వేదాలకు వెలుగు!

వ్యాసోచ్చిష్టం జగత్సర్వం... ఈ లోకంలో ఉన్న వాజ్ఞ్మయమంతా ఆ వ్యాస భగవానుడి ప్రసాదమే. నాలుగు ముఖాలు లేకున్నా ఆయన చతుర్ముఖుడైన బ్రహ్మతో సమానం. నాలుగు

Updated : 04 Jun 2020 02:02 IST

ఈనెల 5 వ్యాస పౌర్ణమి

వ్యాసోచ్చిష్టం జగత్సర్వం... ఈ లోకంలో ఉన్న వాజ్ఞ్మయమంతా ఆ వ్యాస భగవానుడి ప్రసాదమే. నాలుగు ముఖాలు లేకున్నా ఆయన చతుర్ముఖుడైన బ్రహ్మతో సమానం. నాలుగు చేతులు లేకున్నా వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువుతో సమానం. నుదుటి భాగంలో మూడో కన్ను లేకున్నా కైలాసవాసి అయిన పరమశివుడితో సరితూగుతాడని వర్ణిస్తారు. వ్యాసాయ విష్ణు రూపాయ... వేదమయుడు, వేద రక్షకుడైన శ్రీ మహావిష్ణువే వ్యాసుడిగా అవతరిస్తుంటాడనీ చెబుతారు. ఆయన గురువులకే గురువు... గురు పరంపరలో తొలిగురువు.

ఎవరీయన?

వ్యాసుడు అంటే విభజించినవాడు అని అర్థం. వేదాలను విభజించినవాడు వేదవ్యాసుడయ్యాడు. వేద వ్యాసులైన వారందరికీ వేరే పేర్లున్నాయి. ఈ అవతార విశేషాలు విష్ణుపురాణం మూడో అధ్యాయం, దేవీ భాగవతం ఒకటో అధ్యాయంలో కనిపిస్తాయి.

కృత, త్రేత, ద్వాపర, కలి అనే నాలుగు యుగాలను కలిపి ఒక మహా యుగమంటారు. ఇలా అనేక మహాయుగాలు కాలగమనంలో వస్తూపోతూ ఉంటాయి. ప్రతి మహాయుగంలోని ద్వాపర యుగంలో శ్రీ మహావిష్ణువు స్వయంగా వ్యాసుడి రూపంలో అవతరిస్తాడు. వేదరాశిని విభజిస్తాడు. ఇప్పుడు నడుస్తున్నది వైవస్వత మన్వంతరం. ఇందులో ఇప్పటికి 27 మహా యుగాలు గడిచిపోయాయి. ఇరవై ఎనిమిదో మహాయుగంలో కలియుగం జరుగుతోంది. అంటే ఈ మన్వంతరంలో ఇప్పటికి 28 మంది వేదవ్యాసులు అవతరించారు.

- యల్లాప్రగడ మల్లిఖార్జునరావు


వేద వ్యాసులు వీరు...

1.స్వాయంభువుడు 2.ప్రజాపతి 3.ఉశనుడు 4.బృహస్పతి 5.సవిత 6.మృత్యువు 7.ఇంద్రుడు 8.వసిష్ఠుడు 9.సారస్వతుడు 10.త్రిధాముడు 11.త్రివృషుడు 12.భరద్వాజుడు 13.అంతరిక్షుడు 14.ధర్ముడు 15.త్రయ్యారుణి 16.ధనుంజయుడు 17.కృతంజయుడు 18.సంజయుడు 19.భరద్వాజుడు 20.గౌతముడు 21.ఉత్తముడు (ఇతన్ని హర్యాత్ముడు అని కూడా పిలుస్తారు) 22.వేనుడు (ఇతన్ని వాజశ్రవుడు అని కూడా పిలుస్తారు) 23.సోమశుష్మాయణుడు 24.రుక్షుడు 25.శక్తి 26.పరాశరుడు 27.జాతూకర్ణుడు 28.కృష్ణద్వైపాయనుడు. ఈ వరస క్రమంలో పన్నెండు, పందొమ్మిది మహా యుగాల్లో వేదవ్యాసుల పేర్లు ఒకటే కావడం విశేషం. ఇరవై తొమ్మిదో మహాయుగంలో అశ్వత్థామ వ్యాసుడిగా అవతరిస్తాడని పురాణాలు చెబుతున్నాయి.



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని