దారి చూపే దయామయుడు
డిసెంబరు 25 క్రిస్మస్
క్రీస్తు ప్రభువు పుట్టిన రోజే క్రిస్మస్. ఈ పర్వదినాన ప్రపంచవ్యాప్తంగా చర్చిల్లో దైవప్రార్థనలు మిన్నంటుతాయి. యేసు ప్రబోధలను గుర్తుచేసుకుంటారు. తమ పాపాలను ప్రక్షాళన చేసి దైవమార్గంలో నడిపించమని వేడుకుంటారు.
రెండు శతాబ్దాలకు పూర్వం... మరియను జోసెఫ్‌కు ప్రదానం చేశారు. కానీ వాళ్లిద్దరూ కాపురం చేయకుండానే పరిశుద్ధాత్మ ప్రభావంతో మరియ గర్భం దాల్చింది. ఉన్నత వ్యక్తిత్వం, ఉత్తమ సంస్కారం గల జోసెఫ్ ఆమెను అవమానించలేదు. కానీ రహస్యంగా విడిచిపెట్టాలి అనుకున్నాడు. అతనలా అనుకోగానే ఆకాశవాణిగా దేవుడే ఆయనతో మాట్లాడాడు. దైవకుమారుడే పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భంలో ప్రవేశించాడని, త్వరలో మరియ ఓ కుమారుడికి జన్మనివ్వబోతోందని తెలియజేశాడు. ఆ రోజు నిజంగా సుదినం! తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు ఏకమైన దినం!
పశులపాకలో బాలయేసు
జోసెఫ్ దైవవాక్కును మన్నించాడు. భార్య మరియను విడిచిపెట్టలేదు. జనాభా లెక్కల్లో తన పేరు నమోదు చేయించేందుకు యూదయ రాష్ట్రంలోని బెత్లెహాం (పాత పేరు ఎఫ్రతా)కు బయల్దేరాడు. నిండుచూలాలైన మరియకు తలదాచుకునే చోటు కరవైంది. జనగణనలో తమ పేరు రాయించు కునేందుకు వచ్చిన వేలాదిమందితో బెత్లెహాం పట్టణం కిక్కిరిసిపోయింది. మరో మార్గంలేక మరియ పశులపాకలో తలదాచుకోగా అక్కడే బాలయేసు జన్మించాడు. అప్పుడు ఆకాశాన ఓ అరుదైన నక్షత్రం మెరిసింది. ఆ అందాల తారను చూసి వివరం అడిగారు. పుట్టింది రాజాధిరాజని విన్న హేరోదుకు అగమ్యగోచరమైంది. తనకు ప్రత్యర్థి పుట్టాడని కోపంతో, కుటిల మనసుతో తాను కూడా ఆ రాకుమారుణ్ణి పూజిస్తానని చెప్పి ఎక్కడ పుట్టాడో, వివరాలేమిటో తెలియజేయమని పండితులను అడిగాడు. వాళ్లు రాజప్రాసాదాన్నివిడిచి బయల్దేరగా, ఆ నక్షత్రం వారికి పైనుంచి దారి చూపసాగింది. ఇజ్రాయేలుకు కాబోయే రాజు జన్మించాడంటూ అతణ్ణి తిలకించడానికి ముగ్గురు జ్ఞానులు బయల్దేరారు. ఆ రాకుమారుడి రాజ్యం ఇహలోకానికి సంబంధించింది కాదని పాపం హేరోదు రాజుకు తెలియదు! జ్ఞానులకు దారి చూపిస్తున్న అందాల నక్షత్రం ఓ పశులపాక వద్ద నిలిచింది. వారు లోనికి వెళ్లి తొట్టెలో పడుకున్న రాజాధి రాజుకు ప్రణమిల్లారు. బంగారం, సాంబ్రాణి, బోళం(ఒక విధమైన సుగంధ ద్రవ్యం) తదితర కానుకలు సమర్పించారు. బంగారం దైవత్వానికి సంకేతం. స్వర్ణాన్ని ఇవ్వడం ద్వారా ఆ బాలుడు దేవాధిదేవుడని చెప్పడం. శ్రమకు సంకేతం సాంబ్రాణి. అంటే మానవాళి కోసం ప్రభువు అనుభవించబోయే శ్రమను సూచించడం. మనిషి మరణించాక పార్దివ శరీరాన్ని యూదులు బోళంతో అభిషేకిస్తారు. ప్రభువు అలాగే అభిషేకిస్తాడని విశ్వసిస్తారు. ఈ మూడు అంశాలూ భవిష్యత్తులో ప్రభువుకు సంభవించబోయే సంఘటనలకు నిదర్శనం. పాపకూపంలో పడి నశించిపోతున్న మానవాళికి జ్ఞానోదయం కలిగించి పరలోక ప్రాప్తిని అనుగ్రహించేందుకు దేవాధిదేవుడు తన పుత్రుణ్ణి మనిషి రూపంలో అవతరింపజేశాడు.
క్రీస్తుశక ఆరంభం
మానవాళికి దేవుడిచ్చిన బహుమానమే యేసుక్రీస్తు! నేటికీ సంఘటన జరిగి 2022 సంవత్సరాలైంది. క్రీస్తు జననంతో క్రీస్తుశకం ఆరంభమైంది. అంతకు ముందు కాలాన్ని క్రీస్తుకు పూర్వం అనడం తెలిసిందే. యేసుక్రీస్తు జన్మదినాన్ని క్రిస్మస్ పర్వదినంగా వేడుక చేసుకుంటున్నాం. ఇది ప్రపంచమంతటా ఘనంగా చేసుకునే అతి పెద్ద పండుగ.
బాలయేసు తల్లిదండ్రుల ప్రేమాభిమానాలతో, దేవుని దయతో దినదిన ప్రవర్ధమానంగా ఎదుగుతున్నాడు. జ్ఞానాన్ని పంచుతూ భాసిస్తున్నాడు. శాస్త్రులు, పరిసయ్యలు, జ్ఞానులతో కూడిన సభలో పన్నెండేళ్లకే బాలయేసు మానవాతీత మైన అపూర్వ జ్ఞానతేజస్సుతో ఆలయంలో ప్రబోధలు వినిపిస్తున్నాడు. ఆ ప్రబోధలు వింటూ అందరూ అబ్బురపడ్డారు. పాపాన్ని త్యజించి మనసా, వాచా, కర్మణా పరిశుద్ధ జీవితం కొనసాగించాలి. అప్పుడే మానవాళికి పరలోక ప్రాప్తి కలుగుతుంది. ఇదే క్రీస్తు ప్రబోధామృతం.
క్షమకు మారుపేరు
ఎంత పాప కార్యాలు చేసినా వాటిని గ్రహించి పశ్చాత్తాపం చెందితే యేసుక్రీస్తు క్షమిస్తాడు. అదే క్రైస్తవ విశ్వాసానికి కేంద్రబిందువు. చెడును విడిచిపెట్టినపుడు క్రీస్తు మనలోనే నివసిస్తాడు. మన హృదయకవాటం వద్ద నిలబడి ప్రభువు తడుతున్నాడు. అది గుర్తించి ఆయనకు హృదయాన్నే అర్పించాలి. అంతేగానీ పూలూ, పండ్లూ, ఇతర కానుకలూ ఏమీ ప్రభువుకు అక్కరలేదు. క్రీస్తును మనసారా నమ్మి ఆయన ఆజ్ఞలు శిరసావహించాలి. అదే ఆ ప్రభువు మన నుంచి ఆశించేది. అప్పుడే ప్రభువు మన హృదయాల్లో కొలువయ్యుంటాడు.
మర్రి ఎ.బాబ్జి
రక్షించు ప్రభూ!
అభంశుభం తెలీని పసిబిడ్డలెందర్నో హేరోదురాజు నిర్దాక్షిణ్యంగా చంపించాడు. జ్ఞానులు చేసిన పొరపాటే అందుకు కారణం...
క్రిస్మస్ అంటే ఓ సంఘటన, ఒక చరిత్ర! మనం దేవుడి బిడ్డలం.. మనలో దేవుడు నివసిస్తున్నాడు.. అనే భావన కనుక ఉంటే క్రిస్మస్ కొనసాగుతున్న చరిత్ర. ప్రభువు మనకోసం రెండు శతాబ్దాల క్రితం మనిషి రూపంలో జన్మించాడు. ఆ రోజునే క్రిస్మస్ పండుగగా సంబరం చేసుకుంటున్నాం.
యేసు జన్మించక మునుపు, నాలుగు శతాబ్దాలు దేవుడి నుంచి సూచన కానీ సమాచారం కానీ లేదు. యూదు మతస్థులు ఆ నిశ్శబ్దం ఎలా ముగుస్తుందోనని ఎదురుచూస్తున్నారు. మరికొందరైతే దైవచింతనే మానేశారు. ఈ పరిస్థితిలో ఇజ్రాయేలు దేశంలోని బెత్లెహాంలో ఒక అలజడి! కన్యయైన మరియ గర్భంలో లోకరక్షకు డైన యేసు జన్మిస్తాడనే వార్తను దైవదూత మోసుకొచ్చాడు. అది ఆ ప్రాంతమంతా వ్యాపించింది. అక్కడున్న వారంతా సామాన్య ప్రజానీకమే. అయినా దైవసంకల్పం వల్ల యేసుని అపూర్వ జననం గురించి అపార నమ్మకంతో ఉన్నారు. యేసు పుట్టుకకు గుర్తుగా ఆకాశంలో వెలసిన దేదీప్యమానమైన నక్షత్రాన్ని చూసి దాన్ని వెంబడించారు. గగనంలోని ఆ తార వారిని యూదుల దేశం వైపు నడిపిస్తోంది. కానీ వారి ప్రయాణంలో ఒక తొట్రుబాటు! రారాజైన యేసు, రాజమహల్లో జన్మిస్తాడనే ప్రగాఢ విశ్వాసం ఉండటం వల్ల మార్గగామిగా వ్యవహరించిన వ్యక్తి, ఇతరులూ కూడా పైన నక్షత్ర గమనాన్ని విస్మరించారు. దాంతో దారి తప్పి, ఆ ప్రాంత రాజైన హేరోదురాజు వద్దకు చేరారు.
జ్ఞానులు చెప్పింది విన్న హేరోదురాజు మతపెద్దలను పిలిపించాడు. వాళ్లు బైబిల్‌ను పరిశోధించి, బెత్లెహాంలోనే దైవకుమారుడు జన్మిస్తాడన్నారు. అది హేరోదుకే నచ్చలేదు. రారాజు యేసు తనకు పోటీ అనుకుని చంపాలనుకున్నాడు. యేసును గురించి లిఖితమైన దైవ వాక్యాలను విశ్లేషించిన జ్ఞానులు హేరోదు దర్బారులో అదంతా చెప్పడం పొరపాటని, తామింకా గమ్యం చేరలేదని గ్రహించారు. హేరోదురాజు రెండేళ్ల లోపు వయసున్న మగబిడ్డలందర్నీ చంపడానికి అదే కారణమైంది. ఆ విషాదకాలం ముగిసే వరకూ యేసును వేరొక ప్రాంతంలో పెంచమన్నది దైవాజ్ఞ.
జ్ఞానుల పొరపాట్లు వారికీ, ఇతరులకూ కూడా చేటుచేశాయి. కనుక మనం చేసే తప్పులూ లేదా పాపాలు మనకూ ఇతరులకూ కూడా హానికరమే. కానీ అధైర్యపడకూడదు. తప్పు గ్రహించిన జ్ఞానులు రాజభవనం నుంచి బయటకు రాగానే, అందాకా దారి చూపిన తార మళ్లీ కనిపించింది. ఇది దేవుడి అపార దయకు సంకేతం. ప్రభువు వాగ్దానాలు తప్పక నెరవేరతాయని మనం విశ్వసించాలి. ఆయన మనల్ని పాపాలూ, శాపాల నుంచి విడిపించి ఆశీర్వదిస్తాడు. దారితప్పిన జ్ఞానుల కోసం ఎదురు చూసిన తార వలె మనకోసం ఎదురుచూస్తాడు. యేసు మనల్ని పిలుస్తూనే ఉంటాడు. దానికి స్పందించి, ఆయనను విశ్వసిస్తే అదే అసలైన క్రిస్మస్!
పాస్టర్ జాన్ బిళ్లా, అట్లాంటా, అమెరికా
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
2023 సంవత్సరం.. మార్చి 23వ తేదీ.. 23 ఓట్లు
-
Sports News
దిల్లీని ఢీకొట్టేదెవరో?.. నేడే ముంబయి-యూపీ ఎలిమినేటర్
-
World News
Russia: ‘పుతిన్‌ను అరెస్టు చేయడమంటే.. యుద్ధాన్ని ప్రకటించినట్లే!’
-
India News
Anand Mahindra: తోలుబొమ్మ ‘నాటు నాటు’.. ఆనంద్ మహీంద్రా పోస్ట్ వైరల్
-
Sports News
Rohit - Gavaskar: ప్రపంచకప్ ముంగిట కుటుంబ బాధ్యతలా? రోహిత్ తీరుపై గావస్కర్ అసహనం
-
Crime News
Acid Attack: ప్రియుడితో వెళ్లిపోయిందని.. కోర్టులోనే భార్యపై యాసిడ్ దాడి!