Updated : 14 Mar 2022 14:39 IST

ZeroCovid: చైనా జీరో-కొవిడ్‌ వ్యూహం విఫలమేనా?.. లాక్‌డౌన్‌లోకి ప్రధాన నగరాలు

చైనా వ్యాప్తంగా పెరుగుతోన్న కొవిడ్‌ ఉద్ధృతి

బీజింగ్‌: యావత్‌ ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌ మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు కట్టడి వ్యూహాలు, వ్యాక్సిన్‌ పంపిణీతో ప్రపంచ దేశాలు తీవ్ర కృషి చేస్తూనే ఉన్నాయి. మరోవైపు భవిష్యత్తులో మరోసారి విజృంభిస్తే, వాటిని తట్టుకునేందుకు వైరస్‌తో కలిసి జీవించే విధానాన్ని కూడా అలవాటు చేసుకుంటున్నాయి. కానీ, కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా భావిస్తోన్న చైనా మాత్రం.. జీరో కొవిడ్‌ వ్యూహాన్నే కొనసాగిస్తోంది. ఈ క్రమంలో వైరస్‌ను కట్టడి చేయలేక నానా కష్టాలు పడుతున్నట్లు తెలుస్తోంది. చివరకు జీరో కొవిడ్‌ వ్యూహం విఫలం అవుతుండడంతో లక్షల జనాభా కలిగిన ప్రధాన నగరాలను సైతం లాక్‌డౌన్‌ ఆంక్షలతో బంధిస్తోంది.

రికార్డు స్థాయిలో కేసులు..

గతకొద్ది రోజులుగా చైనా ప్రధాన నగరాల్లో కొవిడ్‌ పాజిటివ్‌ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. ఆదివారం నాడు 3400 కేసులు నమోదుకాగా, సోమవారం కొత్తగా మరో 2300 కేసులు బయటపడ్డాయి. గడిచిన రెండేళ్లలో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ముఖ్యంగా వైరస్‌ విస్తృతి అధికంగా ఉన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు బయట పడుతుండడంతో అప్రమత్తమైన చైనా.. పెద్ద నగరాల్లోనూ పూర్తి లాక్‌డౌన్‌ ఆంక్షలు విధిస్తోంది. తాజాగా కోటి 70 లక్షల మంది జనాభా కలిగిన చైనా టెక్‌హబ్‌గా పేరొందిన షేన్‌జేన్‌ నగరంలో నేటి నుంచి లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. మరోవైపు షాంఘైవంటి అతిపెద్ద నగరాలతోపాటు పలు ప్రావిన్సుల్లోని నగరాల్లో స్థానికంగా లాక్‌డౌన్‌ ఆంక్షలను అమలు చేస్తున్నారు.

ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు..

కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా చైనాలోనే అతిపెద్ద నగరమైన షాంఘైలో పూర్తి లాక్‌డౌన్‌ విధించనప్పటికీ పాఠశాలు, కార్యాలయాలు, నివాస సముదాయాలనూ అక్కడి అధికారులు మూసివేశారు. జిలిన్‌ ప్రావిన్సులో మార్చి నెలలోనే దాదాపు ఐదు నగరాల్లో లాక్‌డౌన్‌ విధించారు. 90లక్షల మంది జనాభా ఉన్న చాంగ్‌చున్‌లో మూడు రోజుల క్రితం నుంచే లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఉత్తర కొరియా సరిహద్దు నగరమైన యాంజిని పూర్తిగా దిగ్బంధంలో ఉంచారు. ఏడు లక్షల జనాభా ఉన్న ఈ నగరంలో ఇప్పటికే ఆరు రౌండ్ల నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇలా కొవిడ్‌ తీవ్రత ఉన్న ప్రాంతాల్లో జిల్లా స్థాయిలోనూ స్థానికంగా కట్టడి చర్యలు తీసుకుంటున్నారు.

వాణిజ్య కేంద్రాలపైనా ప్రభావం..

కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు అమలు చేస్తోన్న చైనా అధికారులు.. ప్రజలను ఇళ్లలోనే ఉండాలని ఆదేశాలిస్తున్నారు. ఇలా చైనా అనుసరిస్తోన్న జీరో కొవిడ్‌ వ్యూహం తమకు తీవ్ర భారంగా మారుతున్నట్లు అక్కడి సామాన్య ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వాణిజ్య, ఉత్పత్తి కేంద్రాలపైనా లాక్‌డౌన్‌ ఆంక్షలు తీవ్ర ప్రభావం చూపెడుతున్నట్లు తెలుస్తోంది. సోమవారం ఉదయం హాంకాంగ్‌ స్టాక్‌ ఎక్ఛేంజీ ప్రారంభ సమయంలోనే స్టాక్స్‌ అన్నీ పతనమయ్యాయి. షేన్‌జేన్‌ నగరంలో లాక్‌డౌన్‌ కారణంగా ఐఫోన్‌ తయారీకి కీలక కేంద్రం కూడా కార్యకలాపాలు నిలిపివేసింది. మరోవైపు ఫాక్స్‌కాన్‌, హువావే, టెన్‌సెంట్‌ వంటి దిగ్గజ టెక్‌ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఆందోళనలు మొదలయ్యాయి.

జీరో-కొవిడ్‌ వ్యూహం విఫలమైనా..?

కొవిడ్‌-19కు కారణమైన వైరస్‌ తొలిసారి బయటపడినప్పటి నుంచి కట్టడి చర్యలను చైనా సమర్థవంతంగానే చేపడుతోంది. ఒకటి, రెండు కేసులు బయటపడినా.. భారీస్థాయిలో కొవిడ్‌ పరీక్షలు, స్థానికంగా లాక్‌డౌన్‌, ప్రయాణాలపై ఆంక్షలను అమలు చేస్తోంది. ఇలా కొవిడ్‌ కేసులను సున్నాకు తీసుకువచ్చే (జీరో కొవిడ్‌) వ్యూహాన్ని అమలు చేస్తున్నప్పటికీ వైరస్‌ ఉద్ధృతి అన్ని నగరాలకు విస్తరిస్తూనే ఉంది. అయితే, ఒమిక్రాన్‌ ప్రమాదం తక్కువగా ఉన్పప్పటికీ.. వైరస్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జీరో-కొవిడ్‌ వ్యూహాన్ని సడలించడం కష్టమేనని చైనాలో ప్రముఖ వైద్య నిపుణుడు జాంగ్‌ వెన్‌హాంగ్‌ పేర్కొన్నారు. అయితే, దీనర్థం భారీస్థాయిలో పరీక్షలు, లాక్‌డౌన్‌ వంటి వ్యూహాలను శాశ్వతంగా అమలు చేయడం కాదని అభిప్రాయపడ్డారు.

Read latest World News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని