త్వరలో కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు: కేటీఆర్‌
close

తాజా వార్తలు

Updated : 14/04/2021 16:04 IST

త్వరలో కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు: కేటీఆర్‌

జడ్చర్ల: దేశంలో ఎక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రైవేట్‌ టీచర్లు, సిబ్బందిని ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో మంత్రి పలు అభివృద్ధిపనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌, కావేరమ్మపేట-గంగాపూర్‌ బీటీ రహదారి, నల్లచెరువు మినీట్యాంక్‌బండ్‌ అభివృద్ధి పనులను కేటీఆర్‌ ప్రారంభించారు. ఆ తర్వాత కావేరమ్మపేటలో రెండు పడకగదుల ఇళ్లను పరిశీలించారు. జడ్చర్ల పట్టణంలో మొత్తం రూ.15కోట్ల వ్యయంతో చేపట్టనున్న 8 పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం వ్యవసాయ మార్కెట్‌ కమిటీలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

జడ్చర్లకు గతంలో ఎన్నడూ లేనివిధంగా నిధులు కేటాయించి శంకుస్థాపన చేశామని కేటీఆర్‌ అన్నారు. ప్రణాళికాబద్ధంగా పల్లెలు, పట్టణాలు అభివృద్ధి జరగాలన్నదే సీఎం కేసీఆర్ ఆలోచన అని చెప్పారు. ఓ వైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. తెదేపా హయాంలో కొద్దిమందికే రూ.75 పింఛను ఇచ్చే వాళ్లని.. దానికీ యుద్ధం చేయాల్సి వచ్చేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.200 పింఛను ఇచ్చి విపరీతమైన ప్రచారం చేసుకుందని.. కానీ తమ ప్రభుత్వం రూ.2వేలు ఇస్తోందన్నారు. గృహాలతో పాటు వ్యవసాయం, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్‌ ఇస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాకముందు, నేటి పరిస్థితులను బేరీజు వేసుకోవాలని ప్రజలకు మంత్రి సూచించారు. త్వరలోనే కొత్త రేషన్‌కార్డులు, పింఛన్లు మంజూరు చేస్తామని కేటీఆర్‌ వెల్లడించారు. త్వరలో జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో జడ్చర్లలోని 27 వార్డుల్లోనూ తెరాసను గెలిపిస్తే అభివృద్ధిని కానుకగా ఇస్తామని చెప్పారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని