కరుణ చూపరా!
close
Updated : 30/07/2021 05:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరుణ చూపరా!

సాయం కోసం ఏళ్లుగా నిరుద్యోగ యువత ఎదురుచూపు
సంక్షేమ కార్పొరేషన్ల పరిధిలో 9.5 లక్షల దరఖాస్తులు పెండింగ్‌  
నాలుగేళ్లుగా 5 లక్షల మంది  బీసీల నిరీక్షణ

ఈనాడు - హైదరాబాద్‌

ఏదైనా సొంత వ్యాపారంతో బతుకుబండి లాగాలని కొందరు.. కనీసం రూ. 50 వేలు మంజూరైతే చిన్నపాటి దుకాణంతో జీవనోపాధి పొందాలని ఇంకొందరు.. ఆటో, కారు నడిపి కుటుంబాన్ని పోషించాలని మరికొందరు.. ఇలా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన 9.5 లక్షలమందికి పైగా నిరుద్యోగ యువత ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూస్తోంది. సొంతకాళ్లపై నిలబడాలని రుణాలకు దరఖాస్తు చేసుకుంటే.. ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేని పరిస్థితి బడుగు, బలహీనవర్గాల యువతను కుంగదీస్తోంది. సంక్షేమ సహకార సంస్థలు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నపుడు లక్షల్లో యువత దరఖాస్తు చేసుకుంటున్నా, ప్రభుత్వమిచ్చే చాలీచాలని నిధులతో కార్పొరేషన్లు కొద్దిమందికే మంజూరు చేస్తున్నాయి. దీంతో జాబితా పెరిగిపోతోంది. రాష్ట్రంలో మూడేళ్ల క్రితం తీసుకున్న దరఖాస్తులకు నేటికీ పరిష్కారం లభించలేదు. మరికొందరికి రుణం మంజూరైనా అది విడుదలకాక ప్రభుత్వం సహాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల పరిధిలోని దరఖాస్తులు చెల్లుబాటులో ఉన్నాయో, లేవో కూడా తెలియని పరిస్థితి నెలకొంది.  ఒకవైపు ప్రభుత్వం అరకొర నిధులే ఇస్తుండగా మరోవైపు మూడేళ్ల క్రితం మంజూరైన రూ. 300 కోట్లలో సగం నిధులు కూడా ఖర్చు చేయలేదు బీసీ కార్పొరేషన్‌. 

సంక్షేమ శాఖలవారీగా ఇదీ పరిస్థితి..

* గిరిజన సహకార ఆర్థిక సంస్థ (ట్రైకార్‌) పరిధిలో ప్రస్తుతం 2018-19 ఏడాదికి సంబంధించిన దరఖాస్తుల్ని ఇప్పుడు పరిష్కరిస్తున్నారు. ఈ ఏడాది మరో లక్షమంది దరఖాస్తు చేసుకున్నారు.
మొత్తం 2 లక్షలమంది యువత రాయితీ రుణాల కోసం ఎదురు చూస్తున్నారు. గత ఏడాదికి రూ. 650 కోట్లు కేటాయించినా ఇప్పటికీ విడుదల కాలేదు. 2021-22 ఏడాదికి కొత్తగా కార్యాచరణ సిద్ధం చేసి, గిరిజన ఎమ్మెల్యేలతో సమావేశమై నిర్ణయం తీసుకోవాలని సీఎం సూచించారు. ఇదంతా అయ్యేసరికి మరికొంత జాప్యం జరిగే అవకాశం ఉంది.  

* బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల పరిధిలో 2014 తరువాత రుణాల కోసం 2017-18లో ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంది. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్లు, సహకార సమాఖ్యల పరిధిలో 5.70 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు రూ.లక్ష లోపు రుణాల కోసం దరఖాస్తు చేసిన 60 వేలమందికి నూరు శాతం రాయితీ కింద రూ.50 వేలు చొప్పున ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. 30 వేలమందికి అందజేశారు. వరసగా పార్లమెంటు, పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌తో పంపిణీ నిలిచిపోయింది. కలెక్టర్ల వద్ద నిధులు అందుబాటులో ఉన్నా ఇప్పుడు కరోనా పేరిట మిగతా 40 వేలమందికి ఇవ్వడంలేదు. బీసీ, ఎంబీసీ కార్పొరేషన్ల పరిధిలో రూ.లక్షకు పైగా రుణాల కోసం దరఖాస్తు చేసిన దాదాపు 5 లక్షలమందికీ ఎదురుచూపులే మిగిలాయి.
*మైనార్టీ కార్పొరేషన్‌ పరిధిలో 2014-15లో తీసుకున్న దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ కార్పొరేషన్‌ పరిధిలో కొత్తగా స్వయం ఉపాధి పథకాలు, రాయితీ రుణాల కోసం దరఖాస్తులు తీసుకోవడం లేదు.


వేచి చూస్తున్న 2 లక్షల మంది ఎస్సీలు

ఎస్సీ కార్పొరేషన్‌ పరిధిలో ఏటా 2 లక్షలమందికి పైగా అభ్యర్థులు రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటారు. 2018-19 నుంచి పంపిణీ నిలిచిపోయింది. అప్పటి వరకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న 2.47 లక్షల మంది దరఖాస్తులన్నిటినీ ప్రభుత్వం రద్దు చేసి కొత్తగా పెట్టుకోవాలని సూచించింది. 2020-21 ఏడాదికి 1.73 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. 18,285 మందికే రుణాలివ్వాలని ఎస్సీ కార్పొరేషన్‌ నిర్ణయించింది. 2020-21 ఏడాదికి రూ. 786 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి విడుదల కాలేదు. ఇంటర్వ్యూలకు హాజరైనా యూనిట్లు మంజూరవుతాయో లేదో తెలీని దుస్థితి.
 


రుణం వస్తదో లేదో
- రమేష్‌, సరూర్‌నగర్‌, హైదరాబాద్‌

మూడేళ్ల క్రితం ఆటో కోసం ఎస్సీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూకు హాజరయ్యాను. అధికారులు దరఖాస్తు పరిశీలించి ఆటో ఇస్తామని చెప్పారు. ఆ వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఆటో మాత్రం రాలేదు. దీంతో 2020-21 ఏడాదిలో కారు కోసం దరఖాస్తు చేశా. ఇప్పటి వరకు ఇంటర్వ్యూలే జరగలేదు. నల్గొండ, భువనగిరి జిల్లాల్లో పూర్తయ్యాయని తెలియడంతో రంగారెడ్డి జిల్లా కార్పొరేషన్‌ కార్యాలయానికి, సంక్షేమ భవన్‌కు తిరుగుతున్నా. ఎక్కడా సరైన సమాచారం రావడం లేదు. ఇప్పటికీ కిరాయి ఆటోతో బతుకుతున్నా.


  ఈ ఏడాదైనా వస్తుందా?
- ఏర్పుల స్వరూప, నకిరేకల్‌, నల్గొండ

నా భర్త నరేష్‌ పెయింటింగ్‌ పని చేస్తారు. ఇద్దరు పిల్లలున్నారు. ఇంటర్‌ వరకు చదివినందున పిండిమర ఏర్పాటు చేసుకునేందుకు 2017లో ఎస్సీ కార్పొరేషన్‌కు రుణం కోసం దరఖాస్తు చేశాను. ఇంటర్వ్యూకు వెళ్లినా రుణం రాలేదు. మరోసారి దరఖాస్తు చేసుకోవాలని చెప్పగా 2020-21లో రూ.2 లక్షల రుణం కోసం దరఖాస్తు చేశాను. జులై 17న ఇంటర్వ్యూకు హాజరయ్యా. ఈ ఏడాదైనా రుణం వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఒకే ఇంట్లో ఇద్దరికి రుణాలిచ్చారు కానీ మాకు ఇవ్వలేదు.


అప్పుచేసి దుకాణం పెట్టుకున్నా
- కావలి కురుమన్న (దివ్యాంగుడు), దంతనూరు, వనపర్తిజిల్లా

చికెన్‌ దుకాణం పెట్టుకుందామని 2017లో బీసీ కార్పొరేషన్‌కు రూ. 2 లక్షల కోసం దరఖాస్తు చేసుకున్నా. ఏళ్లు గడుస్తున్నా రుణం మాత్రం రాలేదు. దీంతో వడ్డీకి అప్పు చేసి దుకాణం పెట్టుకున్నా. ప్రభుత్వం రాయితీ రుణం మంజూరు చేస్తే వడ్డీ భారం తప్పుతుంది.


నాలుగేళ్లుగా ఎదురుచూపు
- సొన్నాయిల రమేష్‌, మరేపల్లి, సంగారెడ్డి

1994 నుంచి డ్రైవర్‌ వృత్తిలో ఉన్నాను. అద్దెకు కార్లు నడుపుతున్నా. ప్రభుత్వం రాయితీ రుణం కింద కారు మంజూరైతే ఉపాధి పొందవచ్చని బీసీ కార్పొరేషన్‌కు 2017లో కారు కోసం దరఖాస్తు పెట్టుకున్నా. ఇంటర్వ్యూకు పిలుపు వస్తుందేమో అని ఎదురుచూస్తున్నా. నాలుగేళ్లయినా ఫలితం లేదు.


ఎన్నిసార్లు తిరిగినా ఫలితం లేదు
- నాగపూరి అశోక్‌, హన్మకొండ

బీసీ కార్పొరేషన్‌ రుణంతో జిరాక్స్‌ మిషన్‌, స్టేషనరీ దుకాణం పెట్టుకోవాలని రూ.2 లక్షల యూనిట్‌ రుణానికి 2018లో దరఖాస్తు చేసుకున్నా. మూడేళ్లుగా కార్పొరేషన్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా. రూ.2 లక్షల రుణ పరిమితితో యూనిట్లు మంజూరు కాలేదని అధికారులు చెప్పారు. దరఖాస్తు చేయడం తప్ప రుణం రావడం లేదు.



Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని