సమయమిదే మిత్రమా!

ఈ ప్రవచనాలన్నీ సమయం విలువను, కాలం గొప్పతనాన్ని తెలియజేసేవే. సెకన్లు, నిమిషాలు, గంటల సమయాన్ని దుర్వినియోగం...

Updated : 02 Jan 2020 00:36 IST

ఇస్లాం సందేశం

ముహమ్మద్‌ (స) తన శిష్యులతో ఇలా చెప్పారు.

ఓ వ్యక్తికి అంత్యకాలం సమీపిస్తుంది. అప్పటి వరకు అతను దైవ వాక్కుపై ఏమరుపాటుగా ఉన్నాడు. మరణానికి ముందు అతను ఇలా అనటం ప్రారంభించాడు,

‘’ఓ నా ప్రభూ! నేను వదలిపెట్టివచ్చిన లోకానికే నన్ను తిరిగి పంపెయ్యి. ఇప్పటి నుంచి నేను మంచిపనులు చేస్తాను’’.

కానీ ఇది ఎంతమాత్రమూ జరిగేది కాదు.

వృద్ధాప్యానికి పూర్వం యవ్వనం.

అనారోగ్యానికి పూర్వం ఆరోగ్యం.

లేమికి పూర్వం కలిమి.

పనుల్లో లీనమవ్వక పూర్వం తీరిక సమయం.

మరణానికి పూర్వం జీవితం. మేలైనవిగా భావించండి.

ప్రళయదినాన ‘నీ జీవితాన్ని, యవ్వనాన్ని ఎలా గడిపావు’ అనే ప్రశ్నకు సమాధానం ఇవ్వనంత వరకు మనిషి, దైవం ముందు నుంచి ఒక్క అడుగు కూడా కదపలేడు.

ప్రవచనాలన్నీ సమయం విలువను, కాలం గొప్పతనాన్ని తెలియజేసేవే. సెకన్లు, నిమిషాలు, గంటల సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వారు తీవ్ర నష్టానికి గురవుతారని ఖుర్‌ఆన్‌ హెచ్చరిస్తోంది. ఈ లోకంలో మనిషికి విలువైన సంపద పరుగెడుతున్న కాలమేనని స్పష్టం చేస్తున్నాయి. ఇస్లాం ఆరాధనలన్నీ సమయపాలనను నేర్పుతాయి. ఐదు పూటలా నమాజు వేళప్రకారం చేయాలి. మక్కా యాత్రను జిల్‌ హజ్‌ నెలలో చేస్తేనే హజ్‌ క్రతువు పూర్తవుతుంది. ఉపవాసాలు రమజాన్‌ నెలలో పాటిస్తేనే వాటి ఉద్దేశం నెరవేరుతుంది. ఇలా ప్రతీ ఆరాధనా సమయపాలనను, సమయ ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. ‘నేను సమయం విలువను మంచు దిమ్మలు అమ్మేవాని ద్వారా అర్థం చేసుకున్నాను...’ అని చెబుతారు ఇమామ్‌ రాజీ. మనిషికి దేవుడిచ్చిన వ్యవధి మంచు దిమ్మలా వేగంగా కరిగిపోతోందంటారాయన. ఇంతటి విలువైన సమయాన్ని వృథాగా గడపడమంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే.

ప్రవక్త హజ్రత్‌ నూహ్‌ (అలై) మరణ సమయం ఆసన్నమైనప్పుడు ఈ ప్రపంచాన్ని ఎలా అనుభవించారు? అని మృత్యుదూత అడిగారు.

‘నేను ఇంటిలోని ఒక తలుపు నుంచి ప్రవేశించాను. మరో ద్వారం నుంచి వెళ్లిపోతున్నాను’ అన్నట్లు గడిచింది ఈ జీవితం అని సమాధానమిచ్చారు.

ఈ చిరు జీవితాన్ని అర్థవంతంగా గడపాలంటారు ప్రవక్త మహనీయులు. ‘ఏ వ్యక్తి రెండు రోజులు ఒకేలా గడుస్తాయో అతను వినాశనం పాలవుతాడు’ అన్నారు హజ్రత్‌ అలీ. నిన్నటి కంటే ఈ రోజు మరింత మెరుగ్గా గడవాలన్నదే ఆయన ఉద్బోధ.

వివేకవంతుడైన వ్యక్తి తన సమయాన్ని నాలుగు భాగాలుగా విభజించుకోవాలంటారు ప్రవక్త ఇబ్రాహీం (అలై). ఒకభాగం దైవారాధన కోసం, ఆత్మపరిశీలన కోసం రెండో భాగం, సృష్టి నిర్మాణం పరిశీలన కోసం మూడో భాగం, తన కోసం, కుటుంబం కోసం నాలుగోభాగాన్ని ప్రత్యేకించుకోవాలన్నారు. ఇవే నా చివరి క్షణాలన్న స్పృహతో జీవితం గడపాలంటారు ఇమామ్‌ గజాలి. గడిచిపోయిన కాలాన్ని గురించి చింతిస్తూ కూర్చోకుండా రాబోయే భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా వర్తమాన కాలంలో సంతృప్తిగా, దైవాదేశాలకు కట్టుబడి జీవిస్తే జీవితం సాఫీగా సాగిపోతుందని అంటారాయన. జీవిత ఘడియలను మంచి పనుల్లో వెచ్చిస్తే చెడ్డ పనుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చని చెబుతారు ఇమామ్‌ షాఫయీ. సంతోష ఘడియల్లో ఎవరైతే దైవాన్ని స్మరిస్తారో వారిని కష్టకాలంలో అల్లాహ్‌ రక్షిస్తాడు.. అనే ప్రవక్త ఉద్బోధను గుర్తుంచుకుని జీవితాన్ని గడపాలి.

మీ గుండెమీద చెయ్యిపెట్టుకుని వినండి. మీ గుండె చేసే ఒక్కో చప్పుడు మీ జీవిత ఆయుష్షు తగ్గుతుందని హెచ్చరిస్తుంది. గడిచిపోయిన ప్రతీక్షణం మనల్ని మృత్యువుకు దగ్గరచేస్తుంది... అందుకే కాలాన్ని మంచి పనులతో సద్వినియోగం చేసుకోండి.

- ఖైరున్నీసాబేగం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని