీ.. అన్ని దేశాల్లోనూ బలమైన సంసిద్ధత వ్యవస్థలు లోపించాయని ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ రెడ్‌క్రాస్(IFRC) ఆందోళన వ్యక్తం చేసింది. కరోనా(Covid 19)ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రజారోగ్య అత్యవసర స్థితిగా ప్రకటించి మూడేళ్లయిన సందర్భంగా.. కొవిడ్‌ స్థాయిలో భవిష్యత్తులో సంభవించే విషాదాలను తగ్గించడంపై సిఫార్సులు చేస్తూ రెడ్‌క్రాస్‌ రెండు నివేదికలు విడుదల చేసింది.

‘తదుపరి ఆరోగ్య సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొనేలా ఇప్పుడే సిద్ధమయ్యేందుకు.. కరోనా మహమ్మారి ఒక మేల్కొలుపు కావాలి’ అని ఐఎఫ్‌ఆర్‌సీ సెక్రటరీ జనరల్ జగన్ చాపాగైన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో విశ్వాస పెంపుదల, సమానత్వ చర్యలు, స్థానిక ఆరోగ్య నెట్‌వర్క్‌లను నిర్మించడం చాలా ముఖ్యమని ఐఎఫ్ఆర్‌సీ తెలిపింది. ఆరోగ్య, సామాజిక, ఆర్థికపరమైన లోపాలను పరిష్కరించాలని సిఫార్సు చేసింది. ప్రపంచ దేశాలు 2025 నాటికి.. దేశీయ ఆరోగ్య రంగానికి కేటాయింపులను స్థూల దేశీయోత్పత్తిలో ఒక శాతానికి పెంచాలని, గ్లోబల్ హెల్త్ ఫైనాన్స్‌ను ఏడాదికి కనీసం 15 బిలియన్‌ డాలర్లు పెంచాలని సూచించింది. కేవలం ఒకటి మాత్రమే కాకుండా వివిధ రకాల విపత్తులను ఏకకాలంలో ఎదుర్కొనేందుకు దేశాలు సంసిద్ధంగా ఉండాలని తెలిపింది.

కొనసాగుతోన్న కొవిడ్‌ ‘ప్రజారోగ్య అత్యవసర స్థితి’

ఇదిలా ఉండగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్‌ను ‘ప్రజారోగ్య అత్యవసర స్థితి’గా  ప్రకటించి తాజాగా మూడేళ్లవుతోంది. ఇప్పటికీ అదే హెచ్చరికను కొనసాగిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌వో సోమవారం వెల్లడించింది. డబ్ల్యూహెచ్‌వో అధికారిక వివరాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా 75.2 కోట్లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 68 లక్షలకుపైగా మరణాలు సంభవించాయి. అయితే, వాస్తవానికి ఈ సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఈ సంస్థ పలు సందర్భాల్లో తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని