Updated : 11 Feb 2021 01:50 IST

ఆదిశేషుడి చెంతకు కదిలింది దండు!

నేటి నుంచి నాగోబా జాతర

పచ్చని అడవుల మధ్య తెల్లని వస్త్రాలు ధరించి.. కాళ్లకు చెప్పులు లేకుండా ఒకే వరుసలో నడుస్తున్న వీరంతా ఎక్కడికి వెళ్తున్నారు? అసలు వీరెవరు?
ప్రపంచంలోనే రెండో అతి పెద్ద గిరిజన వేడుక నాగోబా జాతర. దీన్ని మెస్రం వంశస్థులు నిర్వహిస్తారు. అందుకోసం వీరు మంచిర్యాల జిల్లా జన్నారం మండలం హస్తనమడుగు నుంచి పవిత్ర గోదావరి జలాలను తీసుకొని కాలినడకన వేడుక కేంద్రమైన కేస్లాపూర్‌ చేరుకుంటారు. 15 రోజుల పాటు సాగే ఈ ప్రయాణంలో కాళ్లకు చెప్పులు లేకుండా తెల్లని వస్త్రాలు ధరించి ఒకే వరసలో నడుస్తారు. సుమారు 300 కిలోమీటర్లు సాగే ఈ యాత్రలో నాగుపాము మాదిరి ప్రయాణం చేస్తారు. కొండాకోనలు, గుట్టలు ఏం అడ్డొచ్చినా ముందుకు సాగుతూనే ఉంటారు. ఈ వరసకు పర్‌దాన్‌ నాయకత్వం వహిస్తారు. రెండో వ్యక్తిగా పూజారి ఉంటారు. చివర్లో మరో పరధాన్‌ ఉంటారు. ఉదయం బయలుదేరిన వీరు ఎక్కడా ఆగరు. ఒక వేళ ఆగాల్సి వస్తే.. నీరుండే ప్రదేశాల్లోనే సేదతీరుతారు. మొత్తం 115 మంది వరసలో వెళుతున్న సమయంలో వీరి మధ్యలోకి ఎవ్వరూ వెళ్లరు. ఈ పాదయాత్రే నాగోబా జాతరలో అత్యంత కీలకమైన ఘట్టం. పుష్య అమావాస్య అర్ధరాత్రి  మెస్రం వంశీయుల ప్రత్యేక పూజల అనంతరం నాగోబా జాతర ప్రారంభమవుతుంది.  

  - పొలుమూరు సింహాచలం, ఆదిలాబాద్‌

నాగోబా గోండుల ఆరాధ్యదేవత. తరతరాలుగా గిరిజనుల కొంగుబంగారం. స్థలపురాణం ప్రకారం 550 ఏళ్ల క్రితం శంకరుడి ఆశీస్సులతో ఆదిశేషుడు కేస్లాపూర్‌లో నాగదేవత లేదా నాగోబాగా వెలిసినట్లు చెబుతారు. నాగోబా ఆగమనంతో ఇక్కడి ప్రజల కష్టాలు తీరాయి. గ్రామాలు పాడిపంటలతో కళకళలాడాయి. ఏటా పౌష్య అమావాస్య రోజు హస్తనమడుగులో స్నానమాచరించి, ఆ జలాలతో తనకు అభిషేకం చేయాలని నాగోబా ఆదేశించాడని ప్రజలు నమ్ముతారు. అప్పటి నుంచి మంచిర్యాల జిల్లా జన్నారం మండలం  కలమడుగు గ్రామ సమీపంలో హస్తనమడుగు నుంచి తీసుకొచ్చిన జలంలో దేవతను అభిషేకించి జాతర జరుపుతారు.


 


Advertisement

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని