జమా ఖర్చుల ఆణివారం

పూర్వం మహంతులు తిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజున ఆలయ ఆదాయం, వ్యయం, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. దీన్నే శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానంగా (జులై 16) నిర్వహిస్తున్నారు. తితిదే ధర్మకర్తల మండలి ఏర్పడిన తరవాత వార్షిక బడ్జెట్‌ను మార్చి-ఏప్రిల్‌ నెలలకు మార్చారు.

Updated : 15 Jul 2021 01:12 IST

పూర్వం మహంతులు తిరుమల వేంకటేశ్వర స్వామి దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజున ఆలయ ఆదాయం, వ్యయం, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవి. దీన్నే శాస్త్రోక్తంగా ఆణివార ఆస్థానంగా (జులై 16) నిర్వహిస్తున్నారు. తితిదే ధర్మకర్తల మండలి ఏర్పడిన తరవాత వార్షిక బడ్జెట్‌ను మార్చి-ఏప్రిల్‌ నెలలకు మార్చారు. వార్షిక సాలకట్ల ఆణివార ఆస్థానం రోజున ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు ఆలయంలోని ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో మలయప్పస్వామిని, అభిముఖంగా గరుత్మంతుడిని ఒక పీఠంపై ఉంచుతారు. స్వామి సర్వసైన్యాధ్యక్షుడు విష్వక్సేనుడిని దక్షిణాభిముఖంగా మరో పీఠంపై వేంచేపు చేస్తారు. అనంతరం ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు చేసి, ప్రసాదాలు నివేదిస్తారు. ఆణివార ఆస్థానం సందర్భంగా తమిళనాడులోని శ్రీరంగం రంగనాథస్వామి ఆలయ అధికారులు శ్రీవారికి ఆరు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. వాటికి పూజలు జరిపి, మంగళవాయిద్యాల నడుమ ఆలయానికి తెస్తారు. నాలుగు వస్త్రాలను మూలవిరాట్టుకు, ఒకటి మలయప్పస్వామికి, మరొకటి విష్వక్సేనుడికి అలంకరిస్తారు. ‘లచ్చున’ అనే తాళపు చెవి గుత్తిని వేంకటేశుడి పాదాల చెంత ఉంచడంతో ఆస్థానం ముగుస్తుంది. సౌరమానాన్ని అనుసరించే తమిళుల ప్రకారం, ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అనే పేరు వచ్చింది.

- కొల్లా వెంకటేష్‌, తిరుమల, న్యూస్‌టుడే


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని