విష్ణుః పితృ రూపేణ..

నాన్న... నిలువెత్తు త్యాగాల రూపు! ఎన్నో కష్టాల తాలిమి! బిడ్డల క్షేమం, ఉన్నతి కోసం ఎంతటి శ్రమకైనా వెనకాడడు తండ్రి. తన సర్వస్వాన్ని అర్పించి, కుటుంబ క్షేమంలోనే తన ఆనందం చూసుకుంటాడు

Published : 17 Jun 2021 00:37 IST

జూన్‌ 20 పితృ దినోత్సవం

నాన్న... నిలువెత్తు త్యాగాల రూపు! ఎన్నో కష్టాల తాలిమి! బిడ్డల క్షేమం, ఉన్నతి కోసం ఎంతటి శ్రమకైనా వెనకాడడు తండ్రి. తన సర్వస్వాన్ని అర్పించి, కుటుంబ క్షేమంలోనే తన ఆనందం చూసుకుంటాడు జనకుడు. అంతటి మహోన్నత త్యాగ మూర్తి గురించి హిందూ ధర్మం ఏం చెబుతోంది...
ఎలా ఉండాలంటే..
లాలయేత్‌ పంచవర్షాణి, దశ వర్షాణి తాడయేత్‌
ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రం మిత్రవదాచరేత్‌
అంటుంది చాణక్యుడి నీతిశాస్త్రం. బిడ్డకు అయిదేళ్లు వచ్చేవరకూ తండ్రి లాలించి, వాత్సల్యం చూపించాలి. ఆ తర్వాత పదేళ్లు పిల్లలు మంచి మార్గంలో నడిచే విషయంలో దండించటానికీ వెనకాడకూడదు. పదహారేళ్లు రాగానే సంతానంతో మిత్రుడిలా మెలగాలి.

వేదం ‘పితృదేవోభవ’ అంటూ తండ్రిని దైవంగా చూడాలని చెబితే, శాస్త్రాలు ఆయనకి విష్ణు స్థానమిచ్చాయి. జగత్తును పాలించి పోషించేది విష్ణుమూర్తి. అందువల్ల కుటుంబాన్ని పోషించే తండ్రిని విష్ణు సమానుడిగా చెప్పాయి.
* ‘నమో పిత్రే జన్మధాత్రే సర్వదేవమయాయచ। సుఖదాయ ప్రసన్నాయ సుప్రీతాయ మహాత్మనే।। దుర్లభం మానుషమిదం యేనలబ్ధం మయావపుః। సంభావనీయం ధర్మార్థే తస్మై పిత్రే నమోనమః...’ ఇలా సాగుతుంది బృహద్ధర్మ పురాణంలో పితృస్తుతి. దుర్లభమైన మనుష్య జన్మ ఇచ్చి, సుఖంగా జీవితాన్ని గడిపేలా చేస్తూ, చిన్ననాటి నుంచి తప్పులన్నీ క్షమిస్తూ, మంచి మార్గంలో నడిపే తండ్రిని ఆ పురాణం ఎంతగానో కీర్తించింది.
త్యాగజీవి
బిడ్డల కోసం తండ్రి చేసే త్యాగాలు వెలకట్టలేనివి. తాను ఎన్ని కష్టాలు అనుభవించైనా పిల్లల్ని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని దివారాత్రాలు శ్రమిస్తాడు నాన్న. ఆ క్రమంలో తన గురించి తను పూర్తిగా మర్చిపోతాడు. అయినా, నాన్న పడే కష్టం బయటికి కనిపించదు. అందుకే, ‘అమ్మ తొమ్మిది నెలలు మోస్తే... నాన్న జీవితాంతం మోస్తాడు.. అయినా నాన్నెందుకో వెనకబడ్డాడు.. అమ్మకు బీరువా నిండా రంగురంగుల దుస్తులు.. నాన్న దుస్తులకు దండెం కూడా నిండదు.. తనని తాను పట్టించుకోవటం రాని నాన్న ఎందుకో వెనుకబడ్డాడు’ అని తండ్రి త్యాగాల్ని వివరించే ప్రయత్నం చేశారు ఓ కవి.
* గృహ వ్యవహారాల్లో తల్లి పాత్ర కీలకం. అయితే లోక వ్యవహారంలో తండ్రిదే ప్రధాన భూమిక. తండ్రి వంశమే కుమారుడికి వస్తుంది. క్రమశిక్షణ, నీతి, నిజాయతీ లాంటివన్నీ పిల్లలకు నేర్పుతాడు తండ్రి. నాన్న వేలు పట్టుకునే బిడ్డ లోకాన్ని చూస్తాడు. దాశరథి, మారుతి, జానకి, ద్రౌపది, కైక ఇలా ఇతిహాసాల్లో తండ్రి పేరుతోనే బిడ్డలు విఖ్యాతులవటం తెలిసిందే. ఉత్తరాదిన పేరు చివర తండ్రి నామం కూడా వస్తుంది. భారత జాతిపిత ‘మోహన్‌దాస్‌ కరమ్‌చంద్‌ గాంధీ’ పేరులో తండ్రి ‘కరమ్‌చంద్‌’ ఉన్నాడు.
గొప్పవారెందరో
బిడ్డకు ఏ చిన్న కష్టం కలిగినా తల్లడిల్లిపోతాడు తండ్రి. నిరంతరం తన పిల్లల క్షేమం గురించే ఆలోచిస్తుంటాడు. ఇంద్రుడి వజ్రాయుధ ఘాతానికి మూర్ఛిల్లిన బాలాంజనేయుణ్ని చూసి వాయుదేవుడు కుమిలిపోయాడు. లోకాల్ని స్తంభింప జేశాడు. విభాండక మహర్షి తానే తల్లీతండ్రీ… అయ్యి రుష్యశృంగుణ్ని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇలా తనయుల క్షేమం కోపం పరితపించిన తండ్రులు పురాణేతిహాసాల్లో ఎందరో కనిపిస్తారు. కష్టం వచ్చినప్పుడు నాన్న ఉన్నాడన్న ధైర్యం గొప్ప సాంత్వననిస్తుంది.
* పిల్లల పట్ల అంధ ప్రేమ ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ధృతరాష్ట్రుడి ద్వారా తెలుస్తుంది.  
* తండ్రి విలువ గ్రహించి, ఆయన పట్ల పూర్తి భక్తిప్రపత్తులతో మెలిగిన పుత్రులు పురాణేతిహాసాల్లో కనిపిస్తారు. పితృవాక్య పాలన విషయంలో రాముడు అందరికీ ఆదర్శం. యాగరక్షణార్థం వెళ్లిన రాముడితో విశ్వామిత్రుడు తాటకిని వధించాలని చెప్పినప్పుడు ‘పితుర్వచన నిర్దేశాత్‌ పితుర్వచన గౌరవాత్‌। వచనం కౌశికస్యేతి కర్తవ్యం అవిశంకయా।।’ అంటాడు రాముడు. మీతో పంపించేటప్పుడు మీరు ఏం చెబితే అది చెయ్యమన్నారు నాన్నగారు. కాబట్టి తాటకిని వధిస్తాను’ అని చెబుతాడు. పరశురాముడు కూడా తండ్రి జమదగ్ని ఆజ్ఞ మేరకు కన్నతల్లిని సంహరించాడు. తర్వాత తండ్రి వరంతో మాతృమూర్తిని తిరిగి బతికించుకున్నాడు.
* తండ్రి కోసం గొప్ప త్యాగాలు చేసిన పుత్రులు కూడా ఉన్నారు. శంతనుడి కోసం దేవవ్రతుడు వివాహమే చేసుకోనని, రాజ్యం తన సవతితల్లి సత్యవతి కుమారులకే దక్కుతుందని భీష్మ ప్రతిజ్ఞ చేసి భీష్ముడిగా ప్రసిద్ధికెక్కాడు. తండ్రి యయాతికి శుక్రాచార్యుడి శాపం వల్ల ఏర్పడిన ముసలితనాన్ని తాను స్వీకరించి, తన యవ్వనాన్ని జనకుడికి దానం చేశాడు పూరుడు. తండ్రి మెడలో చనిపోయిన పాము వేసి పరాభవించిన పరీక్షిత్తుకు మరణశాసనమే రాశాడు శృంగి.
మమకారం మరి!
పేరుకు రాక్షస రాజైనా, ‘పిల్లలు చదివినా చదవకున్నా తండ్రి వారిని పోషిస్తాడు. స్నేహంగా బుద్ధి నేర్పుతాడు. కష్టం కలగకుండా కాపాడతాడు. శతృత్వం వహించడు’ అంటాడు హిరణ్యకశిపుడు భాగవతంలో. ప్రహ్లాదుణ్ని ఒళ్లో కూర్చోబెట్టుకొని ‘గురువులు ఏయే విద్యలు నేర్పారు’ అని ఆప్యాయంగా అడుగుతాడు.
* పుట్టిన వెంటనే కన్నయ్యని పదిలంగా హృదయానికి హత్తుకుని అర్ధరాత్రి యమునను దాటించాడు వసుదేవుడు. ఆ సమయంలో బిడ్డ కోసం గాడిద కాళ్లు కూడా పట్టుకున్నాడు. పిల్లల కోసం ఎన్ని అవమానాలనైనా సహిస్తాడు తండ్రి.
* ‘శకుంతల అత్తారింటికి వెళ్తుంటే బాధతో కంఠం పట్టేసి నోట మాట రావటం లేదు. కంట్లో నీరు చేరి చూపు ఆనటంలేదు. మునివృత్తిలో ఉన్న నాకే ఇంత బాధగా ఉంటే గృహస్థులకి ఇంకెంత ఆవేదనో కదా’ అంటాడు కణ్వ మహర్షి శాకుంతలంలో. చిన్ననాటి నుంచి శకుంతలను ప్రేమగా పెంచిన మమకారం అలాంటిది మరి!
అదే గౌరవం
ఉత్తమ పుత్రుడు తండ్రి జీవించినంతకాలం ఆయన చెప్పింది చెయ్యాలి. తండ్రి గతించిన రోజున ఏటా భారీగా అన్నదానం చెయ్యాలి. గయలో పిండ ప్రదానం నిర్వహించాలని చెబుతాయి శాస్త్రాలు. ఈ మూడింటిలో చివరి రెండూ అటుంచితే, కనీసం తండ్రి మాటకు చివరి వరకూ విలువ ఇస్తే అదే ఆయనపట్ల చూపే కొండంత గౌరవం.
* సంతాన వృద్ధి కోసం రెక్కలు ముక్కలు చేసుకొని, తినీతినక కష్టపడి కూడబెట్టినదాన్ని బిడ్డలకిస్తారు తల్లిదండ్రులు. అలాంటి వారిని వృద్ధాప్యంలో పట్టించుకోని సంతానానికి నిష్కృతి ఉంటుందా...?


కడుపున పుట్టకపోయినా...

విద్యార్థుల మీద గురువుకి, ప్రజల మీద రాజుకి ఉండేది పితృత్వ భావనే. సొంత కొడుకైన అశ్వత్థామను కాదని అర్జునుడి మీద ద్రోణుడికి అంత ప్రేమ ఉండటానికి కారణం ఆ భావనే. రాజు ప్రజలను కన్నబిడ్డల్లా పాలించాడని అంటారు. అనాథలు, ఆర్తులకు హృదయపూర్వకంగా సేవ చేసే వారిలోనూ పితృత్వ భావన కనిపిస్తుంది.


- డా।। అన్నదానం చిదంబరశాస్త్రి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని