నారాయణ తే నమో నమో!

వేవేతి ఇతి విష్ణుః...విశ్వమంతా తానైనవాడు శ్రీ మహావిష్ణువు.అణువులో అణువుగా, బ్రహ్మాండంలో అనంత శక్తిగా ఉన్న పరమాత్మతత్త్వం అద్భుతమైంది. అనిర్వచనీయమైంది.ఆ సర్వవ్యాపిని స్మరించి, పూజించి, తరించే శుభ సమయం ధనుర్మాసం. పరంధాముడి గురించి నారాయణోపనిషత్తు చెప్పిన వివరాలివీ... ఓం అనేది ఏకాక్షరం. నమ:అనేవి రెండక్షరాలు. నారాయణ అనేవి నాలుగక్షరాలు. ఇలా రెట్టింపు సంఖ్యలో పెరిగిన అక్షరాల సమాహారం, ‘ఆయన’ అనే అర్థం వచ్చే ‘య’ చేరి ఓం నమో ...

Published : 10 Dec 2020 01:49 IST

ఈనెల 15 నుంచి ధనుర్మాసం

వేవేతి ఇతి విష్ణుః...
విశ్వమంతా తానైనవాడు శ్రీ మహావిష్ణువు.
అణువులో అణువుగా, బ్రహ్మాండంలో అనంత శక్తిగా ఉన్న పరమాత్మతత్త్వం అద్భుతమైంది. అనిర్వచనీయమైంది.
ఆ సర్వవ్యాపిని స్మరించి, పూజించి, తరించే శుభ సమయం ధనుర్మాసం. పరంధాముడి గురించి నారాయణోపనిషత్తు చెప్పిన వివరాలివీ...


ఓం అనేది ఏకాక్షరం. నమ:అనేవి రెండక్షరాలు. నారాయణ అనేవి నాలుగక్షరాలు. ఇలా రెట్టింపు సంఖ్యలో పెరిగిన అక్షరాల సమాహారం, ‘ఆయన’ అనే అర్థం వచ్చే ‘య’ చేరి ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రంగా రూపుదిద్దుకొంది. దీన్ని పఠిస్తే భగవంతుడితో అనుసంధానం ఏర్పడుతుందని, సర్వారిష్టాలు తొలగుతాయని చెబుతారు. అష్టాక్షరీ మంత్రం పరమ పురుషుని హృదయకమలమైన వైకుంఠానికి చేర్చుతుందని అధర్వణవేద ఉపనిషత్తు చెబుతోంది.

విష్ణు... ఈ పేరు విష్‌ అనే శబ్దం నుంచి వచ్చింది. అంతటా వ్యాపించి ఉందని దీనికి అర్థం. విష్ణువు అంటే సర్వ వ్యాపకుడు అని అర్థం.
వసించి ఉన్నదాన్ని ‘వస్తువు’ అంటారు. సచేతనంగా ఉన్న జీవులు కావచ్చు, అచేతనంగా ఉండే రాయి, రప్ప కావచ్చు. కనిపించే ప్రతిదీ సర్వవ్యాపకుడైన విష్ణుమయమే అంటుంది సనాతన ధర్మం. ప్రస్తుతం ఏదైతే ఉందో దాన్ని స్థితి అంటారు. దానికి కారకుడు శ్రీమన్నారాయణుడు కాబట్టి వర్తమానంలో ఉన్నదంతా, జరుగుతున్నదంతా ఆయన లీలావిలాసంగానే  భావించాలి. యోగంతో ఆత్మను అంతర్ముఖం చేసిన సాధకుడికి అంతా విష్ణుమయంగానే కనబడుతుంది.
విష్ణు శబ్దం తర్వాత ఆయనకున్న ప్రసిద్ధమైన నామం నారాయణుడు. నారం అంటే నీరు. నీరే స్థావరంగా చేసుకుని లోకాలను పరిపాలించే వాడు శ్రీ మహావిష్ణువు అని చెబుతోంది నారాయణోపనిషత్‌. చతుర్వేదాల్లో భాగాలుగా ఉండే ఈ ఉపనిషత్తులో శ్రీమన్నారాయణుడి విరాట్‌ స్వరూప వర్ణన కనిపిస్తుంది.
అథః నిత్యో నారాయణః బ్రహ్మో నారాయణః, శక్రశ్చ నారాయణః, ద్యావా పృథివ్యౌచ నారాయణః కాలాశ్చ నారాయణః, దిశశ్చ నారాయణః, ఊర్థ్వంచ నారాయణః, అథశ్చ నారాయణః, అంతర్బహిశ్చ నారాయణః... అతడే సత్యం, అతడే నిత్యం, అతడే బ్రహ్మ, అతడే శివుడు, భూమి, ఆకాశం. పాతాళం, బయట, లోపల అన్నీ అతడే. భూతభవిష్యత్‌వర్తమానాలు అతడే, అతడు నిష్కళంకుడు, నిరంజనుడు, నిర్వికల్పుడు.. అతన్ని వర్ణించడానికి మాటలు చాలవు... అంటూ రుగ్వేదంలో పరమాత్మ సర్వవ్యాపకత్వాన్ని విశదపరిచారు.
ఆది పురుషుడైన నారాయణుని రూపం, గుణాలను వర్ణించడంతో పాటు జీవుల ధర్మాన్ని కూడా ఈ ఉపనిషత్తులో చూడొచ్చు. ‘సర్వ జీవులు రక్షింపబడుగాక. సర్వజీవులు పోషింపబడుగాక. అందరూ కలిసి గొప్ప శక్తితో కూడి సమాజ ఉద్ధరణ కోసం పని చేయాలి. మన మేథస్సు వృద్ది చెందుగాక. మన మధ్య విద్వేషాలు రాకుండుగాక. వ్యక్తిగత శాంతి, దైవిక శాంతి, ప్రాకృతిక శాంతి కలుగు గాక.’ అంటూ ప్రారంభమవుతుంది ఈ ఉపనిషత్తు. సర్వ జీవ సౌభ్రాతృత్వానికి నిలువెత్తు ఉదాహరణ పైవాక్యాలు.
నారాయణుడు విశ్వచైతన్య శక్తి కారకుడు. ఆయన నుంచే సకల ప్రకృతి రూపుదాల్చింది. నారాయణ శబ్దానికి ‘నరులలో నివసించే వాడు’ అనే అర్థం ఉంది. మనిషిలోని మనసు, ఇంద్రియాలు, పంచభూతాల్లోనూ ఆయనే ఉంటాడు. .అందుకే ప్రతి వారిలోనూ ఆయనను దర్శించగలిగే స్థాయికి ఎదగాలనే మానవ జీవన విధానాన్ని అంతర్గతంగా ప్రబోధించింది నారాయణ తత్వం.

మనుష్యులు తమ చుట్టూ ఆశా, మోహాలనే తెరలు నిర్మించుకుని కాలం గడిపేస్తున్నారు. దీన్నే మానవ ప్రాకారం అంటారు. కానీ  దైవ ప్రాకారంలోకి వెళ్లాలంటే సద్గుణాలను అలవాటు చేసుకోవాలి. భగవంతుడి ఆరాధన ఉండాలి. ఎదుటి మనిషిలో మంచిని చూసినపుడు ఆ మనిషిలో ఉన్న విష్ణుతత్త్వంతో సంబంధం ఏర్పడుతుంది. అప్పుడు ఆ సద్గుణాలు మనకు కూడా అబ్బడానికి అవకాశ మేర్పడుతుంది. సద్గుణాలను ఆరాధన చేస్తూ ఉంటే దైవమే తనను తాను మన నుండి ప్రకటింప చేసుకుంటాడు. అప్పుడు నరుడు,  నారాయణుడు అనే భేదం ఉండదు. జీవుడే దేవుడు... దేవుడే జీవుడు అని భావం.

-రమా శ్రీనివాస్‌

ఏదీ శాశ్వతంకాదు, కాబట్టి పుణ్యకార్యాలు చెయ్యి అనే భావాన్ని తెలియజెప్పేవాడు కూడా నారాయణునితో సమానమని చెబుతారు పెద్దలు. దీనజనులకు చేసే సేవను నారాయణ సేవ అని అనడంలోని అంతరార్థం కూడా ఇదే.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని