ఆలోచనల అదృశ్యమే ధ్యానం

జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు సారనాథ్‌లోని మృగదావనంలో కౌండిన్యుడు (కొండన్న), ఆయన నలుగురు శిష్యులకి సుదీర్ఘ ధర్మబోధ చేశాడు. దీన్నే ధర్మచక్రప్రవర్తన అంటారు. అందులో భాగంగా

Published : 17 Jun 2021 00:37 IST

జూన్‌ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం

జ్ఞానోదయం పొందిన తర్వాత బుద్ధుడు సారనాథ్‌లోని మృగదావనంలో కౌండిన్యుడు (కొండన్న), ఆయన నలుగురు శిష్యులకి సుదీర్ఘ ధర్మబోధ చేశాడు. దీన్నే ధర్మచక్రప్రవర్తన అంటారు. అందులో భాగంగా జీవితంలో ఆహ్వానించదగ్గవి అయిదు ఉన్నాయని అన్నాడు బుద్ధుడు. అవి. విశ్వాసం, జాగృతి, శక్తి, ధ్యానం, జ్ఞానం. వీటిలో ధ్యానం ప్రాధాన్యం చాలా గొప్పది. ఏమీ ఆలోచించకుండా నిశ్చలంగా ఉండటమే ధ్యానం. అంటే ఆలోచనలు ఆగిపోవటం. అదృశ్యం కావటం. అదే స్వచ్ఛమైన దర్శనం. ధర్మనిష్ఠతో ధ్యానించే వ్యక్తికి అపార శాంతి దొరుకుతుంది. నిరంతర ధ్యానపరాయణులు నిర్వాణంతో సంబంధం కలిగి నిష్కర్మసిద్ధి పొందుతారు. జ్ఞానం అంటే, స్వస్వరూప జ్ఞానం. అది హృదయంలోంచి పెల్లుబికి రావాలి. అది ధ్యానంలోనే సాధ్యం. నిర్వాణమంటే అశాశ్వతమైనవన్నీ అదృశ్యం కావటం.
ధ్యానం జీవితం నుంచి పలాయనం కాదు. నిజ జీవితంలోకి ప్రవేశం. కోర్కెల, వాంఛల, ఆలోచనల మనసు నుంచి పూర్తిగా బయటపడటం. ధ్యానం తెలిసిన వాడు ఏ క్షణంలోనైనా ఆ స్థితికి వెళ్లగలడు. ప్రయాణం చేస్తున్నా, తింటున్నా, ఊరికే కూర్చున్నా ఆంతర్యంలోకి ప్రవేశించటం ధ్యానం. దానివల్ల స్వేచ్ఛగా, నిర్భయంగా ఉండగలం. అహాన్ని పూర్తిగా ఊడ్చిపారేయటానికి, తానుగా తనను తెలుసుకోవటానికి ధ్యానమొక్కటే మార్గమని బౌద్ధులు గట్టిగా నమ్ముతారు. వర్షాకాలం నాలుగు నెలలూ బౌద్ధ సన్యాసులంతా ఒక చోట చేరి ప్రజలకు ధర్మబోధ చేస్తూ ధ్యానంలో గడిపేవారు. అదే చాతుర్మాసవిధి.

- దివ్యాన్షశ్రీ


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని