ఇలా ప్రారంభించండి!

అవి బుద్ధుడు జేతవనంలో విడిది చేసిన రోజులు. శిష్యులు, వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులతో హడావుడిగా ఉండేది...

Published : 31 Dec 2020 00:57 IST

అవి బుద్ధుడు జేతవనంలో విడిది చేసిన రోజులు.
శిష్యులు, వివిధ దేశాల నుంచి వచ్చిన భక్తులతో హడావుడిగా ఉండేది.
సామాన్యుల నుంచి కోటీశ్వరుల వరకు ఆయన దర్శనానికి వచ్చేవారు.
కొందరు స్వచ్ఛందంగా బుద్ధ విహారాల నిర్వహణకు శక్త్యానుసారం కానుకలు సమర్పించేవారు. అప్పటివరకు చేసిన పాపాలన్నీ నశించేందుకు ఆ సమర్పణలు సాయపడతాయని వారి నమ్మకం.

ఓ రోజు...

మరి కొద్ది నిమిషాల్లో బుద్ధుడు వస్తాడనగా, ఓ బందిపోటు అక్కడకు వచ్చాడు. అతని పేరు భృంగి. ఎన్నో హత్యలు చేశాడు. ఎంతో సొమ్ము దోచాడు. కానీ బుద్ధుడి గురించి విన్నాక అతనిలో మార్పు వచ్చింది. పాప పరిహారం చెల్లించి, పవిత్రుడిగా మారాలనుకున్నాడు. మోయగలిగినంత ధనాన్ని తెచ్చి కానుకగా సమర్పించాడు.
అపరాధభావంతో అందరి వెనకా కూర్చుని ఉన్నాడు.
బుద్ధుడు వచ్చాడు. తన ఆసనంలో కూర్చున్నాడు. ప్రసన్నవదనంతో అందరినీ కలియజూశాడు.
చిరు మందహాసంతో ‘భృంగీ! లేచి ఇటురా’ అని ఆహ్వానించాడు. భృంగి ఆశ్చర్యానికి అంతులేదు. అంతకు ముందు పరిచయమే లేదు. తననెలా గుర్తించాడా స్వామి.. ఆలోచనలతో సతమతమవుతూ బుద్ధుడికి సాష్టాంగ నమస్కారం చేశాడు. బుద్ధుడు చెయ్యెత్తి ఆశీర్వదించాడు.
‘భృంగీ! నువ్వెందుకొచ్చావో నాకు తెలుసు. నువ్వు పవిత్రుడవు, పాప రహితుడవు కావాలంటే విహారానికి ఘనంగా విరాళాలిస్తే చాలదు.’
భృంగి వినయంగా అడిగాడు..‘భగవాన్‌! నేనింకేం చేయాలో చెప్పండి...’
‘ప్రతి మనిషీ తన జీవితకాలంలో మంచి చెడులు చేస్తూనే ఉంటాడు. వాటి లెక్కలు సిద్ధమవుతూనే ఉంటాయి. రుణాలకు వడ్డీ ఉన్నట్టే , చెడు కర్మలకు ఫలితాలు ఉంటాయి. మన కర్మలకు ఆత్మను మించిన సాక్షి లేదు. పగలు చేసిన తప్పులకు రాత్రి పశ్చాత్తాపపడతారు. కానీ పగలు కాగానే అన్నీ మర్చిపోయి కొత్త తప్పులు చేస్తారు. కానీ అలా ఫలితం ఉండదు. కొత్త జీవితం మొదలుపెట్టాలి. తప్పులను వదిలేసి మంచి మార్గంలో ముందుకు సాగాలి. దీనికి దృఢ సంకల్పం చాలా అవసరం’.
‘భృంగీ! నువ్వు కొత్త మనిషిగా జీవించాలనుకుంటేనే నీ కానుకలను స్వీకరిస్తాను. లేదంటే వాటిని నువ్వు తీసుకెళ్లొచ్చు... ఇది భృంగికే కాదు.. అందరికీ వర్తిస్తుంది.’
బుద్ధుడి మాటలతో ఆశ్రమ ప్రాంతమంతా నిశ్చలత ఆవరించింది. తర్వాత అందరూ ముక్త కంఠంతో తమ ఆమోదం తెలిపారు. తమ జీవితంలో అద్భుతమైన మార్పును ఆహ్వానిస్తూ త్రిశరణాలను జపించారు.

 -కె.రాఘవేంద్రబాబు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని